సాక్షి, కోల్‌కతా: దేశంలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా వ్యాప్తిస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై మరోసారి ధ్వజమెత్తారు. దేశంలో కరోనా మహమ్మారి ఇంతలా విజృంభించడానికి మోదీనే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్‌ను మోదీ సృష్టించిన విపత్తుగా మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలోని బాలూర్‌ఘాట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆమె ప్రధానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒకవైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. మరోవైపు ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవు, ఆక్సిజన్‌కూ కొరత వేధిస్తోందన్నారు. దేశంలో ఇన్ని విపత్కర పరిస్థితులు ఉన్నా కరోనా టీకాలను, ఔషధాలను మాత్రం విదేశాలకు తరలించారంటూ ఆమె విమర్శించారు. అంతేకాదు బెంగాల్లో "బెంగాల్ ఇంజిన్ ప్రభుత్వం" మాత్రమే ఏర్పాటవుతుంది తప్ప "మోదీ డబుల్ ఇంజిన్" ద్వారా కాదని మమతా పేర్కొన్నారు. ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్, బెంగాల్ మాత గౌరవాన్ని కాపాడటానికి చేసే పోరాటంగా ఆమె అభివర్ణించారు. రాష్ట్రానికి తాను కాపలాదారుడిగా వ్యవహరిస్తానంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. దక్షిణ పినాజ్‌పూర్ జిల్లాలో గత పదేళ్లలో టీఎంసీ ప్రభుత్వం రోడ్లు, ఆస్పత్రులు, వంతెనలు, స్టేడియాలతోపాటు పారిశ్రామిక కేంద్రాన్ని నిర్మించిందని ఈ సందర్భంగా బెనర్జీ చెప్పారు. కాగా 294 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో జరుగుతున్నాయి. మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment