west bengal assembly elections
-
బెంగాల్లో మూడేళ్లలోనే ఎన్నికలు.. ‘ముందస్తు’పై బీజేపీ హింట్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టి అధినేత్రి మమతా బెనర్జీ పాపులర్ డైలాగ్ ‘ఖేలా హోబ్’(ఆట ఆడదాం)ను తిరిగి టీఎంసీపైనే ప్రయోగిస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు ఆట ఆడాల్సి ఉందని పేర్కొంది. తాము అహింసను నమ్ముతామని నొక్కి చెప్పారు బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సుకంతా మజుందర్. అయితే, తమను రెచ్చగొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బర్రక్‌పోరాలో నిర్వహించిన బహిర సభలో ఈ మేరకు టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్ర ఆస్తులను అమ్మేస్తున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ త్వరలోనే తుడిచిపెట్టుకుపోతుందని భరోసా ఇస్తున్నా. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా నేను ఆశ్చర్యపోను.’ అంటూ ముందస్తు ఎన్నికలపై హించ్ ఇచ్చారు బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మజుందర్. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల కేసుల్లో సుమారు 300 మంది టీఎంసీ కార్యకర్తలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. మరింత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చిరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నంత వరకు తప్పించుకోలేరని పేర్కొన్నారు. పోలీస్ బలగాలు తటస్థంగా ఉండేలా లోక్‌సభలో బిల్లు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: కోవిడ్ అప్డేట్.. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందిలో రోగనిరోధక శక్తి -
Mamata Banerjee: భారత్‌ను రక్షించిన బెంగాల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ తన తీర్పుతో భారతదేశాన్ని రక్షించిందని తృణమూ ల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి అఖండ విజయం కట్టబెట్టిన బెంగాల్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె ఆదివారం సాయంత్రం కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్–19 మహమ్మారిని అరికట్టడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడా విజయోత్సవాలు జరపొద్దని పార్టీ శ్రేణుల కు విజ్ఞప్తి చేశారు. ఇది బెంగాల్ ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయమని వ్యాఖ్యానించారు. ఈరోజు భారత్‌ను బెంగాల్ కాపాడిందని పేర్కొ న్నారు. మానవత్వాన్ని సైతం రక్షించిందని వివరిం చారు. ఎన్నో అవాంతరాలకు ఎదురొడ్డి నిలిస్తే ఈ గెలుపుదక్కిందని వెల్లడించారు. కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, యంత్రాం గానికి వ్యతిరేకంగా పోరాటం సాగించామని గుర్తుచేశారు. డబుల్ ఇంజన్ కాదు.. డబుల్ సెంచరీ ఎన్నికల సంఘం(ఈసీ) తీరుపైనా దీదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈసీ తమ పార్టీని వేధింపులకు గురి చేసిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా డబుల్ ఇంజన్ ప్రభుత్వం గురించి మాట్లాడగా, ఎన్నికల్లో తమ పార్టీ డబుల్ సెంచరీ సాధించిందని వ్యాఖ్యానించారు. 2021లో 221 సీట్లు సాధించాలని ఆశించామని, లక్ష్యానికి చేరువయ్యా మని చెప్పారు. నందిగ్రామ్‌లో ఓట్ల లెక్కింపులో గందరగోళం జరిగిందని, దీనిపై కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. బెంగాల్లో గొప్ప విజయం సాధించామని, అదే సమయంలో నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తానని పేర్కొన్నారు. వారి తీర్పు ఏదైనప్పటికీ అంగీకరిస్తానని తెలిపారు. భారతీయులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాల్సిందే ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని మమతా బెనర్జీ తెలిపారు. పూర్తిగా కోలుకుంటానని, కాలుకు కట్టు (ప్లాస్టర్) తొలగిస్తానని కొద్ది రోజుల క్రితమే చెప్పానని అన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. బెంగాల్ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తానని పునరు ద్ఘాటించారు. ప్రతి భారతీయుడికి ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని 140 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వడానికి రూ.30,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఉచిత టీకా విషయంలో తన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే కోల్‌కతాలో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ధర్నాలో కూర్చుంటానని హెచ్చరించారు. ఎన్నికల్లో తమ పార్టీకి అద్భుతమైన విజయం దక్కినప్పటికీ ప్రమాణ స్వీకారం నిరాడంబరంగానే చేస్తానని చెప్పారు. ఆర్భాటానికి దూరంగా ఉంటామన్నారు. కరోనా ఉధృతి కారణంగా విజయోత్సవాలకు సమయం లేదని, మహమ్మారిని అరికట్టడంపైనే దృష్టి పెడతానని వివరించారు. ఈ ముప్పు తొలగిపోయాక కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మెగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. -
బెంగాల్: ముగిసిన తుది విడత పోలింగ్
► బెంగాల్ లో నేడు జరుగుతున్న తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటల వరకు 76.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బీభం: 81.82 శాతం కోల్‌కతా నార్త్: 57.85 శాతం మాల్డా: 79.98 శాతం ముర్షిదాబాద్: 78.09 శాతం ► బెంగాల్ తుది విడత పోలింగ్ లో భాగంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో సా.5.30 గంటల వరకు 76.07 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ► బెంగాల్ తుది విడత పోలింగ్ లో భాగంగా నేడు జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం 3గంటల వరకు 68.66 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మాల్డా: 70.85% ముర్షిదాబాద్: 70.91% కోల్‌కతా: 51.40% బీభం: 73.92% ► బెంగాల్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 వరకు 37.80 శాతం పోలింగ్ నమోదైంది.ఓటర్లు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలి వస్తున్నారు. ► ఉదయం 9:30 వరకు 16.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ► పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. నటుడు మిథున్ చక్రవర్తి ఉత్తర కోల్‌కతాలోని కాశిపూర్-బెల్గాచియా పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుక్నురు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను ఇంత ప్రశాంతంగా గతంలో ఎప్పుడూ ఓటు వేయలేదని తెలిపారు. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చివరి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 11,680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆఖరి విడత ఎన్నికల బరిలో 283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాస్క్‌లు, సానిటైజర్లు పోలింగ్ కేంద్రాల ముందు ఏర్పాటు చేశారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. చదవండి: లాక్డౌన్ ఉంది ఎలా బతకాలి?.. 'ఆకలితో చస్తే.. చావు' -
బెంగాల్ నాలుగోదశ ఎన్నికల పోలింగ్ లో హింస
-
మమత పాలనలో నిర్మమత
హల్దియా: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో అమలు చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి రాష్ట్ర ప్రజలు మమత(ఆప్యాయత)ను కోరుకుంటే గత పదేళ్లలో నిర్మమత(క్రూరత్వం) దక్కిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అధికార దుర్వినియోగానికి పర్యాయపదంగా మారిపోయిందని దుయ్యబట్టారు. గత పదేళ్లలో ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందన్నారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ‘‘భారత్ మాతాకీ జై అని నినదిస్తే సీఎం మమతా బెనర్జీ కోపగించుకుంటున్నారు. హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న ప్రజలపై ఆగ్రహిస్తున్నారు. దేశాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి కుట్రలు జరుగుతుంటే మమతా బెనర్జీ నోరు విప్పడం లేదు’’ అని మోదీ విమర్శించారు. వన్ నేషన్.. వన్ గ్యాస్గ్రిడ్ ప్రధాని మోదీ హల్దియాలో చమురు, సహజ వాయువు రంగాలకు సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆదివారం జాతికి అంకితం చేశారు. ఇందులో 348 కిలోమీటర్ల డోభీ–దుర్గాపూర్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ కూడా ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘గెయిల్’ నిర్మించింది. ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. భారతీయ తేనీరుపై అంతర్జాతీయ కుట్ర భారతీయ తేనీరును అప్రతిష్టపాలు చేయడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ కుట్రకు అస్సాంలోని టీ కార్మికులు ధీటైన జవాబు ఇస్తారని అన్నారు. తేయాకు ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అస్సాంలో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే రెండోసారి. రాష్ట్రంలో రూ.8,210 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘అసోంమాలా’ పథకాన్ని ప్రారంభించారు. రెండు వైద్య కళాశాలల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన.. తేయాకు రంగానికి కేంద్ర బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. అస్సాంలో ప్రతి టీ కార్మికుడికి రూ.3,000 చొప్పున సాయం అందిస్తున్నామని వెల్లడించారు. గత ఐదేళ్లలో అస్సాం గణనీయంగా అభివృద్ధి సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు మెరుగయ్యాయని అన్నారు. ఐదేళ్లలో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. అధునాతన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. -
బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: అమిత్ షా
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీని ఎంచుకున్నారని అన్నారు. అమిత్ షా ఆదివారం బోల్పూర్లో రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ‘ఈ రోడ్ షో మమతా దీదీ పట్ల బెంగాల్ ప్రజలు కోపాన్ని చూపిస్తోంది. ఇలాంటి రోడ్ షో నా జీవితంలో చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల బెంగాల్ ప్రజల నమ్మకం, ప్రేమ ఈ రోడ్ షో చూపిస్తోంది. ఇప్పటివరకూ కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ పాలన చూశారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అయిదేళ్లలో స్వర్ణ బెంగాల్ సాధిస్తాం’ అని అమిత్ షా అన్నారు. అంతకు ముందు ఆయన విశ్వభారతి యూనివర్శిటీని సందర్శించారు. ఆ తర్వాత బెంగాలీ ఫోక్ సింగర్ నివాసంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేశారు. (అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి సువెందు అధికారి) కాగా 2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ శరవేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పశ్చిమ బెంగాల్లో పర్యటించిన విషయం విదితమే. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. (మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్ ట్విస్టు!) -
అసదుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఏఐఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ నేతలతో శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు. బెంగాల్ ప్రతినిధులతో ఈరోజు ఫలవంతమైన చర్చలు జరిగాయని అసదుద్దీన్ ట్విటర్లో పేర్కొన్నారు. బెంగాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నతికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక వచ్చే ఏడు జరగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేస్తామని ఏఐఎంఐఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీకి దిగుతుండటంతో ఆయా పార్టీల్లో కలవరం మొదలైంది. తమ ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి ఎంఐఎం ఏ విధంగా చేటు చేస్తుందోనని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎంఐఎం దెబ్బతో బిహార్‌లో మహాఘట్ బంధన్‌ను అధికారానికి దూరం చేసింది. ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. ఐదు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా.. చాలా స్థానాల్లో ఆర్జేడీ ఓట్లను చీల్చింది. ఇదిలాఉండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీఎంసీ వర్గాలే ఈ దాడికి పాల్పాడ్డాయని బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఎంఐఎం కూడా రంగంలోకి దిగడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. జాతీయ స్థాయిలో విస్తరణ ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఎంఐఎం.. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న సంకల్పంతో ఒక్కో రాష్ట్రంలో అడుగు మోపుతుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వేళ్లూనుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబర్చి అదే ఉత్సాహంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి సై అంది. బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది ఎంఐఎం సభ్యులుండేలా ఓవైసీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీమాంచల్ ప్రాంతంతోపాటు.. 24 పరగణాలు, అసన్సోల్ వంటి ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీకి బలమైన కేడర్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంఐఎం టార్గెట్ చేస్తోంది. -
మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో కలిసి పోటీ చేయడానికి ఏఐఎంఐఎం ముందుకొచ్చింది. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించారు. బిహార్‌లో తన పార్టీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న అసదుద్దీన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పావులు కదుపుతున్నారు. బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 5 సీట్ల గెలుపుతో ఎంఐఎం ఉత్సాహంగా ఉంది. అందుకే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ తన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్లు ఒవైసీ ప్రకటించారు. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణా జిల్లాలపై ఒవైసీ దృష్టిసారించారు. ఈ ఐదు జిల్లాల్లో సుమారు 60కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మమతాకు ఎంత నష్టం? బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీని తృణమూల్ కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకుకు ముప్పుగానే భావిస్తోంది. బిహార్ ఎన్నికల్లో సంచలనంగా మారిన మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో, బెంగాల్లో తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను ఒవైసీ తన వైపు తిప్పుకుంటారని టీఎంసీ, కాంగ్రెస్‌లకు ఆందోళన మొదలైంది. పశ్చిమ బెంగాల్లో 24 శాతం బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉండగా, 6 శాతం హిందీ మాట్లాడే ముస్లింలు ఉన్నారు. వాస్తవానికి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీల మ«ధ్యే జరగనుంది. అదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు సైతం మమతాతో పోరాడుతున్నాయి. ఇలాంటి త్రికోణ పోటీ మధ్యలో, ఎంఐఎం దీటైన అభ్యర్థులతో బెంగాల్ ఎన్నికల బరిలో దిగితే, బిహార్‌లో మహాకూటమి మాదిరిగా మమతా బెనర్జీ ప్రత్యక్ష నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటుబ్యాంకును దెబ్బతీసేందుకు ఎంఐఎంను కమలదళం రంగంలోకి దింపిందని టీఎంసీ నేతల వాదన. బీజీపీ బీ–టీంగా పనిచేస్తూ, లౌకిక పార్టీల ఓటుబ్యాంకుకు నష్టం చేకూర్చటమే ఎంఐఎం లక్ష్యమని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. -
రూపా గంగూలీపై రజాక్ అనుచిత వ్యాఖ్యలు
కోల్ కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీ, బెంగాల్ లో చోటు కోసం పాకులాడుతోన్న బీజేల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వాగ్బాణాలు కాస్తా గతితప్పి, మహిళలను కించపరిచేస్థాయికి దిగజారాయి. ప్రముఖ నటి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రూపా గంగూలీపై టీఎంసీకి చెందిన వృద్ధ నేత రజాక్ మొల్లా అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాదరణ పొందిన 'మహాభారత్' సీరియల్ లో ద్రౌపతి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రూపా గంగూలీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా (నార్త్) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆ స్థానంలో ప్రముఖ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా (టీఎంసీ)ను ఆమెను ఢీకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా మారింది. ఇతర నాయకులు కూడా తమ అభ్యర్థుల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బుధవారం టీఎంసీ ప్రచారసభలో పాల్గొన్న ఆ పార్టీ నేత రాజక్ మొల్లా, రూపా గంగూలీని ఉద్దేశించి.. 'ఆమె తాగే సిగరెట్ పొడవు ఎంతుంటుందో నాకు తెలుసు. సీరియల్ పాత్రలోనే కాదు నిజజీవితంలోనూ ఆమె ద్రౌపతే' అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని రజాక్.. తమ అధినేత్రి మమతా బెనర్జీపైనా, మరో నటి మున్ మున్ సేన్ పైనా అసహనపూరిత వ్యాఖ్యలు చేశారు. మున్ మున్ సేన్ ను పార్లమెంట్ (రాజ్యసభకు) పంపాలని మమత భావిస్తున్నదని, అయితే మున్ మున్ లాంటి సెలబ్రిటీలు ఎంపీలుగా ఏమాత్రం పనికిరారని, వారికి ప్రజాసమస్యలపై అవగాహన ఉండదని, అందుకే మమత ఆపని చేయకూడదని కోరుకుంటున్నట్లు రజాక్ చెప్పారు. అసలే ఎన్నికల సమయం కావటంతో రజాక్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఒక మహిళ నేతృత్వంలో నడిచే పార్టీ నాయకులు మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దారుణమని, రజాక్ తనను అవమానించారని, ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని రూపా గంగూలీ అన్నారు. -
ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తాం
ఎన్నికల షెడ్యూలు అలా విడుదల అయ్యిందో లేదో... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే తన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. ఆరు దశల్లో పశ్చిమబెంగాల్‌కు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని మమత చెప్పారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భూటియా ఈసారి సిలిగురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నారు. అలాగే ఉత్తర హౌరా నుంచి లక్ష్మీరతన్ శుక్లా, బాలీ నుంచి వైశాలి దాల్మియా పోటీ చేస్తారని ఆమె అన్నారు. 2011 ఎన్నికలలో తమ పార్టీ తరఫున మొత్తం 31 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారని, ఈసారి వారి సంఖ్య 45కు పెరిగిందని మమత వివరించారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్‌కు 2011లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్‌యూసీ పార్టీలతో కలిసి టీఎంసీ పోటీచేసింది. అప్పట్లో ఈ కూటమికి మొత్తం 227 స్థానాలు వచ్చాయి. టీఎంసీ ఒక్కటీ విడిగా 184 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీకి 42, ఎస్యూసీకి ఒక స్థానం దక్కాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన మెజారిటీ సొంతంగానే దక్కడంతో ఈసారి ఒంటరిపోరువైపే మమత మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.