ధెకియాజులిలో ప్రధాని మోదీ తలపై సంప్రదాయ అస్సామీ టోపీ ‘జపి’ పెడుతున్న సీఎం సోనోవాల్
హల్దియా: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి రాష్ట్ర ప్రజలు మమత(ఆప్యాయత)ను కోరుకుంటే గత పదేళ్లలో నిర్మమత(క్రూరత్వం) దక్కిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అధికార దుర్వినియోగానికి పర్యాయపదంగా మారిపోయిందని దుయ్యబట్టారు.
గత పదేళ్లలో ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందన్నారు. అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ‘‘భారత్ మాతాకీ జై అని నినదిస్తే సీఎం మమతా బెనర్జీ కోపగించుకుంటున్నారు. హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న ప్రజలపై ఆగ్రహిస్తున్నారు. దేశాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి కుట్రలు జరుగుతుంటే మమతా బెనర్జీ నోరు విప్పడం లేదు’’ అని మోదీ విమర్శించారు.
వన్ నేషన్.. వన్ గ్యాస్‌గ్రిడ్
ప్రధాని మోదీ హల్దియాలో చమురు, సహజ వాయువు రంగాలకు సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆదివారం జాతికి అంకితం చేశారు. ఇందులో 348 కిలోమీటర్ల డోభీ–దుర్గాపూర్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ కూడా ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘గెయిల్’ నిర్మించింది. ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు.
భారతీయ తేనీరుపై అంతర్జాతీయ కుట్ర
భారతీయ తేనీరును అప్రతిష్టపాలు చేయడానికి అంతర్జాతీయ కుట్ర జరుగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ కుట్రకు అస్సాంలోని టీ కార్మికులు ధీటైన జవాబు ఇస్తారని అన్నారు. తేయాకు ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అస్సాంలో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే రెండోసారి. రాష్ట్రంలో రూ.8,210 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘అసోంమాలా’ పథకాన్ని ప్రారంభించారు.
రెండు వైద్య కళాశాలల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన.. తేయాకు రంగానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. అస్సాంలో ప్రతి టీ కార్మికుడికి రూ.3,000 చొప్పున సాయం అందిస్తున్నామని వెల్లడించారు. గత ఐదేళ్లలో అస్సాం గణనీయంగా అభివృద్ధి సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు మెరుగయ్యాయని అన్నారు. ఐదేళ్లలో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. అధునాతన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment