Misogynistic remarks
-
మహిళలపై దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో మహిళలు ఎల్లప్పుడూ ఫోన్లో ఉంటున్నారు.. అదే దాడులకు, అత్యాచారాలకు కారణమవుతోందని నోరుపారేసుకున్నారు. మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి మహిళలు స్వీయ నియంత్రణ కోల్పోయారని భాగ్యరాజా అభిప్రాయపడ్డారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘కరుతుకలై పాతివు సీ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం తప్పిదం మాత్రమే కాదు.. చట్టరీత్యా నేరం అనే విచక్షణ మరిచి మహిళల అజాగ్రత్త వల్లే పురుషులు తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా ఫోన్లలోనే ఉంటున్నారు, రెండేసి ఫోన్లు, సిమ్‌లు వాడుతున్నారు. వారిపై ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణం. మహిళలపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో ఇలాంటి నేరాలేవీ జరగలేదు అని అన్నారు. అంతేకాదు తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి సంఘటనపై స్పందిస్తూ ఇందులో బాలురుపైన మాత్రమే నిందలు వేయడం సరికాదని వ్యాఖ్యానించాడు. అమ్మాయిలు చేసిన పొరపాటును వాళ్లు ఉపయోగించుకున్నారనీ, వారు అజాగ్రత్తగా ఉన్నందునే ఇలాంటి ఘటనలు జరుతున్నాయన్నారు. మగాళ్ల విచ్చలవిడి సంబంధాలను సమర్ధించు కొచ్చిన ఆయన ఒక పురుషుడు పొరపాటు చేస్తే, సరిదిద్దుకుంటాడు. అదే మహిళలు తప్పు చేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. అలాగే పురుషుడికి చిన్నిల్లు (రెండవ భార్య) వుంటే ఆ స్త్రీ సంతోషంగా ఉంటుంది. ఆమెకు డబ్బు, ఆస్తి లభించడంతో పాటూ, మొదటి భార్యకు ఏ కష్టం కలగదు. కానీ ఒక మహిళకు కల్లా కదలన్ (రహస్య ప్రేమికుడు) వుంటే భర్తల్ని, పిల్లల్ని చంపేస్తున్నారని అన్నారు. రోజూ దినపత్రికల్లో వస్తున్న కేసులను ఈ సందర్భంగా ఉదాహరిస్తూ.. మహిళలు పరిమితుల్లో ఉండాలని సూచించారు. తాను ఉమ్మడి కుటుంబం నుండి వచ్చినందున, తన సినిమాల్లో ‘తెలియకుండానే’ మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చానని చెప్పుకొచ్చిన భాగ్యరాజా, ‘ఉసి ఇడామ్ కుదుతా థాన్ నూల్ నుజాయ ముడియం’ మహిళల పట్ల తీవ్ర అవమానకరమైన తమిళ సామెతను ఉటంకిస్తూ, అత్యాచారాలకు మహిళలదే తప్పు అన్నట్టుగా రెచ్చిపోయారు. కాగా ఇప్పటికే ‘మీ టూ’ ఉద్యమంలో చెలరేగిన ఆరోపణలతో తమిళ చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. తాజాగా భాగ్యరాజ్ వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపనున్నాయి. ‘కరుతుకలై పాతివు సీ’ సినిమా సోషల్ మీడియా ద్వారా ఒక మహిళపై లైంగిక దాడులు (పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసు ఆధారంగా) అనే కథాంశంతో కూడుకున్నది కావడం గమనార్హం. కాగా తమిళ రియాలిటీ షో బిగ్ బాస్-3 పార్టిసిపెంట్, ఫెమినిస్టు మోడల్ మీరా మిథున్, కస్తూరి రాజా, ఎస్ వె శేఖర్, నటుడు-సినిమాటోగ్రాఫర్ నటరాజ్, సంగీత దర్శకుడు ధీనా వంటి ప్రముఖులు ఈ వేదికపై ఉండగా భాగ్యరాజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వారు మౌన ప్రేక్షకులుగా ఉండడం మరింత బాధాకరమనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
టికెట్లు పంపిస్తాం... సినిమా చూడండి!
‘‘ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు దెయ్యం పాత్రలూ చేస్తున్నారు. వాళ్లే సీతపాత్రలూ చేస్తున్నారు. నయనతారను చూస్తే దెయ్యాలు పారిపోతాయి’’... ఇలా ఇటీవల తమిళ చిత్రం ‘కొలైయుదిర్ కాలమ్’కి సంబంధించిన వేడుకలో నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నయనతారకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా చాలామంది సినీప్రముఖులు తమ గళం వినిపించారు. వారిలో సమంత కూడా ఉన్నారు. ‘‘మీరు బాధలో ఉన్న వ్యక్తి. మిమ్మల్ని చూస్తుంటే మాకు బాధగా ఉంది. మీ ఆత్మ లేక దాని తాలూకు ఏమైనా మీలో మిగిలి ఉంటే దానికి ప్రశాంతత కావాలి. నయనతార నెక్ట్స్ సూపర్‌హిట్ ఫిల్మ్ సినిమా టికెట్లు మీకు పంపిస్తాం. పాప్‌కార్న్ తింటూ చూసి ఆస్వాదించండి’’ అని కాస్త చమత్కరిస్తూనే తనదైన శైలిలో విమర్శిస్తూ సమంత ట్వీట్ చేశారు. సమంత ట్వీట్‌కు నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. -
రూపా గంగూలీపై రజాక్ అనుచిత వ్యాఖ్యలు
కోల్ కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీ, బెంగాల్ లో చోటు కోసం పాకులాడుతోన్న బీజేల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వాగ్బాణాలు కాస్తా గతితప్పి, మహిళలను కించపరిచేస్థాయికి దిగజారాయి. ప్రముఖ నటి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రూపా గంగూలీపై టీఎంసీకి చెందిన వృద్ధ నేత రజాక్ మొల్లా అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాదరణ పొందిన 'మహాభారత్' సీరియల్ లో ద్రౌపతి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రూపా గంగూలీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా (నార్త్) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆ స్థానంలో ప్రముఖ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా (టీఎంసీ)ను ఆమెను ఢీకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా మారింది. ఇతర నాయకులు కూడా తమ అభ్యర్థుల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బుధవారం టీఎంసీ ప్రచారసభలో పాల్గొన్న ఆ పార్టీ నేత రాజక్ మొల్లా, రూపా గంగూలీని ఉద్దేశించి.. 'ఆమె తాగే సిగరెట్ పొడవు ఎంతుంటుందో నాకు తెలుసు. సీరియల్ పాత్రలోనే కాదు నిజజీవితంలోనూ ఆమె ద్రౌపతే' అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని రజాక్.. తమ అధినేత్రి మమతా బెనర్జీపైనా, మరో నటి మున్ మున్ సేన్ పైనా అసహనపూరిత వ్యాఖ్యలు చేశారు. మున్ మున్ సేన్ ను పార్లమెంట్ (రాజ్యసభకు) పంపాలని మమత భావిస్తున్నదని, అయితే మున్ మున్ లాంటి సెలబ్రిటీలు ఎంపీలుగా ఏమాత్రం పనికిరారని, వారికి ప్రజాసమస్యలపై అవగాహన ఉండదని, అందుకే మమత ఆపని చేయకూడదని కోరుకుంటున్నట్లు రజాక్ చెప్పారు. అసలే ఎన్నికల సమయం కావటంతో రజాక్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఒక మహిళ నేతృత్వంలో నడిచే పార్టీ నాయకులు మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దారుణమని, రజాక్ తనను అవమానించారని, ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని రూపా గంగూలీ అన్నారు.