తమిళసినిమా: నటుడు, దర్శక, నిర్మాత త్యాగరాజన్ చేతుల్లోకి నేత్ర చిత్రం చేరింది. దర్శకుడు వెంకటేశ్ అంగాడితెరు చిత్రంతో నటుడిగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అలా దర్శకుడిగా, నటుడిగా జోడు గుర్రాల సవారి చేస్తున్న ఈయన తాజాగా నిర్మాతగా కూడా మారారు. శ్వేత సినీఆర్ట్స్ పరరాజసింగ్‌తో కలిసి తన వెంకటేశ్ పిక్చర్స్ పతాకంపై ఏ.వెంకటేశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం నేత్ర. వినయ్, తమన్‌కుమార్, సుభిక్ష, రిత్విక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ చిత్ర విడుదల హక్కులు త్యాగరాజన్ స్టార్ మూవీస్ ఖాతాలో పడింది. నేత్ర చిత్రాన్ని త్యాగరాజన్ ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం స్థానికి టీ.నగర్‌లోని త్యాగరాజన్‌కు చెందిన ప్రశాంత్ గోల్డ్ టవర్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శక నటుడు కే.భాగ్యరాజ్ చిత్ర ఆడియోను ఆవిష్కరించగా, నటుడు శరత్‌కుమార్ తొలి సీడీని అందుకున్నారు. శరత్‌కుమార్ మాట్లాడుతూ దర్శకుడు ఏ.వెంకటేశ్ చాలా ప్రతిభావంతుడైన దర్శకుడని, ఆయనతో ఏయ్ వంటి పలు విజయవంతమైన చిత్రాలు చేశానని తెలిపారు. చాలా పకడ్బందీగా, వేగంగా చిత్రాలు చేసే దర్శకుడు ఆయన అని చెప్పారు. ఇక ఈ నేత్ర చిత్ర విడుదల హక్కులను త్యాగరాజన్ పొందారంటే అందులో ఎంత విషయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తన కొడుకు నటించిన చిత్రాలు మినహా బయట చిత్రాలను త్యాగరాజన్ విడుదల చేయడం అన్నది ఇదే మొదటి సారి అని అన్నారు. త్యాగరాజన్‌తో తనకు చిరకాల అనుబంధం ఉందని, ఈయన నేత్ర చిత్రాన్ని సక్సెస్ చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు.
నిర్మాతగా మారిన ఈ చిత్ర దర్శకుడు ఏ.వెంకటేశ్ మాట్లాడుతూ తాను అనుకోకుండా నిర్మాతనయ్యానన్నారు. నిర్మాత పరరాజసింగ్ వచ్చి చిత్రం చేద్దామని చెప్పగానే కథను సిద్ధం చేశానని, అయితే ఆయన తననూ ఈ చిత్ర నిర్మాణంలో భాగం కావలసిందిగా కోరడంతో అంగీకరించక తప్పలేదన్నారు. నేత్ర చిత్రాన్ని కెనడా నేపథ్యంలో రూపొందించామని తెలిపారు. అందుకే ఎక్కువ భాగం షూటింగ్‌ను కెనడాలోనే చేసినట్లు తెలిపారు. ఇది ఇంతకు ముందు వచ్చిన నూరావదునాళ్, విడింజా కల్యాణం తరహాలో సాగే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని, చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని దర్శక, నిర్మాత ఏ.వెంకటేశ్ తెలిపారు. నటి నమిత, ఫిలించాంబర్ అధ్యక్షుడు కాట్రగడ్డప్రసాద్, దర్శకుడు,ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి, వసంతబాలన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment