నటి నమితకు తప్పిన ప్రమాదం
నటి నమిత నామక్కల్ సమీపంలో జరిగిన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. నామక్కల్ సమీపంలోని రెడ్డిపట్టి గ్రామంలోని భగవతి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి నామక్కల్ యువ నాటక సంఘం ఆధ్వర్యంలో మణ వాళ్కై అనే నాటకాన్ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ నాటకాన్ని ప్రారంభించడానికి చెన్నై నుంచి నటి నమిత, దర్శక నటుడు కె.భాగ్యరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటి నమిత వస్తున్నారని తెలియడంతో ఆ గ్రామ ప్రజలతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి జనం అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఆ ప్రాంతం జన సంద్రంగా మారింది. సరిగ్గా రాత్రి 9.30 గంటలకు నటి నమిత నాటకాన్ని ప్రారంభించడానికి స్టేజ్‌పైకి వచ్చారు. జనాల కేరింతలతో స్టేజ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో జనం తోపులాటతో స్టేజ్ ఒక పక్కకు ఒరిగిపోయింది. వెంటనే నిర్వాహకులు నటి నమితను స్టేజీపై నుంచి సురక్షితంగా కిందికి దించి పక్కనున్న ఇంటికి తీసుకెళ్లారు.
అంబులెన్స్‌ల హడావుడి: నటి నమిత ప్రమాదంలో గాయపడ్డారన్న ప్రచారంతో నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న మూడు అంబులెన్స్‌లు హుటాహుటిన భగవతి ఆలయం వద్దకు చేరుకున్నాయి. నటి నమితను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పోటీపడ్డాయి. అయితే నమిత తనకెలాంటి గాయాలు అవ్వలేదని చెప్పడంతో అంబులెన్స్‌లు తిరిగి వెళ్లిపోయాయి. జనం మాత్రం నమితను చూడడానికి గుమికూడారు. అనంతరం భగవతి ఆలయం ముందు కొత్తగా మరో స్టేజ్‌ను ఏర్పాటు చేసి నాటకాన్ని ప్రారంభించాల్సిందిగా నిర్వాహకులు నమితను కోరగా ఆమె నిరాకరించారు. చివరికి దర్శకుడు కె.భాగ్యరాజ్ నాటకాన్ని ప్రారంభించారు. మంగళవారం వేకువ జామున నమిత, భాగ్యరాజ్ కారులో చెన్నైకి చేరుకున్నారు.