chennai police commissioner
-
పోలీస్ కమిషనర్ మానవీయత
సాక్షి, తమిళనాడు: చెన్నై పోలీస్ కమిషనర్ ఏకే విశ్వనాథన్ మానవీయత వెలుగులోకి వచ్చింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఓ పోలీసును కరోనా వైరస్ నుంచి రక్షించేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. చివరి ప్రయత్నంగా హైదరాబాద్ నుంచి ఓ టీకాను తెప్పించారు. ఈ టీకా రూపంలో క్రమంగా ఆ పోలీసు కోలుకుంటుండడం విశేషం. చెన్నైలో కమిషనరేట్ పరిధిలోని ఐపీఎస్‌ల నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐదు వందల మంది వరకు వైరస్‌కు చికిత్స పొందుతున్నారు. రెండు వందల మంది మేరకు డిశ్చార్జ్ అయ్యారు. విధులకు హాజరయ్యారు. కరోనా బారిన పడ్డ పోలీసులకు మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ అధికారులో కమిషనర్ విశ్వనాథన్ సంప్రదింపులు జరుపుతున్నారు. చదవండి: కోవిడ్‌తో డీఎంకే ఎమ్మెల్యే మృతి అదే సమయంలో సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడమే కాదు, వారిలో నెలకొన్న మానసిక వేదనను తొలగించేందుకు తగ్గట్టుగా ఈసీఆర్‌లో ప్రత్యేకంగా యోగా తరగతుల్ని నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ సిబ్బంది ప్రాణంమీదకు పరిస్థితి రావడంతో ఆయన హృదయం తల్లడిళ్లింది. ఆ సిబ్బందిని రక్షించేందుకు సొంత ఖర్చులతో హైదరాబాద్ నుంచి టీకాను తెప్పించి ఉండడం వెలుగు చూసింది. వెస్ట్ మాంబళం స్టేషన్లో పనిచేస్తున్న ఓ పోలీసు కరోనా బారిన పడడంతో ఆయన పరిస్థితి విషమించింది. చివరి ప్రయత్నంగా హైదరాబాద్ నుంచి టీకాను తెప్పించేందుకు ప్రైవేటు వైద్యులు సిఫారసు చేశారు. ఇదే టీకాను చివరి క్షణంలో ఉన్న ఎమ్మెల్యే అన్భళగన్ను రక్షించేందుకు సైతం ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆ టీకాను తెప్పించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఆ పోలీసుల కుటుంబానికి అడ్డు వచ్చింది. ఆ టీకా ఖరీదు రూ. 75 వేలు. మూడు రోజుల పాటుఆ టీకా వేయాల్సి ఉంటుంది. అది ఫలితాన్ని ఇస్తే సరి లేని పక్షంలో రూ 2.25 లక్షలు బూడిదలోపోసినట్టే. ఈ సమాచారం అందుకున్న సీపీ విశ్వనాథన్ తన మానవీయతను చాటుకున్నారు. తన సొంత ఖర్చుల నుంచి ఆ టీకాల్ని తెప్పించి ఇచ్చినట్టు సమాచారం. ఈ టీకా వాడకంతో ఆ పోలీసులు శరీరంలో క్రమంగా మార్పులు వస్తున్నట్టు, ఆరోగ్యం మెరుగు పడుతున్నట్టు వైద్యులు తేల్చడంతో సీపీ మానవీయత వెలుగులోకి వచ్చింది. చదవండి: తినేవస్తువు అనుకుని.. నాటుబాంబుని కొరికి -
నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్
సాక్షి, పెరంబూరు(చెన్నై): మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ఇప్పటికే కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవలసిందిగా తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో గానీ, తాజాగా తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో కే.భాగ్యరాజ్‌పై ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఒక సినీ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ సూది తావివ్వకపోతే దారం అందులోకి పోలేదని అంటారన్నారు. ఆ విధంగా స్త్రీలు అవకాశం ఇవ్వడంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి మహిళలు జాగరూకతతో ఉండాలన్నారు. ఈ విషయంలో మగవారిని తప్పు పట్టడం సరికాదన్నారు. మగవారు తప్పు చేస్తే కాలానుగుణంగా సమసిపోతుందన్నారు. అదే ఆడది తప్పు చేస్తే అది చాలా చేటుకు దారి తీస్తుందన్నారు. అందువల్ల మహిళలు కట్టుబాట్లు విధించుకోవాలని అన్నారు. ఇప్పుడు మోబైల్ఫోన్ల అభివృద్ధి కారణంగా మహిళలు ఎక్కడికో వెళ్లిపోతున్నారనీ, అందువల్ల తప్పులు జరుగుతున్నాయని అన్నారు. ఆ మధ్య పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార సంఘటనలో మగవారిని మాత్రమే తప్పు పట్టలేమన్నారు. మహిళల బలహీనతను మగవారు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. మగవారిది తప్పు అయితే అందుకు అవకాశం కల్పించిన మహిళలదీ తప్పే అవుతుందని అన్నారు. అలా మహిళలందరినీ కించపరచేలా మాట్లాడిన కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు కళైసెల్వి చెన్నై పోలీస్ కార్యాలయంలో గురువారం చేసిన పిర్యాదులో పేర్కొన్నారు. నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్ ఈ వ్యవహారంపై దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆయన ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ అత్యాచారాలు హద్దు మీరుతున్న సంఘటనల్లో ఆడ, మగ ఇద్దరిదీ తప్పు ఉంటుందని, అలాంటి సమయాల్లో మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే అలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదనే రీతిలో తాను మాట్లాడానని చెప్పారు. ఉదాహరణకు ఒక సినిమాలోనో, సీరియల్లోనో సీరియస్‌గా మనసుగా ఆవేదన కలిగించే సన్నివేశం ఉంటే దాన్ని రాసిన రచయితను ఎవరూ తిట్టరని, తెరపై కనిపించే కథా పాత్రలనే తిట్టిపోస్తారని అన్నారు. మన సమాజంలో స్త్రీలను దైవంగా భావిస్తారన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే సమస్యలకు ఆస్కారం ఉండదన్న భావంతోనే తాను మాట్లాడానని చెప్పారు. తన కాలంలో మహిళలకు ఉండే కట్టుబాట్లు ఇప్పుడు లేవన్నారు. ఇప్పుడు వారికి సాంకేతికపరమైన అభివృద్ధితో అన్ని రకాలుగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు లభిస్తున్నాయని అన్నారు. పురుషాధిక్యం, స్వేచ్ఛ అంటూ మహిళలు మద్యం చేవించడం, పొగతాగడం వంటి చెడు అలవాట్లతో కట్టుబాట్లను వీరడం బాధనిపిస్తోందన్నారు. అదేవిధంగా స్త్రీలు తప్పుదారి పట్టడంతో అది వారినే కాకుండా వారి కుటుంబాలను బాధిస్తుందన్నారు. కాబట్టి తప్పు జరగడానికి మహిళలు కారణం అన్నాను కానీ, మహిళలు మాత్రమే కారణం అని అనలేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వ్యతిరేకతకు కారణం అనీ, దీన్ని సరిగా అర్థం చేసుకున్న పలువురు దర్శకులు నిజాన్ని ధైర్యంగా చెప్పావంటూ తనను అభినందిస్తున్నారని కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు. -
పోలీసులూ..తస్మాత్ జాగ్రత్త
సాక్షి, చెన్నై : ‘ పోలీసులూ...తస్మాత్ జాగ్రత్త’ అంటూ చెన్నై కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. హెల్మెట్ ధరించకుండా వెళ్లే పోలీసులకు జరిమానా విధించాలని, మద్యం మత్తులో వాహనం నడిపే పోలీసులపై కేసులు నమోదు చేయాలని ట్రాఫిక్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. మద్యం మత్తులో పట్టుబడే పోలీసుల వివరాలతో నివేదికను కమిషనరేట్‌కు పంపిస్తే, క్రమశిక్షణ చర్య తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య çకట్టడి లక్ష్యంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. గతంలో మద్రాసు హైకోర్టు హుకుం జారీ చేయడంతో వాహన చోదకుల నెత్తిన హెల్మెట్లు కొంతకాలం దర్శనం ఇచ్చాయి. ఈ సమయంలో ధరలు ఆకాశాన్ని అంటినా హెల్మెట్లను కొనుగోలు చేయకతప్పలేదు. ఇందుకు కారణం పోలీసులు జరిమానా మోత మోగించడమే. కొంతకాలం హెల్మెట్ తప్పనిసరి అన్న నినాదం మిన్నంటినా, క్రమంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగింది. మళ్లీ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో వాహనం నడిపేవారే కాదు, వెనుక సీట్లో కూర్చున్న వాళ్లూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హెల్మెట్ గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించి చైతన్యం తీసుకొచ్చే విధంగా కమిషనర్ విశ్వనాథన్ నేతృత్వంలో కార్యక్రమాలు సాగాయి. అలాగే, చెన్నైలో అనేక ప్రాంతాల్ని, ప్రధాన మార్గాల్ని కలుపుతూ హెల్మెట్ జోన్స్ ప్రకటించారు. ఈ మార్గాల్లో హెల్మెట్ తప్పనిసరి చేసి, కొరడా ఝుళిపించారు. చివరకు ఈ ప్రయత్నం కూడా కొన్నాళ్లే అన్నట్టుగా సాగింది. దీంతో హెల్మెట్ ధరించే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. పోలీసులు సైతం హెల్మెట్లు ధరించడం లేదన్న వాదన తెరపైకి వచ్చింది. వ్యవహారం మరో మారు మద్రాసు హైకోర్టుకు చేరగా, గత వారం విచారణ సమయంలో పోలీసులు న్యాయమూర్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. హెల్మెట్ ధరించాల్సిందే.. గత వారం విచారణ సమయంలో న్యాయమూర్తులు పోలీసులకు తీవ్ర హెచ్చరికలు చేయడంతో పాటుగా అక్షింతలు వేసే విధంగా స్పందించారు. అలాగే, హెల్మెట్లు ధరించని వాహన చోదకులు లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయ కూడదని ప్రశ్నించారు. వాహనం నడిపే వాళ్లు, వెనుక సీట్లు ఉన్న వాళ్లు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని, అలా ధరించని వారి వాహనాలు సీజ్ చేయాలన్నట్టుగా కోర్టు స్పందించింది. కోర్టు తీవ్ర హెచ్చరికలు, ఆగ్రహం నేపథ్యంలో ఇక, హెల్మెట్ కొరడా ఝుళిపించేందుకు తగ్గట్టుగా పోలీసులు సిద్ధమయ్యారు. వాహన చోదకులతో కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా తమ సిబ్బందికి సైతం హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వడమే కాదు, హెల్మెట్ ధరించని పోలీసులకు సైతం జరిమానా విధించే విధంగా కమిషన్ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. అధికారులతో కమిషనర్ సమాలోచన.. కమిషనరేట్ ఆదివారం పోలీసు అధికారులతో ఏకే విశ్వనాథన్ భేటీ అయ్యారు. గంటన్నర పాటుగా సాగిన భేటీ అనంతరం ట్రాఫిక్ విభాగానికి ›ప్రత్యేక ఆదేశాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. చెన్నై కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి పోలీసులు ఇక, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ఎవరైనా పోలీసులు రోడ్డెక్కినా, అట్టి వారికి జరిమానా విధించాలన్నారు. నిబంధనలు అన్నది అందరికీ వర్తిస్తుందని, సోమవారం నుంచి హెల్మెట్ ధరించని పోలీసులకు జరిమానా విధించే విధంగాముందుకు సాగాలని ఆదేశించారు. విధి నిర్వహణ నిమిత్తం వెళ్తున్నా, సొంత పని మీద వెళ్తున్నా, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారు. అలాగే, ఎవరైనా పోలీసు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ పక్షంలో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇలా పట్టుబడే వారి వివరాలను నివేదిక రూపంలో కమిషనరేట్‌కు పంపించాలని, దీని ఆధారంగా మద్యం తాగి వాహనాలు నడిపే పోలీసుల మీద శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగం ఈ ఆదేశాలు, ఉత్తర్వులను తప్పనిసరిగా అనుసరించాలని, జరిమానా విధింపు, కేసుల నమోదులో వెనక్కు తగ్గ వదని హుకుం జారీ చేశారు. కాగా, పోలీసులకే జరిమానా మోత మోగించే విధంగా ఆదేశాలు జారీ చేసి ఉన్న నేపథ్యంలో ఇక, సామాన్యులు నెత్తిన హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన పక్షంలో, జరిమాన కొరడా మరింతగా మోగడం ఖాయం. ఈ దృష్ట్యా, ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించడం శ్రేయస్కరం. -
దర్శక నిర్మాతపై శ్రీ రెడ్డి ఫిర్యాదు
