Bhagya Raj
-
వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లే: నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: పుస్తకావిష్కరణ వేదికగా సినీ సీనియర్ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ నోరు జారి వార్తల్లోకి ఎక్కారు. విమర్శలు, ఎదురు దాడి పెరగడంతో పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి వచ్చింది. బుధవారం మోదీ సంక్షేమ పథకాలు, నవభారతం –2022 పుస్తకావిష్కరణ చెన్నైలో జరిగింది. బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నటుడు భాగ్యరాజ్ పాల్గొని సినీ స్టైల్లో డైలాగుల్ని పేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే వాళ్లంతా నెల తక్కువ పుట్టిన వాళ్లేనని ఎద్దేవా చేశారు. నెల తక్కువగా పుట్టిన వాళ్లను, ప్రత్యేక ప్రతిభావంతుల్ని గురి పెట్టి ఆయన వ్యాఖ్యలు చేశారనే ప్రచారంతో సామాజిక మాధ్యమాల్లో భాగ్యారాజ్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చిన భాగ్యరాజ్ ‘తాను బీజేపీ వ్యక్తిని కాదని...తమిళుడిని అని వ్యాఖ్యానించారు. నెల తక్కువ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, తాను దురుద్దేశంతో ఆ వ్యాఖ్య చేయలేదని, ప్రసంగ వేగంలో ఆ పదాన్ని ఉపయోగించినట్టుగా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఎవరి మనస్సునైనా నొప్పించి ఉంటే క్షమించండి అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చదవండి: నాన్న చేసిన పనికి కన్నీళ్లొచ్చాయి ప్రముఖ దర్శకుడు మారుతికి పితృవియోగం -
నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్
సాక్షి, పెరంబూరు(చెన్నై): మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉమెన్స్ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ఇప్పటికే కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవలసిందిగా తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో గానీ, తాజాగా తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో కే.భాగ్యరాజ్‌పై ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన ఒక సినీ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సీనియర్ దర్శకుడు, నటుడు కే.భాగ్యరాజ్ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ సూది తావివ్వకపోతే దారం అందులోకి పోలేదని అంటారన్నారు. ఆ విధంగా స్త్రీలు అవకాశం ఇవ్వడంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాబట్టి మహిళలు జాగరూకతతో ఉండాలన్నారు. ఈ విషయంలో మగవారిని తప్పు పట్టడం సరికాదన్నారు. మగవారు తప్పు చేస్తే కాలానుగుణంగా సమసిపోతుందన్నారు. అదే ఆడది తప్పు చేస్తే అది చాలా చేటుకు దారి తీస్తుందన్నారు. అందువల్ల మహిళలు కట్టుబాట్లు విధించుకోవాలని అన్నారు. ఇప్పుడు మోబైల్ఫోన్ల అభివృద్ధి కారణంగా మహిళలు ఎక్కడికో వెళ్లిపోతున్నారనీ, అందువల్ల తప్పులు జరుగుతున్నాయని అన్నారు. ఆ మధ్య పొల్లాచ్చిలో జరిగిన అత్యాచార సంఘటనలో మగవారిని మాత్రమే తప్పు పట్టలేమన్నారు. మహిళల బలహీనతను మగవారు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. మగవారిది తప్పు అయితే అందుకు అవకాశం కల్పించిన మహిళలదీ తప్పే అవుతుందని అన్నారు. అలా మహిళలందరినీ కించపరచేలా మాట్లాడిన కే.భాగ్యరాజ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు సుదేశీ పెంగళ్ పాదుగాప్పు సంఘం అధ్యక్షురాలు కళైసెల్వి చెన్నై పోలీస్ కార్యాలయంలో గురువారం చేసిన పిర్యాదులో పేర్కొన్నారు. నా వ్యాఖ్యలు సరైనవే: భాగ్యరాజ్ ఈ వ్యవహారంపై దర్శక, నటుడు కే.భాగ్యరాజ్ స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఆయన ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన భేటీలో పేర్కొంటూ అత్యాచారాలు హద్దు మీరుతున్న సంఘటనల్లో ఆడ, మగ ఇద్దరిదీ తప్పు ఉంటుందని, అలాంటి సమయాల్లో మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే అలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉండదనే రీతిలో తాను మాట్లాడానని చెప్పారు. ఉదాహరణకు ఒక సినిమాలోనో, సీరియల్లోనో సీరియస్‌గా మనసుగా ఆవేదన కలిగించే సన్నివేశం ఉంటే దాన్ని రాసిన రచయితను ఎవరూ తిట్టరని, తెరపై కనిపించే కథా పాత్రలనే తిట్టిపోస్తారని అన్నారు. మన సమాజంలో స్త్రీలను దైవంగా భావిస్తారన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు మహిళలు కాస్త జాగ్రత్తగా ఉంటే సమస్యలకు ఆస్కారం ఉండదన్న భావంతోనే తాను మాట్లాడానని చెప్పారు. తన కాలంలో మహిళలకు ఉండే కట్టుబాట్లు ఇప్పుడు లేవన్నారు. ఇప్పుడు వారికి సాంకేతికపరమైన అభివృద్ధితో అన్ని రకాలుగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు లభిస్తున్నాయని అన్నారు. పురుషాధిక్యం, స్వేచ్ఛ అంటూ మహిళలు మద్యం చేవించడం, పొగతాగడం వంటి చెడు అలవాట్లతో కట్టుబాట్లను వీరడం బాధనిపిస్తోందన్నారు. అదేవిధంగా స్త్రీలు తప్పుదారి పట్టడంతో అది వారినే కాకుండా వారి కుటుంబాలను బాధిస్తుందన్నారు. కాబట్టి తప్పు జరగడానికి మహిళలు కారణం అన్నాను కానీ, మహిళలు మాత్రమే కారణం అని అనలేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వ్యతిరేకతకు కారణం అనీ, దీన్ని సరిగా అర్థం చేసుకున్న పలువురు దర్శకులు నిజాన్ని ధైర్యంగా చెప్పావంటూ తనను అభినందిస్తున్నారని కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు. -
మహిళలపై దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో మహిళలు ఎల్లప్పుడూ ఫోన్లో ఉంటున్నారు.. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని నోరుపారేసుకున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారని భాగ్యరాజా అభిప్రాయపడ్డారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం తప్పిదం మాత్రమే కాదు.. చట్టరీత్యా నేరం అనే విచక్షణ మరిచి మహిళల అజాగ్రత్త వల్లే పురుషులు తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా ఫోన్లలోనే ఉంటున్నారు, రెండేసి ఫోన్లు, సిమ్‌లు వాడుతున్నారు. వారిపై ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణం. మహిళలపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో ఇలాంటి నేరాలేవీ జరగలేదు అని అన్నారు. అంతేకాదు తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి సంఘటనపై స్పందిస్తూ ఇందులో బాలురుపైన మాత్రమే నిందలు వేయడం సరికాదని వ్యాఖ్యానించాడు. అమ్మాయిలు చేసిన పొరపాటును వాళ్లు ఉపయోగించుకున్నారనీ, వారు అజాగ్రత్తగా ఉన్నందునే ఇలాంటి ఘటనలు జరుతున్నాయన్నారు. మగాళ్ల విచ్చలవిడి సంబంధాలను సమర్ధించు కొచ్చిన ఆయన ఒక పురుషుడు పొరపాటు చేస్తే, సరిదిద్దుకుంటాడు. అదే మహిళలు తప్పు చేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అలాగే పురుషుడికి చిన్నిల్లు (రెండవ భార్య) వుంటే ఆ స్త్రీ సంతోషంగా ఉంటుంది. ఆమెకు డబ్బు, ఆస్తి లభించడంతో పాటూ, మొదటి భార్యకు ఏ కష్టం కలగదు. కానీ ఒక మహిళకు కల్లా కదలన్ (రహస్య ప్రేమికుడు) వుంటే భర్తల్ని, పిల్లల్ని చంపేస్తున్నారని అన్నారు. రోజూ దినపత్రికల్లో వస్తున్న కేసులను ఈ సందర్భంగా ఉదాహరిస్తూ.. మహిళలు పరిమితుల్లో ఉండాలని సూచించారు. తాను ఉమ్మడి కుటుంబం నుండి వచ్చినందున, తన సినిమాల్లో ‘తెలియకుండానే’ మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చానని చెప్పుకొచ్చిన భాగ్యరాజా, ‘ఉసి ఇడామ్ కుదుతా థాన్ నూల్ నుజాయ ముడియం’ మహిళల పట్ల తీవ్ర అవమానకరమైన తమిళ సామెతను ఉటంకిస్తూ, అత్యాచారాలకు మహిళలదే తప్పు అన్నట్టుగా రెచ్చిపోయారు. కాగా ఇప్పటికే ‘మీ టూ’ ఉద్యమంలో చెలరేగిన ఆరోపణలతో తమిళ చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. తాజాగా భాగ్యరాజ్ వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపనున్నాయి. ‘కరుతుకలై పాతివు సీ’ సినిమా సోషల్ మీడియా ద్వారా ఒక మహిళపై లైంగిక దాడులు (పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు ఆధారంగా) అనే కథాంశంతో కూడుకున్నది కావడం గమనార్హం. కాగా తమిళ రియాలిటీ షో బిగ్ బాస్-3 పార్టిసిపెంట్, ఫెమినిస్టు మోడల్ మీరా మిథున్, కస్తూరి రాజా, ఎస్ వె శేఖర్, నటుడు-సినిమాటోగ్రాఫర్ నటరాజ్, సంగీత దర్శకుడు ధీనా వంటి ప్రముఖులు ఈ వేదికపై ఉండగా భాగ్యరాజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వారు మౌన ప్రేక్షకులుగా ఉండడం మరింత బాధాకరమనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
నడిగర్ సంఘం ఎన్నికలకు లైన్‌క్లియర్
తమిళసినిమా: దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరు రచ్చగా మారడంతో పాండవర్ జట్టు, స్వామి శంకరదాస్ జట్టులు వాగ్యుద్ధానికి దిగాయి. నడిగర్ సంఘం ఎన్నికలను నిలిపివేయాలని తమిళనాడులోని ఓ అధికారి మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పాండవర్ జట్టు కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగగా యథాప్రకారం ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగేలా తీర్పు వెలువడింది. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరపరాదని షరతు విధించింది. కోర్టు ఆదేశాలతో పాండవర్ జట్టు హర్షం వ్యక్తం చేసింది. -
‘నడిగర్’ ఎన్నికల రద్దుపై రిట్ పిటిషన్
పెరంబూరు: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికలను నిర్వహించడానికి ప్రస్తుత సంఘ కార్యదర్శి విశాల్ ఇంకా పోరాడుతూనే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి గవర్నర్‌ను కూడా కలిసి ఎన్నికలు జరగడానికి చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 2019–2022 సంవత్సరానికిగానూ నడిగర్ సంఘం ఎన్నికలను ఈ నెల 23వ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రస్తుత సంఘ నిర్వాహక వర్గం పాండవర్ జట్టు పేరుతోనూ, వీరికి పోటీగా దర్శక నటుడు కే.భాగ్యరాజ్ నేతృత్వంలో స్వామి శంకరదాస్ జట్టు పోటీలో ఉన్నాయి. ఎన్నికలకు స్థానిక అడయార్‌లోని ఎంజీఆర్ జానకీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను వేదికగా నిర్ణయించారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఆ ప్రాంతంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలకు భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పడంతో సమస్య మొదలైంది. ఎన్నికలకు భద్రత కల్పించాల్సిందిగా కోరుతూ విశాల్ వర్గం చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు కూడా అందుకు నిరాకరిస్తూ ఎన్నికలకు వేరే వేదికను ఎంచుకోవాలని సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘాల జిల్లా అధికారి ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. సంఘం నుంచి తొలగించబడ్డ 61 మంది ఫిర్యాదుల కారణంగానే ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు ఆయన వివరణ ఇచ్చారు. సభ్యుల తొలగింపునకు కారణాలు సరైనవేనా? కాదా? అన్నది పరిశీంచిన తరువాతనే ఎన్నికల నిర్వహణకు అనుమతి నివ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై కోర్టులో వేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం 61 మంది సభ్యుల తొలగింపు సరైనదేనని తీర్పునిచ్చింది. ఈ తీర్పు విశాల్ జట్టుకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. కాగా ఎన్నికలకు అనుమతినివ్వాల్సిందిగా విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పుపైనే 23వ తేదీన నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతాయా? రద్దవుతాయాయనేది ఆధారపడి ఉంది. నాకు సంబంధం లేదు బుధవారం సంఘ ఎన్నికలను నిజాయితీగా, ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవలసిందిగా పాండవర్ జట్టు తరఫున విశాల్ తదితరులు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించిన విషయం తెలిసిందే. కాగా గురువారం స్వామి శంకరదాస్ జట్టు తరఫున దర్శక నటుడు కే.భాగ్యరాజ్, ఐసరిగణేశ్ తదితరులు గవర్నర్ బంగ్లాకు వెళ్లి బన్వరిలాల్ పురోహిత్‌ను కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సంఘ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్చలు తీసుకోవసిందిగా గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికలకు తనకు సంబంధం లేదని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. అదే విధంగా విశాల్ వర్గం అబద్దాలు చెబుతున్నారని, సంఘంలో సమస్యలకు కారణం విశాల్, కార్తీ లాంటి వారేనని స్వామి శంకర్‌దాస్ జట్టు ఆరోపించింది. -
వేడెక్కిన నడిగర్ ఎన్నికల ప్రచారం
పెరంబూరు: నడిగర్ సంఘంకు నటుడు కార్తీ సాయం అందించారని, మాజీ కార్యదర్శి రాధారవి మాత్రం డబ్బును దోచుకున్నారని నటుడు, ప్రస్తుత సంఘం అధ్యక్షుడు నాజర్ ఆరోపించారు. నడిగర్ సంఘం ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పోటీలో ఉన్న పాండవర్ జట్టు, స్వామి శంకరదాస్ జట్టు ఓట్ల కోసం పాట్లు కార్యక్రమం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాండవర్ జట్టు ఆదివారం తిరుచ్చిలో నాటక కళాకారులను కలిశారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేస్తున్న నటుడు నాజర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో సంఘం ఎన్నికలు గట్టి పోటీ మధ్య జరిగాయన్నారు. ఈసారి ప్రశాంతంగా జరుగుతాయనుకుంటే తమ సభ్యుల కారణంగానే సవాల్‌గా మారాయన్నారు. తాము సంఘానికి రక్షణగా ఉంటామే కానీ అసత్య వాగ్దానాలు చేయమని అన్నారు. తమపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో వ్యతిరేక వర్గం నిరాధార విమర్శలు చేస్తోందన్నారు. అసత్యపు వాగ్దానాలతో నాటక కళాకారుల మనసు దోచుకోవడం సాధ్యం కాదన్నారు. నడిగర్ సంఘంలో గానీ, సంఘ భవన నిర్మాణంలో గానీ ఎలాంటి రాజకీయ జోక్యం లేదన్నారు. అయితే ఇందులోని సభ్యులు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారు అయినా ఉండవచ్చునని, అది సమస్య కాదని పేర్కొన్నారు. అయితే సంఘంలో సభ్యుడు కాని నటుడు రాధారవి ఇంకో జట్టు కోసం ఓట్లు అడుగుతున్నారని హేళన చేశారు. ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరగనున్న ప్రాంతంలో భద్రత సమస్య ఏర్పడే అవకాశం ఉందంటూ పోలీసులు చెబుతున్నారని, ఆ విషయం గురించి విశాల్, పూచిమురుగర్‌లు చర్చిస్తున్నారని తెలిపారు. ముందుగా నిర్ణయించినట్లు ఎన్నికలు జరుగుతాయని అన్నారు. పోలీసులు బందోబస్తును కల్పించాలని కోరారు. నటుడు రజనీకాంత్, కమలహాసన్ మధ్యంతరంగా ఉంటారని, సంఘ అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని వారు ఓటు వేస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇరుజట్లకు చెందిన వారు మిశ్రమంగా గెలిచినా సంఘ భవన నిర్మాణం కొనసాగుతుదని అన్నారు. నటుడు కార్తీ ఆర్థిక సాయాన్ని రచ్చ చేస్తున్నారని ఆయన ఎన్నికలకు ముందు నుంచి సంఘానికి ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నారని మాజీ కార్యదర్శి రాధారవి మాత్రం సంఘం డబ్బును దోచుకున్నారన్నారు. విశాల్ రాజకీయం చేస్తున్నారు పాండవర్ జట్టుతో పాటు స్వామి శంకరదాస్ జట్టు ఆదివారం తిరుచ్చిలో మకాం వేసి అక్కడ నాటక కళాకారుల ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నటుడు ఉదయ మీడియాతో మాట్లాడుతూ నడిగర్ సంఘం ఎన్నికల్ని నటుడు విశాల్ రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పాండవర్ జట్టు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ జట్టులో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ దర్శకుడు, పేరు గాంచిన స్క్రిన్‌ప్లే, రైటర్ అయిన కె.భగ్యరాజ్‌ను నటుడు, అంటూ ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఐసరి గణేష్ గురించి విమర్శలు చేస్తున్నారని నిజానికి విశాల్‌నే ప్రచార ప్రియుడని అన్నారు. ఏ విషయంలోనైనా తన పేరే ఉండాలని భావిస్తాడని అన్నారు. నడిగర్ సంఘం కార్యదర్శిగా ఉండి నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా పోటీ చేస్తూ రాజకీయాలు చేసి పలు తప్పులు చేశారని ఆరోపించారు. నడిగర్ సంఘం భవన నిర్మాణం చేపట్టి 40 శాతమే పూర్తి చేయగలిగారని, మిగిలిన 60 శాతం పూర్తి చేయడానికి నిధి కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ జట్టును గెలిపిస్తే ఆరు నెలల్లో సంఘ భవనాన్ని పూర్తి చేస్తానని ఐసరిగణేష్ చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. నడిగర్ సంఘం నిర్వహించిన 18 కార్యవర్గ సమావేశాల్లో కార్యదర్శిగా ఉన్న విశాల్ పాల్గొనలేదని విమర్శించారు. ఇక సంఘం నుంచి 300 మందిని తొలగించిన ఘనత విశాల్‌దని అన్నారు. పలువురు సభ్యులను అవమానించారని అన్నారు. సంఘ ఎన్నికల్లో ద్వారా విశాల్ తన రాజకీయ ఇమేజ్ను పంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని నటుడు ఉదయ ఆరోపించారు. -
వేడి పుట్టిస్తున్న నడిఘర్ సంఘం ఎన్నికలు
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘంగా పిలువబడే నడిగర్ సంఘం ఎన్నికలు చర్చనీయాంశంగా మారింది. గతంలో శరత్ కుమార్ బృందాన్ని ఢీకొట్టి గెలిచిన పాండవర్ టీం మళ్లీ బరిలోకి దిగింది. ఈసారి కొత్తగా సీనియర్ దర్శక నటుడు భాగ్యరాజా, ఐసరీ గణేష్ టీమ్ పోటీ పటుతుండటంతో ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. 23న జరిగే ఈ ఎన్నికలకు న్యాయస్థానం ప్రత్యేక రిటర్నింగ్ అధికారిని నియమించగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో పాండవర్ టీమ్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అదే ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా.. భాగ్యరాజా టీమ్ వారికంటే తాము నడిగర్ సంఘాన్బి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామంటూ బరిలో దిగారు. భాగ్యరాజా టీమ్ సీనియారిటీ పేరుతో నడిగర్ సంఘాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టగా పాండవర్ టీమ్ మాత్రం గత మూడేళ్లుగా తమ అభివృద్దే మరోమారు విజయానికి దోహదపడుతుందనే ధీమాలో ఉంది. పాండవర్ టీమ్ నుండి అధ్యక్షుడిగా నాజర్, కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తితోపాటు ఉపాధ్యక్ష, సభ్యుల పదవి పాత వర్గమే బరిలో ఉంది. గత కమిటీలో శరత్ కుమార్ టీమ్ పై వ్యతిరేకతతో భాగ్యరాజా వంటి సీనియర్ నటులంతా పాండవర్ టీమ్ కి మద్దతుగా నిలిచారు. అయితే నడిగర్ సంఘానికి సొంత భవనంతోపాటు పేద కళాకారులకు ఆర్థిక సాయం వంటి భారీ పథకాలతో పాండవర్ టీమ్ ముందుకు సాగుతుండటం, పాత కమిటీ అవినీతిని బయట పెడుతుండటం సీనియర్లకు కొంత ఇబ్బందులను తెచ్చేలా చేసింది. దీంతో సీనియర్ల నుంచి భాగ్యరాజా అధ్యక్షుడిగా బరిలో దిగగా నిర్మాత నటుడు ఐసరీ గణేష్ రెండవ టీమ్ కు వెన్నదన్నుగా నిలుస్తున్నారు. గతంలో పాండవర్ టీమ్ లోనే ఉన్న ఐసరీ గణేష్ ఒక్కసారిగా టీమ్ మారటం ఇప్పుడు ఎన్నికలు రసవత్తరంగా మారేందుకు కారణమైంది. మొత్తానికి రెండు టీమ్‌లు గెలుపుకోసం ఎవరి దారిలో వారు సభ్యుల ఓట్ల కోసం వేట మొదలు పెట్టింది. -
త్యాగరాజన్ చేతుల్లోకి నేత్ర
తమిళసినిమా: నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ చేతుల్లోకి నేత్ర చిత్రం చేరింది. దర్శకుడు వెంకటేశ్ అంగాడితెరు చిత్రంతో నటుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అలా దర్శకుడిగా, నటుడిగా జోడు గుర్రాల సవారి చేస్తున్న ఈయన తాజాగా నిర్మాతగా కూడా మారారు. శ్వేత సినీఆర్ట్స్ పరరాజసింగ్తో కలిసి తన వెంకటేశ్ పిక్చర్స్ పతాకంపై ఏ.వెంకటేశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం నేత్ర. వినయ్, తమన్‌కుమార్, సుభిక్ష, రిత్విక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ చిత్ర విడుదల హక్కులు త్యాగరాజన్ స్టార్ మూవీస్ ఖాతాలో పడింది. నేత్ర చిత్రాన్ని త్యాగరాజన్ ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం స్థానికి టీ.నగర్‌లోని త్యాగరాజన్‌కు చెందిన ప్రశాంత్ గోల్డ్ టవర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శక నటుడు కే.భాగ్యరాజ్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా, నటుడు శరత్‌కుమార్ తొలి సీడీని అందుకున్నారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ దర్శకుడు ఏ.వెంకటేశ్ చాలా ప్రతిభావంతుడైన దర్శకుడని, ఆయనతో ఏయ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు చేశానని తెలిపారు. చాలా పకడ్బందీగా, వేగంగా చిత్రాలు చేసే దర్శకుడు ఆయన అని చెప్పారు. ఇక ఈ నేత్ర చిత్ర విడుదల హక్కులను త్యాగరాజన్ పొందారంటే అందులో ఎంత విషయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తన కొడుకు నటించిన చిత్రాలు మినహా బయట చిత్రాలను త్యాగరాజన్ విడుదల చేయడం అన్నది ఇదే మొదటి సారి అని అన్నారు. త్యాగరాజన్‌తో తనకు చిరకాల అనుబంధం ఉందని, ఈయన నేత్ర చిత్రాన్ని సక్సెస్ చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. నిర్మాతగా మారిన ఈ చిత్ర దర్శకుడు ఏ.వెంకటేశ్ మాట్లాడుతూ తాను అనుకోకుండా నిర్మాతనయ్యానన్నారు. నిర్మాత పరరాజసింగ్ వచ్చి చిత్రం చేద్దామని చెప్పగానే కథను సిద్ధం చేశానని, అయితే ఆయన తననూ ఈ చిత్ర నిర్మాణంలో భాగం కావలసిందిగా కోరడంతో అంగీకరించక తప్పలేదన్నారు. నేత్ర చిత్రాన్ని కెనడా నేపథ్యంలో రూపొందించామని తెలిపారు. అందుకే ఎక్కువ భాగం షూటింగ్‌ను కెనడాలోనే చేసినట్లు తెలిపారు. ఇది ఇంతకు ముందు వచ్చిన నూరావదునాళ్, విడింజా కల్యాణం తరహాలో సాగే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని, చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని దర్శక, నిర్మాత ఏ.వెంకటేశ్ తెలిపారు. నటి నమిత, ఫిలించాంబర్ అధ్యక్షుడు కాట్రగడ్డప్రసాద్, దర్శకుడు,ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణి, వసంతబాలన్ పాల్గొన్నారు. -
అలరిస్తూ ఆలోచింపజేసే చిత్రం
తమిళ సినిమా: సగటు ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని పంచి అదే సమయంలో ఆలోసింపజేసే చిత్రంగా బ్రహ్మ.కామ్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు పురుష్ విజయ్ తెలిపారు. మెలినా కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం లో నకుల్ హీరోగా నటించారు. ఆయనకు జంటగా ఆస్నాజవేరి నటించగా సిద్ధార్థ్ విపిన్, దర్శకుడు కే.భాగ్యరాజ్, నటి నీతూచంద్ర,కౌశల్య, ముట్టై రాజేంద్రన్ ముఖ్య పాత్రలను పోషించారు. ఇటీవలే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 15వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ భగవంతుడిని అందరూ ఏదోఒకటి కోరుతూనే ఉంటారన్నారు. అయితే ఆయన సృష్టించిన మనకి ఏమేం చేయాలో ఆయనకు తెలియదా?అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రం బ్రహ్మ.కామ్ అని తెలిపారు. ఇది పూర్తి స్థాయి వినోదంతో కూడిన చిత్రమే అయినా ఆలోచింపజేసే సన్నివేశాలు చాలానే ఉంటాయన్నారు. హీరో నకుల్ ఒక యాడ్ ఫిలిం డర్శకుడున్నారు. నటి ఆస్నాజవేరి మోడల్ అని, సిద్ధార్థ్ విపిన్ యాడ్ కంపెనీ నిర్వాహకుడిగా నటించారని తెలిపారు. నకుల్, సిద్ధార్థ్ విపిన్లిద్దరూ ఆస్నాజవేరిని ప్రేమిస్తుంటారని చెప్పారు. దర్శకుడు కే.భాగ్యరాజ్ దేవుడిగా నటించారన్నారు.దేవుడంటే కిరీటం ధరించి కాకుండా సాధారణ మనిషిలానే కనిపిస్తారని, ఆయన్ని నకుల్ ఎప్పుడూ ఎదో ఒకటి అడుగుతూ చేసే గోల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఇక నటి నీతూచంద్ర చిత్రంలోనూ నటిగానే నటించి ఒక గ్లామరస్ పాత్రలోనూ కనువిందు చేయనున్నారని దర్శకుడు తెలిపారు. చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుందని తెలిపారు. -
నటి నమితకు తప్పిన ప్రమాదం
నటి నమిత నామక్కల్ సమీపంలో జరిగిన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. నామక్కల్ సమీపంలోని రెడ్డిపట్టి గ్రామంలోని భగవతి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి నామక్కల్ యువ నాటక సంఘం ఆధ్వర్యంలో మణ వాళ్కై అనే నాటకాన్ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ నాటకాన్ని ప్రారంభించడానికి చెన్నై నుంచి నటి నమిత, దర్శక నటుడు కె.భాగ్యరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి నమిత వస్తున్నారని తెలియడంతో ఆ గ్రామ ప్రజలతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఆ ప్రాంతం జన సంద్రంగా మారింది. సరిగ్గా రాత్రి 9.30 గంటలకు నటి నమిత నాటకాన్ని ప్రారంభించడానికి స్టేజ్‌పైకి వచ్చారు. జనాల కేరింతలతో స్టేజ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో జనం తోపులాటతో స్టేజ్ ఒక పక్కకు ఒరిగిపోయింది. వెంటనే నిర్వాహకులు నటి నమితను స్టేజీపై నుంచి సురక్షితంగా కిందికి దించి పక్కనున్న ఇంటికి తీసుకెళ్లారు. అంబులెన్స్‌ల హడావుడి: నటి నమిత ప్రమాదంలో గాయపడ్డారన్న ప్రచారంతో నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న మూడు అంబులెన్స్‌లు హుటాహుటిన భగవతి ఆలయం వద్దకు చేరుకున్నాయి. నటి నమితను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పోటీపడ్డాయి. అయితే నమిత తనకెలాంటి గాయాలు అవ్వలేదని చెప్పడంతో అంబులెన్స్‌లు తిరిగి వెళ్లిపోయాయి. జనం మాత్రం నమితను చూడడానికి గుమికూడారు. అనంతరం భగవతి ఆలయం ముందు కొత్తగా మరో స్టేజ్‌ను ఏర్పాటు చేసి నాటకాన్ని ప్రారంభించాల్సిందిగా నిర్వాహకులు నమితను కోరగా ఆమె నిరాకరించారు. చివరికి దర్శకుడు కె.భాగ్యరాజ్ నాటకాన్ని ప్రారంభించారు. మంగళవారం వేకువ జామున నమిత, భాగ్యరాజ్ కారులో చెన్నైకి చేరుకున్నారు.