రూపా గంగూలీపై రజాక్ అనుచిత వ్యాఖ్యలు
కోల్ కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీ, బెంగాల్ లో చోటు కోసం పాకులాడుతోన్న బీజేల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వాగ్బాణాలు కాస్తా గతితప్పి, మహిళలను కించపరిచేస్థాయికి దిగజారాయి. ప్రముఖ నటి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రూపా గంగూలీపై టీఎంసీకి చెందిన వృద్ధ నేత రజాక్ మొల్లా అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాదరణ పొందిన 'మహాభారత్' సీరియల్ లో ద్రౌపతి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రూపా గంగూలీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా (నార్త్) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆ స్థానంలో ప్రముఖ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా (టీఎంసీ)ను ఆమెను ఢీకొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా మారింది. ఇతర నాయకులు కూడా తమ అభ్యర్థుల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బుధవారం టీఎంసీ ప్రచారసభలో పాల్గొన్న ఆ పార్టీ నేత రాజక్ మొల్లా, రూపా గంగూలీని ఉద్దేశించి.. 'ఆమె తాగే సిగరెట్ పొడవు ఎంతుంటుందో నాకు తెలుసు. సీరియల్ పాత్రలోనే కాదు నిజజీవితంలోనూ ఆమె ద్రౌపతే' అని వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగని రజాక్.. తమ అధినేత్రి మమతా బెనర్జీపైనా, మరో నటి మున్ మున్ సేన్ పైనా అసహనపూరిత వ్యాఖ్యలు చేశారు. మున్ మున్ సేన్ ను పార్లమెంట్ (రాజ్యసభకు) పంపాలని మమత భావిస్తున్నదని, అయితే మున్ మున్ లాంటి సెలబ్రిటీలు ఎంపీలుగా ఏమాత్రం పనికిరారని, వారికి ప్రజాసమస్యలపై అవగాహన ఉండదని, అందుకే మమత ఆపని చేయకూడదని కోరుకుంటున్నట్లు రజాక్ చెప్పారు. అసలే ఎన్నికల సమయం కావటంతో రజాక్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఒక మహిళ నేతృత్వంలో నడిచే పార్టీ నాయకులు మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దారుణమని, రజాక్ తనను అవమానించారని, ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని రూపా గంగూలీ అన్నారు.