హేమ కమిటీ నివేదిక సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. ఇప్పటికే కన్నడ సినీ పరిశ్రమలోనూ ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టాలీవుడ్‌లోనూ మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన నడిగర్ సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని నడిగర్ సంఘం నిర్ణయించింది. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే సినీ ఇండస్ట్రీ నుంచి ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని విశాల్ నేతృత్వంలోని కమిటీ తీర్మానించింది. చిత్ర పరిశ్రమలో మహిళల భద్రతపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బాధితులకు న్యాయపరమైన సహాయాన్ని అందించడానికి నడిగర్ సంఘం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కార సెల్ కోసం ప్రత్యేక మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వేధింపులకు గురైన వారు నేరుగా తమ ఫిర్యాదులను ముందుగా నడిగర్ సంఘానికి సమర్పించాలని కోరారు. మీడియాకు వెల్లడించవద్దని హెచ్చరిక కూడా ఉంది. చెన్నైలో నడిగర్ సంఘం నిర్వహించిన సమావేశంలో నాసర్, విశాల్, కార్తీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment