నెల రోజుల్లో గరిష్ట నష్టాలు
ఇటీవల వరుస లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు మళ్లీ నీరసించాయి. గత నెల రోజుల్లోలేని విధంగా సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయింది. 27,057 వద్ద ముగిసింది. ప్రధానంగా ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1.5% చొప్పున తిరోగమించాయి. వెరసి నిఫ్టీ సైతం 59 పాయింట్లు క్షీణించి 8,094 వద్ద నిలిచింది. అంచనాలకంటే ముందుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చునన్న ఆందోళనలు సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు.
వచ్చే వారం జరగనున్న ఫెడ్ సమావేశంపై మారెట్లు దృష్టిపెట్టాయని చెప్పారు. దీనికితోడు ఇటీవల సరికొత్త రికార్డులతో దూసుకెళుతున్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 61 స్థాయికి బలహీనపడటం కూడా అమ్మకాలకు కారణమైనట్లు తెలిపారు.
దిగ్గజాలకు నష్టాలు: సెన్సెక్స్ దిగ్గజాలలో హీరో మోటో, ఐటీసీ, ఇన్ఫీ, కోల్ ఇండియా, రిలయన్స్, హెచ్‌డీఎఫ్ సీ, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, భెల్, టీసీఎస్ 2.5-1% మధ్య నష్టపోయాయి. అయితే మరోపక్క సెసాస్టెరిలైట్, టాటా పవర్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.5% చొప్పు న లాభపడ్డాయి.కాగా, ట్రేడైన షేర్లలో అత్యధికం లాభపడటం విశేషం. 1,741 షేర్లు లా భాలతో పుంజుకోగా, 1,272 నష్టపోయాయి.