ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తాం
ఎన్నికల షెడ్యూలు అలా విడుదల అయ్యిందో లేదో... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే తన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. ఆరు దశల్లో పశ్చిమబెంగాల్‌కు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని మమత చెప్పారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భూటియా ఈసారి సిలిగురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నారు. అలాగే ఉత్తర హౌరా నుంచి లక్ష్మీరతన్ శుక్లా, బాలీ నుంచి వైశాలి దాల్మియా పోటీ చేస్తారని ఆమె అన్నారు.
2011 ఎన్నికలలో తమ పార్టీ తరఫున మొత్తం 31 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారని, ఈసారి వారి సంఖ్య 45కు పెరిగిందని మమత వివరించారు. మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్‌కు 2011లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్‌యూసీ పార్టీలతో కలిసి టీఎంసీ పోటీచేసింది. అప్పట్లో ఈ కూటమికి మొత్తం 227 స్థానాలు వచ్చాయి. టీఎంసీ ఒక్కటీ విడిగా 184 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీకి 42, ఎస్‌యూసీకి ఒక స్థానం దక్కాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావల్సిన మెజారిటీ సొంతంగానే దక్కడంతో ఈసారి ఒంటరిపోరువైపే మమత మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.