కాస్టింగ్ కౌచ్‌పై పోరాటంతో వార్తల్లో నిలిచిన శ్రీ రెడ్డి అన్నంత పని చేసేశారు. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కోలీవుడ్ నటుడు, ప్రముఖ దర్శక నిర్మాత వారాహిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన తనను బెదిరించారంటూ చెన్నై పోలీసు కమిషనర్‌లో శుక్రవారం ఓ ఫిర్యాదు లేఖను ఆమె అందజేశారు. ‘సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న వారి బండారాన్ని నేను బయటపెడుతున్నాను. అయితే గత 24వ తేదీన నటుడు, దర్శక, నిర్మాత వారాహి.. మీడియాలో సమావేశంలో వ్యభిచారిగా చిత్రీకరిస్తూ నా గురించి తప్పుగా మాట్లాడారు. నాకు ఫోన్ చేసి బెదిరించారు. ఇది నన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. వారాహిపై లైంగిక వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని ఫిర్యాదులో శ్రీ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మురగదాస్, లారెన్స్‌లపై ఆమె ఆరోపణలు చేయగా.. వారాహి మీడియా సమావేశం నిర్వహించి మరీ శ్రీ రెడ్డిపై వేశ్య కామెంట్లు చేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికపై ఆమె హెచ్చరించారు కూడా. ఇక నటీమణులపై లైంగిక వేధింపుల గురించి నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీలకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా, వాళ్లు తనను పట్టించుకోలేదని శ్రీ రెడ్డి ఆరోపిస్తున్నారు. త్వరలో పూర్తిగా చెన్నైలో స్థిరపడే ఆలోచనలో ఉన్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, చెన్నై : నటి జ్యోతికపై హిందూ మక్కళ్ కట్చి నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాచియార్. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ఇంతకు ముందే తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పలు సంఘాల వ్యతిరేకతతో ఆ సన్నివేశాల్లోని సంభాషణలను చిత్ర వర్గాలు బీప్ చేశారు. ఈ నేపథ్యంలో నాచియార్ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదల అయింది. అందులోని మరి కొన్ని సన్నివేశాలు వివాదానికి తెరలేపాయి. దీంతో హిందూ మక్కళ్ కట్చి ప్రచార విభాగ అధ్యక్షుడు కాళీకుమార్ నిన్న చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాచియార్ చిత్రంలో జ్యోతిక ఒక సన్నివేశంలో ‘మాకు ఆలయాలయినా, చెత్తకుప్పలు అయినా ఒకటే’ అంటూ మాట్లాడిన సంభాషణలు హిందూ దేవాలయాలను అవమానించేవిగానూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సంభాషణలను వెంటనే తొలగించి, జ్యోతిక, దర్శకుడు బాలాపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘కత్తి’లాంటి బర్త్‌డే పార్టీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రౌడీ..బర్త్‌డే వేడుకకు అట్టహాసంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. వాసన పసిగట్టిన పోలీసులు ఆఖరి నిమిషంలో ఎంటర్ కావటంతో కథ రివర్సయింది. చెన్నై సూలైమేడుకు చెందిన బిన్నీ (40)కి పెద్ద రౌడీ అనే పేరుంది. చెన్నైకి చెందిన ఓ మంగళవారం ఇతని పుట్టిన రోజు కావటంతో నగర శివార్లలోని ఓ లారీ షెడ్డులో వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాడు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన 150 మందికి పైగా రౌడీలకు ఆహ్వానాలు పంపాడు. రాత్రికల్లా అందరూ షెడ్డు వద్దకు చేరుకోగా బాణసంచాతో వారికి స్వాగతం పలికారు. ఆనవాయితీ ప్రకారం బిన్నీ పిడికత్తితో కేక్ కూడా కోశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో అంబత్తూరు డిప్యూటీ కమిషనర్ సర్వేష్రాజ్ నేతృత్వంలో 70 మంది పోలీసులు మెరుపుదాడి చేసి 75మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. బిన్నీతోపాటు మరో 50 మంది మాత్రం తప్పించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న మారణాయుధాలతోపాటు 50కి పైగా సెల్ఫోన్లు, 50 బైకులు, 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాల ప్రణాళిక, సమాచారం చేరవేత, అమలు కోసం రౌడీలంతా సెల్ఫోన్లలో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపును కూడా నడుపుతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెన్నై పోలీస్ కమిషనర్ విశ్వనాథన్ తెలిపారు. రౌడీల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్న మారణాయుధాలు, మొబైల్ ఫోన్లు. -
ఇది డైరీ కథ!
డీజీపీ పదవికే ఎసరు పెట్టిన వైనం సచివాలయంలో రసవత్తర చర్చ సాక్షి ప్రతినిధి, చెన్నై: అత్యంత ప్రముఖుల జీవితాల్లో చోటుచేసుకున్న కొన్ని సంఘటనల వెనుక ఆసక్తికరమైన విషయాలు దా గి ఉంటాయని మాజీ డీజీపీ అశోక్‌కుమార్ విషయంలో మరోసారి రుజువైంది. కీలకమైన ఒక డైరీ వ్యవహారమే ఆయన నిష్ర్కమణకు దారితీసినట్లు తెలుస్తోంది. సచివాలయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర చెన్నైలో పాన్, గుట్కా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయనే సమాచారాన్ని అందుకున్న ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఇటీవల ఆకస్మికదాడులు నిర్వహించారు. మాధవరావు, శ్రీనివాసరావు అనే సోదరులకు చెందిన గిడ్డంగుల నుంచి కోట్ల రూపాయల విలువైన సరుకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల సమయంలో రావు సోదరుల నుంచి ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో అప్పటి చెన్నై పోలీస్ కమిషనర్‌గా ఉన్న జార్జ్ పేరు మొదలుకుని సచివాలయంలోని పలువురి అధికారులకు చెల్లిస్తున్న ‘కప్పం’ లెక్కల వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఎంతో కీలకమైన ఈ డైరీ ఆదాయపు పన్నుశాఖ అధికారుల చేతికి చిక్కడం కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో వణుకు పుట్టించి హాట్ టాపిక్‌గా మారింది. అంతేగాక అమ్మ సామ్రాజ్యానికి కొందరు అధికారులను దూరంగా పెట్టి ఏకాకిగా మారుస్తున్న గార్డెన్‌కు చెందిన అధికారుల పేర్లు కూడా డైరీలో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి నెలకు రూ.20 లక్షల ‘కప్పం’ కడుతున్నట్లు డైరీలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అనాడు పోలీస్ కమిషనర్‌గా ఉండిన జార్జ్‌కు గార్డెన్తో సన్నిహిత సంబంధాలు ఉన్నందున డీజీపీ అశోక్‌కుమార్ ఆదేశాలను ఖాతరు చేయలేదని తెలుస్తోంది. అయితే అదనుకోసం వేచిఉన్న అశోక్‌కుమార్ ఎట్టకేలకూ కమిషనర్ బాధ్యతల నుంచి జార్జ్‌ను తప్పించి టీకే రాజేంద్రన్‌ను నియమించగలిగారు. కమిషనర్ బాధ్యతల్లో లేకున్నా గార్డెన్ సంబంధాలను జార్జ్ కొనసాగించగలిగారు. తనంటే లెక్కచేయని జార్జ్ తదితర అధికారులను గుప్పిట్లో ఉంచుకునేందుకు సదరు డైరీని చేజిక్కించుకోవాలని అశోక్‌కుమార్ పథకం పన్నారు. డైరీలోని వివరాలతో ఒక నకలును ఆదాయపు పన్నుశాఖాధికారుల నుంచి సంపాదించాల్సిందిగా సీబీఐలో ఉన్న ఒక ఉన్నతాధికారిని అశోక్‌కుమార్ ఆదేశించారు. సదరు అధికారి ఆదాయపు పన్నుశాఖ అధికారుల వద్దకు స్వయంగా వెళ్లి కోరగాతమ వద్ద ఉన్న డైరీ నుంచి నక ళ్లను ఇవ్వడం కుదరదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారమంతా గార్డెన్‌కు చెందిన సచివాలయ అధికారుల బృందం చెవినపడింది. అశోక్‌కుమార్ సదరు డైరీ నకళ్లను సంపాదించి డీఎంకే అధ్యక్షులు కరుణానిధికి ఇచ్చే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి జయలలితకు గార్డెన్ అధికారులు ఫిర్యాదులు మోసారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కరుణానిధిని డీజీపీ అశోక్‌కుమార్ కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజా పరిణామంతో జయలలిత మరింతగా మండిపడ్డారు. తన పట్ల జయ అగ్రహంతో ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న అశోక్‌కుమార్ ఇక పదవిలో ఉండడం సాధ్యం