
ఘర్షణలో గాయపడ్డ కార్యకర్తలు (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీంగ్ కేంద్రం బయట భద్రతాదళాలు కాల్పులకు దిగడంతో నలుగురు మృతి చెందారు. కూచ్‌బెహార్ జిల్లాలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ ఈ కాల్పులకు దారితీసింది. కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచిలో గల ఓ పోలింగ్ కేంద్రం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్ బుర్మాన్ అనే ఓ యువ ఓటరుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఓటరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కాగా.. ఈ హత్యపై బీజేపీ, టీఎంసీ నాయకలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఘటన వెనుక కాషాయ పార్టీ హస్తం ఉందని టీఎంసీ ఆరోపించింది. అయితే మృతుడు తమ పోలింగ్ ఏజెంట్ అని, అధికార పార్టీయే అతడిపై కాల్పులు జరిపిందని బీజేపీ మండి పడింది. కాల్పుల నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద దాడులకు దిగారు. పరస్పరం బాంబులు విసురుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశాయి.
అయినప్పటికీ ఉద్రిక్తతలు సద్దుమణకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది భారీగా మోహరించారు. ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సీతల్‌కుచి ప్రాంతంలో పోలింగ్ నిలిపివేసింది. ఘర్షణలకు సంబంధించి శనివారం సాయంత్ర ఐదు గంటల వరకు పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ సంఘటని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. మమతా బెనర్జీపై విమర్శల వర్షం కురిపించారు. కుచ్‌బిహార్‌లో జరిగిన సంఘటన ఏదైతే ఉంది అది చాలా బాధకరం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. జనాలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారనే భయంతోనే మమత దీదీ, ఆమె గుండాలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేత కారుపై దాడి
మరోవైపు హుగ్లీ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ కారుపై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులపై, వాహనాలపైనా దాడి చేశారు. ఈ ఘటనపై లాకెట్ ఛటర్జీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘‘నా కారుపై దాడి చేసి నన్ను గాయపర్చారు. ఈ ప్రాంతంలో రిగ్గింగ్ జరుగుతోంది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్నికల అధికారులు వచ్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు’’ అని అమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment