దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్
సాక్షి, పెరంబూరు(చెన్నై): మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ఇప్పటికే కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవలసిందిగా తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో గానీ, తాజాగా తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో కే.భాగ్యరాజ్‌పై ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఒక సినీ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ సూది తావివ్వకపోతే దారం అందులోకి పోలేదని అంటారన్నారు. ఆ విధంగా స్త్రీలు అవకాశం ఇవ్వడంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి మహిళలు జాగరూకతతో ఉండాలన్నారు. ఈ విషయంలో మగవారిని తప్పు పట్టడం సరికాదన్నారు.
మగవారు తప్పు చేస్తే కాలానుగుణంగా సమసిపోతుందన్నారు. అదే ఆడది తప్పు చేస్తే అది చాలా చేటుకు దారి తీస్తుందన్నారు. అందువల్ల మహిళలు కట్టుబాట్లు విధించుకోవాలని అన్నారు. ఇప్పుడు మోబైల్‌ఫోన్ల అభివృద్ధి కారణంగా మహిళలు ఎక్కడికో వెళ్లిపోతున్నారనీ, అందువల్ల తప్పులు జరుగుతున్నాయని అన్నారు. ఆ మధ్య పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార సంఘటనలో మగవారిని మాత్రమే తప్పు పట్టలేమన్నారు. మహిళల బలహీనతను మగవారు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. మగవారిది తప్పు అయితే అందుకు అవకాశం కల్పించిన మహిళలదీ తప్పే అవుతుందని అన్నారు. అలా మహిళలందరినీ కించపరచేలా మాట్లాడిన కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు కళైసెల్వి చెన్నై పోలీస్ కార్యాలయంలో గురువారం చేసిన పిర్యాదులో పేర్కొన్నారు.
నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్
ఈ వ్యవహారంపై దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆయన ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ అత్యాచారాలు హద్దు మీరుతున్న సంఘటనల్లో ఆడ, మగ ఇద్దరిదీ తప్పు ఉంటుందని, అలాంటి సమయాల్లో మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే అలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదనే రీతిలో తాను మాట్లాడానని చెప్పారు. ఉదాహరణకు ఒక సినిమాలోనో, సీరియల్‌లోనో సీరియస్‌గా మనసుగా ఆవేదన కలిగించే సన్నివేశం ఉంటే దాన్ని రాసిన రచయితను ఎవరూ తిట్టరని, తెరపై కనిపించే కథా పాత్రలనే తిట్టిపోస్తారని అన్నారు. మన సమాజంలో స్త్రీలను దైవంగా భావిస్తారన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే సమస్యలకు ఆస్కారం ఉండదన్న భావంతోనే తాను మాట్లాడానని చెప్పారు. తన కాలంలో మహిళలకు ఉండే కట్టుబాట్లు ఇప్పుడు లేవన్నారు. ఇప్పుడు వారికి సాంకేతికపరమైన అభివృద్ధితో అన్ని రకాలుగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు లభిస్తున్నాయని అన్నారు.
పురుషాధిక్యం, స్వేచ్ఛ అంటూ మహిళలు మద్యం చేవించడం, పొగతాగడం వంటి చెడు అలవాట్లతో కట్టుబాట్లను వీరడం బాధనిపిస్తోందన్నారు. అదేవిధంగా స్త్రీలు తప్పుదారి పట్టడంతో అది వారినే కాకుండా వారి కుటుంబాలను బాధిస్తుందన్నారు. కాబట్టి తప్పు జరగడానికి మహిళలు కారణం అన్నాను కానీ, మహిళలు మాత్రమే కారణం అని అనలేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వ్యతిరేకతకు కారణం అనీ, దీన్ని సరిగా అర్థం చేసుకున్న పలువురు దర్శకులు నిజాన్ని ధైర్యంగా చెప్పావంటూ తనను అభినందిస్తున్నారని కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment