మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, కార్యదర్శి రాధారవి అక్రమాలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సంఘం 66వ సర్వసభ్య సమావేశం ఆదివారం చెన్నైలో నిర్వహించారు. ఈ సంఘం ఎన్నికలు 2019లో జరిగినా.. అక్రమాలు జరిగాయంటూ ఐసరి గణేష్‌కు చెందిన స్వామి శంకరదాస్ జట్టు చెన్నై హైకోర్టు గుమ్మం తొక్కింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం పలు దఫాలు విచారణ జరిపినా న్యాయస్థానం ఇటీవల సంఘం ఎన్నికలు సక్రమమే అంటూ ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల్లో నాజర్ అధ్యక్షతన పోటీ చేసిన పాండవర్ జట్టు విజయం సాధించింది. దీంతో ఆదివారం స్థానిక శాంథోమ్ రోడ్‌లోని శాంథోమ్ హైయ్యర్ సెకండరీ పాఠశాలలో నడిగర్ సంఘం కార్యవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షులు కరుణాస్, పూచి మురుగన్‌లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెడుతూ సభ్యుల అనుమతి కోరారు. ముఖ్యంగా నడిగర్ సంఘం నూతన భవనాన్ని పూర్తి చేయడం, అందుకు కావాల్సిన నిధుల కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందడం వంటి అంశాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment