మూడు రోజుల నష్టాలకు చెక్
అంతర్జాతీయ ఆందోళనలు కొంతమేర చల్లబడటంతో అమెరికాసహా ఆసియా, యూరప్ మార్కెట్లు కోలుకున్నాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంట్ మెరుగుపడింది. వెరసి మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ సెన్సెక్స్ 190 పాయింట్లు పుంజుకుంది. 25,519 వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో 579 పాయింట్లు కోల్పోయిన విషయం విదితమే. నిఫ్టీ కూడా 57 పాయింట్లు ఎగసి 7,626 వద్ద నిలిచింది.
ఆర్‌ఈఐటీ, ఇన్విట్‌లకు సెబీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రియల్టీ షేర్లు వెలుగులో నిలవగా ఆటో రంగం అత్యధికంగా 2.7% జంప్‌చేసింది. ప్రధానంగా ఎంఅండ్ ఎం 6.5% దూసుకెళ్లగా, టాటా మోటార్స్ 3.3%, మారుతీ 1.8% చొప్పున ఎగశాయి. వర్షాలు విస్తరిస్తుండటంతో ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకుంటాయన్న అంచనాలు ఎంఅండ్‌ఎం షేరుకి డిమాండ్ పెంచినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక రియల్టీ షేర్లు అనంత్‌రాజ్, డీఎల్‌ఎఫ్, హెచ్‌డీఐఎల్ 3-2% మధ్య లాభపడ్డాయి.