చిన్న షేర్లు విలవిల
ఇటీవల నెమ్మదించిన చిన్న, మధ్యతరహా షేర్లలో బుధవారం ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7% పతనంకాగా, స్మాల్ క్యాప్ మరింత అధికంగా 2.5% జారింది. వెరసి ట్రేడైన షేర్లలో ఏకంగా 2049 నష్టపోగా, కేవలం 871 బలపడ్డాయి. మరోవైపు రోజంతా లాభనష్టాల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 25,919 వద్ద ముగియగా, 13 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 7,740 వద్ద స్థిరపడింది. ఇది 2 వారాల గరిష్టం. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ రంగం 2.2% పుంజుకోవడం మార్కెట్లకు అండగా నిలిచింది. దిగ్గజాలు ఐటీసీ, హెచ్‌యూఎల్ 2.5% స్థాయిలో జంప్‌చేయగా, హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా 2% లాభపడటం ద్వారా మద్దతు అందించాయి.
బ్లూచిప్స్ డీలా, రియల్టీ బోర్లా
సెన్సెక్స్ దిగ్గజాలలో బీహెచ్‌ఈఎల్ 6.5% పతనమైంది. క్యూ1 ఫలితాలు నిరుత్సాహపరచడం ఇందుకు కారణమైంది. ఈ బాటలో కోల్ ఇండియా, హిందాల్కో, టాటా పవర్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ 3-2% మధ్య నీరసించాయి. ఇక మరోవైపు అమ్మకాలు పెరగడంతో రియల్టీ ఇండెక్స్ సైతం 5%పైగా తిరోగమించింది. యూనిటెక్ 17% కుప్పకూలగా, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, డీబీ, డీఎల్‌ఎఫ్ 8-4% మధ్య దిగజారాయి.