సాక్షి, చెన్నై : ‘ పోలీసులూ...తస్మాత్ జాగ్రత్త’ అంటూ చెన్నై కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. హెల్మెట్ ధరించకుండా వెళ్లే పోలీసులకు జరిమానా విధించాలని, మద్యం మత్తులో వాహనం నడిపే పోలీసులపై కేసులు నమోదు చేయాలని ట్రాఫిక్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. మద్యం మత్తులో పట్టుబడే పోలీసుల వివరాలతో నివేదికను కమిషనరేట్‌కు పంపిస్తే, క్రమశిక్షణ చర్య తీసుకుంటామని ప్రకటించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య çకట్టడి లక్ష్యంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. గతంలో మద్రాసు హైకోర్టు హుకుం జారీ చేయడంతో వాహన చోదకుల నెత్తిన హెల్మెట్లు కొంతకాలం దర్శనం ఇచ్చాయి. ఈ సమయంలో ధరలు ఆకాశాన్ని అంటినా హెల్మెట్లను కొనుగోలు చేయకతప్పలేదు. ఇందుకు కారణం పోలీసులు జరిమానా మోత మోగించడమే. కొంతకాలం హెల్మెట్ తప్పనిసరి అన్న నినాదం మిన్నంటినా, క్రమంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగింది. మళ్లీ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో వాహనం నడిపేవారే కాదు, వెనుక సీట్లో కూర్చున్న వాళ్లూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హెల్మెట్ గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించి చైతన్యం తీసుకొచ్చే విధంగా కమిషనర్ విశ్వనాథన్ నేతృత్వంలో కార్యక్రమాలు సాగాయి. అలాగే, చెన్నైలో అనేక ప్రాంతాల్ని, ప్రధాన మార్గాల్ని కలుపుతూ హెల్మెట్ జోన్స్ ప్రకటించారు. ఈ మార్గాల్లో హెల్మెట్ తప్పనిసరి చేసి, కొరడా ఝుళిపించారు. చివరకు ఈ ప్రయత్నం కూడా కొన్నాళ్లే అన్నట్టుగా సాగింది. దీంతో హెల్మెట్ ధరించే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. పోలీసులు సైతం హెల్మెట్లు ధరించడం లేదన్న వాదన తెరపైకి వచ్చింది. వ్యవహారం మరో మారు మద్రాసు హైకోర్టుకు చేరగా, గత వారం విచారణ సమయంలో పోలీసులు న్యాయమూర్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.
హెల్మెట్ ధరించాల్సిందే..
గత వారం విచారణ సమయంలో న్యాయమూర్తులు పోలీసులకు తీవ్ర హెచ్చరికలు చేయడంతో పాటుగా అక్షింతలు వేసే విధంగా స్పందించారు. అలాగే, హెల్మెట్‌లు ధరించని వాహన చోదకులు లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయ కూడదని ప్రశ్నించారు. వాహనం నడిపే వాళ్లు, వెనుక సీట్లు ఉన్న వాళ్లు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని, అలా ధరించని వారి వాహనాలు సీజ్ చేయాలన్నట్టుగా కోర్టు స్పందించింది. కోర్టు తీవ్ర హెచ్చరికలు, ఆగ్రహం నేపథ్యంలో ఇక, హెల్మెట్ కొరడా ఝుళిపించేందుకు తగ్గట్టుగా పోలీసులు సిద్ధమయ్యారు. వాహన చోదకులతో కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా తమ సిబ్బందికి సైతం హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వడమే కాదు, హెల్మెట్ ధరించని పోలీసులకు సైతం జరిమానా విధించే విధంగా కమిషన్ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం.
అధికారులతో కమిషనర్ సమాలోచన..
కమిషనరేట్ ఆదివారం పోలీసు అధికారులతో ఏకే విశ్వనాథన్ భేటీ అయ్యారు. గంటన్నర పాటుగా సాగిన భేటీ అనంతరం ట్రాఫిక్ విభాగానికి ›ప్రత్యేక ఆదేశాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. చెన్నై కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి పోలీసులు ఇక, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ఎవరైనా పోలీసులు రోడ్డెక్కినా, అట్టి వారికి జరిమానా విధించాలన్నారు. నిబంధనలు అన్నది అందరికీ వర్తిస్తుందని, సోమవారం నుంచి హెల్మెట్ ధరించని పోలీసులకు జరిమానా విధించే విధంగాముందుకు సాగాలని ఆదేశించారు. విధి నిర్వహణ నిమిత్తం వెళ్తున్నా, సొంత పని మీద వెళ్తున్నా, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారు. అలాగే, ఎవరైనా పోలీసు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ పక్షంలో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇలా పట్టుబడే వారి వివరాలను నివేదిక రూపంలో కమిషనరేట్‌కు పంపించాలని, దీని ఆధారంగా మద్యం తాగి వాహనాలు నడిపే పోలీసుల మీద శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగం ఈ ఆదేశాలు, ఉత్తర్వులను తప్పనిసరిగా అనుసరించాలని, జరిమానా విధింపు, కేసుల నమోదులో వెనక్కు తగ్గ వదని హుకుం జారీ చేశారు. కాగా, పోలీసులకే జరిమానా మోత మోగించే విధంగా ఆదేశాలు జారీ చేసి ఉన్న నేపథ్యంలో ఇక, సామాన్యులు నెత్తిన హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన పక్షంలో, జరిమాన కొరడా మరింతగా మోగడం ఖాయం. ఈ దృష్ట్యా, ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించడం శ్రేయస్కరం.
Comments
Please login to add a commentAdd a comment