సాక్షి, తమిళనాడు: చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ మానవీయత వెలుగులోకి వచ్చింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఓ పోలీసును కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. చివరి ప్రయత్నంగా హైదరాబాద్ నుంచి ఓ టీకాను తెప్పించారు. ఈ టీకా రూపంలో క్రమంగా ఆ పోలీసు కోలుకుంటుండడం విశేషం. చెన్నైలో కమిషనరేట్ పరిధిలోని ఐపీఎస్‌ల నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు వందల మంది వరకు వైరస్‌కు చికిత్స పొందుతున్నారు. రెండు వందల మంది మేరకు డిశ్చార్జ్ అయ్యారు. విధులకు హాజరయ్యారు. కరోనా బారిన పడ్డ పోలీసులకు మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులో కమిషనర్ విశ్వనాథన్ సంప్రదింపులు జరుపుతున్నారు. చదవండి: కోవిడ్‌తో డీఎంకే ఎమ్మెల్యే మృతి
అదే సమయంలో సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడమే కాదు, వారిలో నెలకొన్న మానసిక వేదనను తొలగించేందుకు తగ్గట్టుగా ఈసీఆర్‌లో ప్రత్యేకంగా యోగా తరగతుల్ని నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ సిబ్బంది ప్రాణంమీదకు పరిస్థితి రావడంతో ఆయన హృదయం తల్లడిళ్లింది. ఆ సిబ్బందిని రక్షించేందుకు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి టీకాను తెప్పించి ఉండడం వెలుగు చూసింది. వెస్ట్ మాంబళం స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ పోలీసు కరోనా బారిన పడడంతో ఆయన పరిస్థితి విషమించింది. చివరి ప్రయత్నంగా హైదరాబాద్ నుంచి టీకాను తెప్పించేందుకు ప్రైవేటు వైద్యులు సిఫారసు చేశారు.
ఇదే టీకాను చివరి క్షణంలో ఉన్న ఎమ్మెల్యే అన్భళగన్‌ను రక్షించేందుకు సైతం ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆ టీకాను తెప్పించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఆ పోలీసుల కుటుంబానికి అడ్డు వచ్చింది. ఆ టీకా ఖరీదు రూ. 75 వేలు. మూడు రోజుల పాటుఆ టీకా వేయాల్సి ఉంటుంది. అది ఫలితాన్ని ఇస్తే సరి లేని పక్షంలో రూ 2.25 లక్షలు బూడిదలోపోసినట్టే. ఈ సమాచారం అందుకున్న సీపీ విశ్వనాథన్ తన మానవీయతను చాటుకున్నారు. తన సొంత ఖర్చుల నుంచి ఆ టీకాల్ని తెప్పించి ఇచ్చినట్టు సమాచారం. ఈ టీకా వాడకంతో ఆ పోలీసులు శరీరంలో క్రమంగా మార్పులు వస్తున్నట్టు, ఆరోగ్యం మెరుగు పడుతున్నట్టు వైద్యులు తేల్చడంతో సీపీ మానవీయత వెలుగులోకి వచ్చింది. చదవండి: తినేవస్తువు అనుకుని.. నాటుబాంబుని కొరికి
Comments
Please login to add a commentAdd a comment