ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగ్‌ను గుర్తు చేస్తోంది స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మీ. కేవలం మూడేళ్ల కిందట భారత మార్కెట్‌లో అడుగు పెట్టిన ఈ కంపెనీ బడా బ్రాండ్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి.
నంబర్ 2
ఇండియాలో మొబైల్ సేల్స్‌కి సంబంధించి మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ అక్టోబరు గణాంకాలను విడుదల చేసింది. ఇందులో 18 శాతం మార్కెట్ వాటాతో రియల్‌మీ శామ్‌సంగ్‌ని వెనక్కి నెట్టి ఇండియాలో అత్యధిక మార్కెట్ కలిగిన కంపెనీగా రికార్డు సృష్టించింది. శామ్‌సంగ్ నుంచి కొత్త మోడళ్ల రాక తగ్గిపోవడంతో కేవలం 16 శాతం మార్కెట్‌కే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది.
షావోమి వెంటే
గత కొన్నేళ్లుగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. షావోమి మార్కెట్‌కి గండి కొట్టేందుకు శామ్‌సంగ్, రియల్‌మీ, ఒప్పో, వివోలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా అక్టోబరులో కూడా 20 శాతం మార్కెట్ వాటాతో షావోమినే నంబర్ వన్‌గా నిలిచింది. అయితే ఈ నంబర్ వన్ స్థానం కాపాడుకునేందుకు షావోమి సబ్సిడరీ కంపెనీ పోకో మోడల్స్ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఏ క్షణమైనా షావోమి ఆధిపత్యాని చెక్ పెట్టేందుకు రియల్‌మీ రెడీగా ఉంది. ఇక 13 శాతం మార్కెట్ వాటాతో వివో నాలుగో స్థానంలో ఉంది.
అన్నింటినీ తోసిరాజని
క్వార్టర్ 3 అమ్మకాలను అక్టోబరు అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు.. టాప్ 4లో ఉన్న మిగిలిన మూడు కంపెనీల అమ్మకాలు తగ్గుముఖం పట్టగా కేవలం రియల్ మీ బ్రాండ్ మాత్రమే మార్కెట్ వాటాను పెంచుకుంది. షావోమీ 23 నుంచి 20 శాతానికి , శామ్‌సంగ్ 17 నుంచి 16 శాతానికి, వివో 15 నుంచి 13 శాతానికి మార్కెట్ వాటా పడిపోగా కేవలం రియల్‌మీ బ్రాండ్ ఒక్కటే మార్కెట్ వాటాను 15 నుంచి 18 శాతానికి పెంచుకోగలిగింది. వచ్చే ఏడాదిలో ఇండియాలో నంబర్ వన్ బ్రాండ్‌గా ఎదగడమే తమ తదుపరి లక్ష్యమని రియల్‌మీ ప్రతినిధులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment