సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో మహిళలు ఎల్లప్పుడూ ఫోన్‌లో ఉంటున్నారు.. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని నోరుపారేసుకున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారని భాగ్యరాజా అభిప్రాయపడ్డారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం తప్పిదం మాత్రమే కాదు.. చట్టరీత్యా నేరం అనే విచక్షణ మరిచి మహిళల అజాగ్రత్త వల్లే పురుషులు తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా ఫోన్‌లలోనే ఉంటున్నారు, రెండేసి ఫోన్‌లు, సిమ్‌లు వాడుతున్నారు. వారిపై ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణం. మహిళలపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో ఇలాంటి నేరాలేవీ జరగలేదు అని అన్నారు.
అంతేకాదు తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి సంఘటనపై స్పందిస్తూ ఇందులో బాలురుపైన మాత్రమే నిందలు వేయడం సరికాదని వ్యాఖ్యానించాడు. అమ్మాయిలు చేసిన పొరపాటును వాళ్లు ఉపయోగించుకున్నారనీ, వారు అజాగ్రత్తగా ఉన్నందునే ఇలాంటి ఘటనలు జరుతున్నాయన్నారు. మగాళ్ల విచ్చలవిడి సంబంధాలను సమర్ధించు కొచ్చిన ఆయన ఒక పురుషుడు పొరపాటు చేస్తే, సరిదిద్దుకుంటాడు. అదే మహిళలు తప్పు చేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అలాగే పురుషుడికి చిన్నిల్లు (రెండవ భార్య) వుంటే ఆ స్త్రీ సంతోషంగా ఉంటుంది. ఆమెకు డబ్బు, ఆస్తి లభించడంతో పాటూ, మొదటి భార్యకు ఏ కష్టం కలగదు. కానీ ఒక మహిళకు కల్లా కదలన్ (రహస్య ప్రేమికుడు) వుంటే భర్తల్ని, పిల్లల్ని చంపేస్తున్నారని అన్నారు. రోజూ దినపత్రికల్లో వస్తున్న కేసులను ఈ సందర్భంగా ఉదాహరిస్తూ.. మహిళలు పరిమితుల్లో ఉండాలని సూచించారు.
తాను ఉమ్మడి కుటుంబం నుండి వచ్చినందున, తన సినిమాల్లో ‘తెలియకుండానే’ మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చానని చెప్పుకొచ్చిన భాగ్యరాజా, ‘ఉసి ఇడామ్ కుదుతా థాన్ నూల్ నుజాయ ముడియం’ మహిళల పట్ల తీవ్ర అవమానకరమైన తమిళ సామెతను ఉటంకిస్తూ, అత్యాచారాలకు మహిళలదే తప్పు అన్నట్టుగా రెచ్చిపోయారు. కాగా ఇప్పటికే ‘మీ టూ’ ఉద్యమంలో చెలరేగిన ఆరోపణలతో తమిళ చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. తాజాగా భాగ్యరాజ్ వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపనున్నాయి. ‘కరుతుకలై పాతివు సీ’ సినిమా సోషల్ మీడియా ద్వారా ఒక మహిళపై లైంగిక దాడులు (పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు ఆధారంగా) అనే కథాంశంతో కూడుకున్నది కావడం గమనార్హం. కాగా తమిళ రియాలిటీ షో బిగ్ బాస్-3 పార్టిసిపెంట్, ఫెమినిస్టు మోడల్ మీరా మిథున్, కస్తూరి రాజా, ఎస్ వె శేఖర్, నటుడు-సినిమాటోగ్రాఫర్ నటరాజ్, సంగీత దర్శకుడు ధీనా వంటి ప్రముఖులు ఈ వేదికపై ఉండగా భాగ్యరాజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వారు మౌన ప్రేక్షకులుగా ఉండడం మరింత బాధాకరమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment