రూపా గంగూలీ.. అలనాటి బెంగాలీ హీరోయిన్. మహాభారత్ సీరియల్‌లో ద్రౌపదిగా నటించి అన్ని భాషల ప్రేక్షకులకూ దగ్గరైంది. సీరియల్స్ మాత్రమే కాకుండా షార్ట్ ఫిలింస్, సినిమాల్లోనూ నటించింది. హిందీ, ఇంగ్లీష్, ఇటాలియన్, బెంగాలీ, కన్నడ, మలయాళ, అస్సామీ భాషల్లో నటించింది. తెలుగులో కథానాయికగా శశిరేఖ శపథం, నా ఇల్లే నా స్వర్గం, ఇన్‌స్పెక్టర్ భవానీ సినిమాలు చేసింది. ఎంతోమంది గొప్పగొప్ప దర్శకులతో పని చేసిన ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
కొడుకు పుట్టాక విడాకులు
నటి రూపా గంగూలీ.. 1992లో మెకానికల్ ఇంజనీర్ ద్రుభో ముఖర్జీని పెళ్లాడింది. వీరికి 1997లో ఆకాశ్ అనే తనయుడు జన్మించాడు. కానీ తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు. 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రూపా బెంగాలీ సింగర్ దిబ్యేందు ముఖర్జీని ప్రేమించింది. వీరిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. రూపా ఇంట్లోనే దిబ్యేందు తిష్ట వేశాడు. కొన్నేళ్లపాటు సహజీవనం చేశారు. కానీ చివరకు ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.
మూడుసార్లు చనిపోయేందుకు ప్రయత్నించా
దీని గురించి రూపా గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నేను చనిపోవాలనుకున్నాను. మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాను. కొడుకు పుట్టకముందు ఓసారి వాడు పుట్టిన తర్వాత రెండుసార్లు చనిపోదామని ప్రయత్నించాను. కానీ ప్రతిసారీ బతికిపోయేదాన్ని. నన్ను నేను అంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నించాను. కానీ దేవుడు దాన్ని జరగనివ్వలేదు. వైవాహిక బంధంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను.
సారీ చెప్పగానే విడాకులు వద్దనుకునేదాన్ని
విడాకులు తీసుకుందామని ఎన్నోసార్లు అనుకునేదాన్ని, మళ్లీ చివరి నిమిషంలో ఆగిపోయేదాన్ని. విడాకులు కావాలనగానే అతడు సారీ చెప్పేవాడు. అలా మా మధ్య గొడవ చల్లారిపోయేది. కానీ 2002 సంవత్సరం నాటికి ఇంకా భరించడం నా వల్ల కాలేదు' అని చెప్పుకొచ్చింది. అలా వీరు 2007లో అధికారికంగా విడిపోయారు. భర్త నుంచి ఒక్క రూపాయి కూడా భరణంగా ఆశించలేదు రూపా.
గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: ఊహించని పేరు, డబ్బు.. చివరి క్షణాల్లో నరకం.. ‘ఐటమ్ గర్ల్’ విషాద గాథ
Comments
Please login to add a commentAdd a comment