3,500 కోట్లతో కాగితపు పరిశ్రమ
తెలంగాణలో ఏర్పాటుకు ఐటీసీ సంసిద్ధత
సీఎంతో పారిశ్రామిక వేత్తల భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో హిందుజా చైర్మన్ అశోక్ హిందుజా, మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణి, ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ప్రదీప్ దొబాలే, డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్‌సింగ్ తదితరులు వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వ్యవసాయాధార పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు స్థాపించేందుకు, తెలంగాణలో దాదాపు లక్ష ఎకరాల్లో సర్వి చెట్లు పెంచేందుకు ఐటీసీ తన సంసిద్ధతను వ్యక్తంచేసింది. రూ. 3,500 కోట్ల పెట్టుబడితో కాగితపు పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని సమకూర్చేందుకు కేసీఆర్ సంసిద్ధత వ్యక్తంచేశారు. తెలంగాణలో మైక్రోసాఫ్ట్ కార్యక్రమాలను మరింత విస్తరించాలనుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా ఛైర్మన్ భాస్కర్ ప్రామాణి ప్రకటించారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో ఆయన కేసీఆర్‌ను కలిశారు. ఒప్పందం ప్రకారం తమకు రావాల్సిన విద్యుత్‌ను సరఫరా చేయాలని ముఖ్యమంత్రి హిందుజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందుజాను కోరారు. త్వరలో తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని ఆయన పారిశ్రామిక వేత్తలకు చెప్పారు.