కాదని తెలుసుకుని రాత్రికి రాత్రే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) నిర్ణయం తీసుకున్నారు. అశోక్‌కుమార్‌ను డీజీపీ పదవి నుంచి సాగనంపేందుకు ఇదే సమయమని భావించి జయలలిత సైతం వీఆర్ఎస్కు ఆమోదముద్ర వేయడంతో రాత్రికి రాత్రే ఆయన ఆఫీసును వదిలి వెళ్లిపోయారు. డీజీపీ స్థాయి అధికారి పదవీ విరమణ పొందినపుడు ప్రొటోకాల్ ప్రకారం ఇతర అధికారులందరూ కలిసి ఇవ్వాల్సిన ఘనమైన వీడ్కోలు స్వీకరించకుండానే అశోక్‌కుమార్ నిష్ర్కమించాల్సి వచ్చింది. -
'రజనీకాంత్‌ను వృద్ధాశ్రమంలో చేర్చండి'
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రం విడుదలైనా... ఆ సినిమా గురించి రోజుకో వార్త వెలువడుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ యువకుడు తాను మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే... రజనీకాంత్‌ను తమిళ నిర్మాతల నుంచి కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చాలంటూ చెన్నై వడపళినికి చెందిన కందస్వామి అనే వ్యక్తి నగర పోలీస్ కమిషనర్ కు రెండురోజుల క్రితం ఓ వినతిపత్రం సమర్పించాడు. 'రజనీకాంత్ హీరోగా ఇటీవల విడుదలైన కబాలీకి ఎక్కువగా ప్రచారం చేసి వెంటనే చూడాలనే ఆసక్తిని రేకెత్తించారు. దీంతో అశోక్ నగర్ లోని కాశీ థియేటర్లో రూ.1200లకు టికెట్ కొని కబాలి సినిమా చూశాను. అయితే హీరో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ ఇద్దరూ మోసం చేశారు. 66 ఏళ్ల సీనియర్ సిటిజన్ అయిన రజనీకాంత్ చేత ఫైట్స్ చేయించి నిర్మాత, దర్శకులు నన్ను చిత్రవధ చేశారు. సీనియర్ సిటిజన్స్‌కు తమిళనాడు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తమిళ నిర్మాతల నుంచి రజనీకాంత్ ను కాపాడి వృద్ధాశ్రమంలో చేర్చండి.' అంటూ కందస్వామి వినతిపత్రంలో పేర్కొన్నాడు. -
సవాళ్లు.. ప్రతి సవాళ్లు
సాక్షి, చెన్నై : కాంగ్రెస్‌లో సవాళ్లు...ప్రతి సవాళ్ల వార్ నడుస్తోంది. ఈవీకేఎస్, ప్రత్యర్థి వర్గం మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఈవీకేఎస్ ఆరోపణలకు గురువారం తంగబాలు ప్రతి సవాల్ విసిరారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కొందరు కాంగ్రెస్ వాదులు ఏకంగా చెన్నై పోలీసు కమిషనర్‌కు ఈవీకేఎస్‌పై ఫిర్యాదు చేశారు. రాష్ర్ట కాంగ్రెస్‌లో పదవీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ను పదవీచ్యుతుడ్ని చేయించి, ఆ కుర్చీని తమలో ఎవరో ఒకరు దక్కించుకోవాలని 11 మందితో కూడిన గ్రూపు నేతలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. పంచాయతీ ఢిల్లీ వరకు వెళ్లి వచ్చింది. పార్టీ రాష్ట్ర నేతల తీరుపై అధిష్టానం పెద్దలు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు మూడు రోజులుగా ఈవీకేఎస్ను పదవి నుంచి తప్పించడం కోసం గ్రూపు నేతలు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఈ వ్యవహారం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు, సవాళ్లకు దారితీస్తోంది. తన మీద ఫిర్యాదు చేసినట్టు బహిరంగంగా మాజీ అధ్యక్షుడు తంగబాలు ప్రకటించడంతో ఆయనపై ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యక్తిగత ఆరోపణలతో నోరు జారారు. దీంతో కాంగ్రెస్ నేతల అక్రమార్జన చర్చ తెరమీదకు వచ్చింది. నువ్వింత సంపాదించావంటే కాదు నువ్వింత సంపాదించావని ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో గురువారం ఈవీకేఎస్ ఇళంగోవన్‌పై టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు తంగబాలు తీవ్రంగానే స్పందించారు. చర్చకు రెడీ అంటూ ప్రతి సవాల్ విసిరారు. తంగబాలు మీడియాతో మాట్లాడుతూ తానేదో ప్రభుత్వ పోరంబోకు స్థలాల్ని కబ్జా చేసి, ఇంజినీరింగ్ కళాశాలలు కట్టినట్టుగా ఆరోపిస్తున్న ఆ పెద్ద మనిషి, తనతో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. జానపద కళాకారుడు కోవన్ తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలతో కూడిన పాటల్ని గతంలో పాడిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసి ఉన్నారని, ఆ అరెస్టును ఖండిస్తూ, కోవన్కు మద్దతుగా ఈవీకేఎస్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆ విషయమై చర్చించడానికే ఢిల్లీ వెళ్లామని చెప్పారు. ఎవర్నో పదవి నుంచి తప్పించాలనో, మరెవర్నో కూర్చోబెట్టాలనో తాము ఢిల్లీకి వెళ్లలేదని అన్నారు. ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే రీతిలో వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు ఈవీకేఎస్ దిగడాన్ని ఖండించారు. తాను ఒక్క సె.మీ స్థలాన్ని కూడా ఆక్రమించలేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని హితవుపలికారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ వాదులు కొందరు ఏకంగా ఈవీకేఎస్, ఆ పార్టీ మరో నేత గోపన్నపై గురువారం చెన్నై కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఆరాధ్యుడు పొసుం పొన్ ముత్తురామ దేవర్‌కు వ్యతిరేకంగా గోపన్న పార్టీ కార్యక్రమంలో స్పందించారని, ఇందుకు ఈవీకేఎస్ ఎలాంటి అడ్డు చెప్పకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తమ ఆరాధ్య నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ వ్యవహారం ఈవీకేఎస్‌కు ఎలాంటి ఇబ్బంది తెచ్చి పెడుతుందో చూడాలి. ఆయనకు మద్దతుగా పార్టీ అధికార ప్రతినిధి కుష్భు మాత్రం ఢిల్లీ పెద్దల వద్ద స్పందించి ఉండటం విశేషం. -
భర్తపై ఫిర్యాదు చేసిన లిజి
ఆస్తుల వ్యవహారంలో నటి లిజి తన భర్త దర్శకుడు ప్రియదర్శన్‌పై ఆదివారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నటుడు కమలహాసన్ నటించిన విక్రమ్ తదితర చిత్రాలతోపాటు తెలుగు, మలయాళం భాషల చిత్రాల్లో కథానాయికగా నటించిన లిజి ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్య లిజికి ప్రియదర్శన్‌కు మధ్య మనస్పర్థలు తలెత్తగా నటుడు కమలహాసన్ తదితర సినీ ప్రముఖులు ఇద్దరి మధ్య సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అనంతరం మళ్లీ విభేదాలు తలె త్తడంతో విడిపోయారు. ఇప్పుడు వీరి మధ్య ఆస్తుల పంపకాల్లో గొడవలు మొదలయ్యాయని సమాచారం. ఈ వ్యవహారంపై నటి లిజి ఆదివారం ఉదయం చెన్నై ఎగ్మూర్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన మీడియా అక్కడకు చేరింది. అరుుతే పోలీసులు లిజిని పత్రికల వారితో మాట్లాడరాదని షరతులు పెట్టారు. ఫిర్యాదు నమోదు చేసుకుని పోలీసు కమిషనర్ కార్యాలయం వెనుకభాగం నుంచి ఆమెను పంపించేశారు. గంటల తరబడి వేచి వున్న మీడియా చివరికి నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. -
త్రిపాఠి అవుట్.. జార్జ్ ఇన్!
లోక్ సభ ఎన్నికల కోసం నియమించిన చెన్నై పోలీసు కమిషనర్ త్రిపాఠి బుధవారం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కమిషనర్‌గా జార్జ్ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని నగరంలో భద్రత పటిష్టం, అనుక్షణం నిఘా లక్ష్యంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దించనున్నట్టు జార్జ్ ప్రకటించారు. సాక్షి, చెన్నై:లోక్‌సభ ఎన్నికల వేళ ఈసీ కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. అధికారుల బదిలీలు ఓ వైపు సాగితే, మరో వైపు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను ఆగమేఘాలపై మరోచోటకు ఎన్నికల కమిషన్ మార్చింది. ఆ దిశగా చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన జార్జ్‌పై ఆరోపణలు వచ్చారుు. అధికార పక్షానికి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే ఫిర్యాదులు మోత మోగించింది. దీంతో జార్జను తప్పించాల్సి వచ్చింది. ఆయన్ను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో జైళ్ల శాఖ అదనపు డీజీపీ త్రిపాఠిని రంగంలోకి దించారు. జార్జ్‌ను జైళ్ల శాఖకు పంపించారు. నెల రోజులకు పైగా త్రిపాఠి చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల నిబంధనలను ఈసీ సడలించింది. దీంతో ఎన్నికల వేళ బదిలీల వేటు, ఆగమేఘాలపై మార్పులకు గురైన అధికారులు మళ్లీ తమ తమ స్థానాల్లోకి వచ్చే పనిలో నిమగ్నమయ్యారు. బాధ్యతల స్వీకరణ: ఎన్నికల పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన త్రిపాఠి ఉదయం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో కమిషనర్ పగ్గాలను జార్జ్‌కు అప్పగించారు. పూందమల్లి హైరోడ్డులోని కమిషనరేట్‌లో ఉదయం జార్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఇరువురు కరచాలనం చేసుకున్నారు. త్రిపాఠికి వీడ్కోలు పలికారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జార్జ్‌కు అదనపు, డెప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక బృందాలు: రాజధాని నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నామని జార్జ్ పేర్కొన్నారు. మీడియా తమ వంతుగా అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. కొన్ని కేసుల ఛేదింపుల్లో మీడియా సహకారం ఆమోఘం అని, ఇది మరింతగా విస్తృతం కావాలని కోరారు. నేరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటూ వస్తున్నా, కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయని వివరించారు. సినీ ఫక్కీలో సాగుతోన్న నేరాలను కట్టడి చేయడం లక్ష్యంగా నిఘాను మరింత పటిష్ట వంతం చేయబోతున్నామన్నారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు రంగంలోకి దించబోతున్నామని పేర్కొన్నారు. నగరంలోని ఆయా పోలీసు డివిజన్లలోని అసిస్టెంట్ కమిషనర్ల నేతృత్వంలో ఈ బృందాలు ఏర్పాటు చేయనున్నాట్లు వివరించారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాలను, సంఘవిద్రోహ శక్తులు, నేరగాళ్ల కదలికలను ఈ బృందాలు ఎప్పటికప్పుడు పసిగడుతూ వస్తాయని చెప్పారు. అలాగే, రైల్వే స్టేషన్లలో సమష్టి భద్రతకు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఆర్పీఎఫ్తో సంప్రదింపులు జరపనున్నామని, సమీక్షల అనంతరం రైల్వే స్టేషన్లలో నిఘా కట్టుదిట్టానికి సమష్టిగా నిర్ణయాలు తీసుకోనున్నామన్నారు. కొన్ని చోట్ల చాప కింద నీరులా సాగుతున్న రౌడీల వ్యవహారాలు పసిగట్టి, వారి భరతం పడతామని హెచ్చరించారు. నేరాలకు పాల్పడుతున్న వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చేందుకు వీల్లేని రీతిలో నాన్ బెయిల్ కేసు గూండా చట్టంను అత్యధికంగా ప్రయోగించనున్నట్లు చెప్పారు. ఇక, గూండా చట్టాల మోత తప్పదని, తస్మాత్ జాగ్రత్త అంటూ నేరగాళ్లకు, అజ్ఞాతంలో ఉన్న రౌడీలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. -
నకిలీ ఫేస్‌బుక్‌తో దుష్ర్పచారం
హాస్యనటుడు సూరి ఫిర్యాదు తమిళసినిమా, న్యూస్‌లైన్: తన పేరుతో నకిలీ ఫేస్బుక్, ట్విట్టర్లు ప్రారంభించి దుష్ర్పచారం చేస్తున్నారంటూ హాస్యనటుడు సూరి శుక్రవారం ఉదయం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను తమిళ సినిమాలో హాస్యనటుడుగా వెలుగొందుతున్నట్లు తెలిపారు. నటుడు రజనీకాంత్ గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు కొందరు పాత్రికేయ మిత్రులు ప్రశ్నించడంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. దీని గురించి ఆరా తీయగా తన పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ , ట్విట్టర్‌ను నెలకొల్పి తాను చెప్పినట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారని తెలిపారు. తాను ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించే స్థాయికి చదువుకోలేదని పేర్కొన్నారు. తన పేరుతో నకిలీ ఫేస్బుక్, ట్విట్టర్లను ప్రారంభించి దుష్ఫచారం చేస్తున్న వారిని కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని నటుడు సూరి కోరారు.