రెండో రోజూ నష్టాలే
వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు నీరసించాయి. సెన్సెక్స్ 76 పాయింట్లు క్షీణించి 25,589 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 23 పాయింట్ల నష్టంతో 7,649 వద్ద నిలిచింది. ప్రధానంగా ఐటీ రంగం 1%పైగా క్షీణించడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ప్రకటించిన నిరుత్సాహకర గైడె న్స్ ఐటీ షేర్లలో అమ్మకాలకు కారణమైంది.
ప్రధానంగా ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ 1.5% స్థాయిలో నష్టపోయాయి. ఇతర సెన్సెక్స్ దిగ్గజాలలో హిందాల్కో, సెసాస్టెరిలైట్, టాటా మోటార్స్ 1%పైగా క్షీణించగా, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, కోల్ ఇండియా, ఎస్‌బీఐ 0.5% స్థాయిలో లాభపడ్డాయి. యూరప్ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, ఉక్రెయిన్ సంక్షోభ భయాలు వంటి అంతర్జాతీయ అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.
రైల్ షేర్ల జోరు: మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధంగా రైల్ షేర్లు లాభాలతో పరుగుతీశాయి. రైల్వే సంబంధ మౌలిక సదుపాయాల విభాగంలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో కెర్నెక్స్ మైక్రో, కాళిందీ రైల్, స్టోన్ ఇండియా, టెక్స్‌మాకో రైల్ 5% చొప్పున పుంజుకున్నాయి. హైస్పీడ్ రైళ్లు, సబర్బన్ కారిడార్లు, రవాణా లైన్లు వంటి అంశాలలో 100% విదేశీ పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం ప్రభావం చూపింది. దీంతో రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ప్రాజెక్ట్‌లకు జోష్ లభించనుంది.
సిండికేట్ బ్యాంక్ లంచం కేసు నేపథ్యంలో భూషణ్ స్టీల్ షేరు మరో 20% పతనమైంది. వెరసి మూడు రోజుల్లో 43% దిగజారింది. ఈ నెల 5న రూ. 381 వద్ద ఉన్న షేరు గురువారం రూ. 244 వద్ద ముగిసింది.