
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో కలిసి పోటీ చేయడానికి ఏఐఎంఐఎం ముందుకొచ్చింది. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించారు. బిహార్‌లో తన పార్టీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న అసదుద్దీన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో పావులు కదుపుతున్నారు. బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 5 సీట్ల గెలుపుతో ఎంఐఎం ఉత్సాహంగా ఉంది. అందుకే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ తన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్లు ఒవైసీ ప్రకటించారు. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణా జిల్లాలపై ఒవైసీ దృష్టిసారించారు. ఈ ఐదు జిల్లాల్లో సుమారు 60కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
మమతాకు ఎంత నష్టం?
బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీని తృణమూల్ కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకుకు ముప్పుగానే భావిస్తోంది. బిహార్ ఎన్నికల్లో సంచలనంగా మారిన మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో, బెంగాల్‌లో తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను ఒవైసీ తన వైపు తిప్పుకుంటారని టీఎంసీ, కాంగ్రెస్‌లకు ఆందోళన మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లో 24 శాతం బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉండగా, 6 శాతం హిందీ మాట్లాడే ముస్లింలు ఉన్నారు. వాస్తవానికి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీల మ«ధ్యే జరగనుంది. అదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు సైతం మమతాతో పోరాడుతున్నాయి. ఇలాంటి త్రికోణ పోటీ మధ్యలో, ఎంఐఎం దీటైన అభ్యర్థులతో బెంగాల్ ఎన్నికల బరిలో దిగితే, బిహార్‌లో మహాకూటమి మాదిరిగా మమతా బెనర్జీ ప్రత్యక్ష నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటుబ్యాంకును దెబ్బతీసేందుకు ఎంఐఎంను కమలదళం రంగంలోకి దింపిందని టీఎంసీ నేతల వాదన. బీజీపీ బీ–టీంగా పనిచేస్తూ, లౌకిక పార్టీల ఓటుబ్యాంకుకు నష్టం చేకూర్చటమే ఎంఐఎం లక్ష్యమని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment