సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటీనటుల సంఘంగా పిలువబడే నడిగర్ సంఘం ఎన్నికలు చర్చనీయాంశంగా మారింది. గతంలో శరత్ కుమార్ బృందాన్ని ఢీకొట్టి గెలిచిన పాండవర్ టీం మళ్లీ బరిలోకి దిగింది. ఈసారి కొత్తగా సీనియర్ దర్శక నటుడు భాగ్యరాజా, ఐసరీ గణేష్ టీమ్ పోటీ పటుతుండటంతో ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. 23న జరిగే ఈ ఎన్నికలకు న్యాయస్థానం ప్రత్యేక రిటర్నింగ్ అధికారిని నియమించగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో పాండవర్ టీమ్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అదే ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా.. భాగ్యరాజా టీమ్ వారికంటే తాము నడిగర్ సంఘాన్బి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామంటూ బరిలో దిగారు. భాగ్యరాజా టీమ్ సీనియారిటీ పేరుతో నడిగర్ సంఘాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టగా పాండవర్ టీమ్ మాత్రం గత మూడేళ్లుగా తమ అభివృద్దే మరోమారు విజయానికి దోహదపడుతుందనే ధీమాలో ఉంది.
పాండవర్ టీమ్ నుండి అధ్యక్షుడిగా నాజర్, కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తితోపాటు ఉపాధ్యక్ష, సభ్యుల పదవి పాత వర్గమే బరిలో ఉంది. గత కమిటీలో శరత్ కుమార్ టీమ్ పై వ్యతిరేకతతో భాగ్యరాజా వంటి సీనియర్ నటులంతా పాండవర్ టీమ్ కి మద్దతుగా నిలిచారు. అయితే నడిగర్ సంఘానికి సొంత భవనంతోపాటు పేద కళాకారులకు ఆర్థిక సాయం వంటి భారీ పథకాలతో పాండవర్ టీమ్ ముందుకు సాగుతుండటం, పాత కమిటీ అవినీతిని బయట పెడుతుండటం సీనియర్లకు కొంత ఇబ్బందులను తెచ్చేలా చేసింది. దీంతో సీనియర్ల నుంచి భాగ్యరాజా అధ్యక్షుడిగా బరిలో దిగగా నిర్మాత నటుడు ఐసరీ గణేష్ రెండవ టీమ్ కు వెన్నదన్నుగా నిలుస్తున్నారు. గతంలో పాండవర్ టీమ్ లోనే ఉన్న ఐసరీ గణేష్ ఒక్కసారిగా టీమ్ మారటం ఇప్పుడు ఎన్నికలు రసవత్తరంగా మారేందుకు కారణమైంది. మొత్తానికి రెండు టీమ్‌లు గెలుపుకోసం ఎవరి దారిలో వారు సభ్యుల ఓట్ల కోసం వేట మొదలు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment