SLBC ప్రమాదం.. ఎనిమిది మంది ప్రాణాలతో ఉన్నారా? | Srisailam SLBC Tunnel Roof Collapsed Rescue Operation Updates | Sakshi
Sakshi News home page

SLBC ప్రమాదం.. టన్నెల్‌లో మోకాళ్ల లోతు బురద!

Published Sun, Feb 23 2025 7:47 AM | Last Updated on Sun, Feb 23 2025 11:26 AM

 Srisailam SLBC Tunnel Roof Collapsed Rescue Operation Updates

SLBC Tunnel Rescue Operation Updates..

👉శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్‌ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. 

రేవంత్‌కు రాహుల్‌ ఫోన్‌..

  • SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్ గాంధీ
  • సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరా
  • దాదాపు 20 నిమిషాలు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • వెంటనే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో తెలిపిన సీఎం
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంఘటన స్థలానికి చేరుకొని తరలించడం, NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్‌లను మోహరించామన్న రేవంత్‌
  • గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్న సీఎం
  • ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర  పర్యవేక్షణను అభినందించిన రాహుల్ గాంధీ

 

మంత్రి ఉత్తమ్‌ కామెంట్స్‌.. 

  • టన్నెల్‌ చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. 
  • రాత్రి నుంచి కేంద్ర బృందాలు రాష్ట్ర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 
  • 14 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళగలిగాం. 
  • టెన్నెల్‌ బోర్ మెషిన్ లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. 
     

టన్నెల్‌ నీటిమయం..

  • ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, సీనియర్ ఐఏఎస్ శ్రీధర్.
  • మరోసారి తన లోపలికి వెళ్లిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం.
  • 12వ కిలోమీటర్ నుంచి పూర్తిగా బురదమయం.
  • నీటితో కూడుకున్న టన్నెల్.
  • నీటిని బయటికి తీసేందుకే సమాలోచనలు.
  • నీరంతా బయటకి తోడిన తర్వాతే భవిష్యత్తు సహాయక చర్యలు చేపట్టే అవకాశం.
  • వారంతా ప్రాణాలతో ఉన్నారా? లేదా?
  • లోపలికి ఆక్సిజన్‌ అందుతోందా?.
  • అనే అనుమానాలు వ్యక్తమువుతున్నాయి. 

రాత్రి పరిస్థితి ఇది..
👉ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న రాత్రి 12 గంటలకు వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల లోపలికి వెళ్లి  పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్బంగా మోకాళ్ల లోతు బురద ఉన్నట్టు వారు గుర్తించారు. 

 

👉ఇక, ఈ సొరంగానికి ఇన్‌లెట్‌ తప్ప ఎక్కడా ఆడిట్‌ టన్నెళ్లు, ఎస్కేప్‌ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. 

చిక్కుకున్నది వీరే.. 
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్‌ (పీఈ), శ్రీనివాస్‌ (ఎస్‌ఈ), రోజువారీ కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్‌ (37), సంతోష్‌సాహు (37), అనూజ్‌ సాహు (25) ఉన్నారు. రాబిన్‌సన్‌ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్‌ (35), గురుదీప్‌ సింగ్‌ (40) సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడిన వారు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే.

మంత్రుల పర్యవేక్షణ..
👉మరోవైపు.. దోమలపెంట వద్దకు నేడు మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షించనున్నారు.

ఇటీవలే పనులు పునః ప్రారంభమై... 
👉శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్‌ఎల్‌బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్‌ ఇన్‌లెట్‌) నుంచి టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్‌ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. 

👉ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్‌ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్‌ ఇన్‌లెట్‌ నుంచి 14 కిలోమీటర్‌ పాయింట్‌ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్‌ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. 

నీటి ఊట పెరిగి.. కాంక్రీట్‌ సెగ్మెంట్‌ ఊడిపోయి.. 
👉శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్‌లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్‌బోల్ట్, కాంక్రీట్‌ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్‌కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్‌కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్‌లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. 

వేగంగా సహాయక చర్యలు చేపట్టినా..
👉సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్‌ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement