రేసు గుర్రం..!
సెన్సెక్స్ 358 పాయింట్ల ర్యాలీ...
6,800 స్థాయికి నిఫ్టీ; 101 పాయింట్లు జంప్
బ్యాంకింగ్, మెటల్స్ షేర్ల పరుగు...
భారత్ వృద్ధి మెరుగుపడవచ్చన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో బుధవారం స్టాక్ సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. కొత్త రికార్డులను తిరగరాసాయి. బ్యాంకింగ్, ఫార్మా, మెటల్స్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 22,740 పాయింట్ల నూతన గరిష్టస్థాయికి పరుగులు పెట్టింది. చివరకు 359 పాయింట్లు లాభపడి 22,702 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,800 పాయింట్ల శిఖరాన్ని అందుకుని, చివరకు 101 పాయింట్ల భారీ లాభంతో 6,796 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
భారత్ వృద్ధి రేటు 2014లో 5.4 శాతానికి పెరుగుతుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనాలు ప్రకటించిన మరుసటిరోజే సూచీలు పెద్ద ర్యాలీ నిర్వహించడం విశేషం. మార్చి 7 తర్వాత సెన్సెక్స్ ఇంత భారీ లాభాన్ని ఆర్జించడం ఇదే ప్రథమం. జీడీపీ వృద్ధి మెరుగుపడవచ్చన్న అంచనాలు, రూపాయి బలపడటం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంవంటి అంశాలతో వచ్చే రెండు నెలల్లో మార్కెట్ జోరుగా ర్యాలీ సాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
3.5 శాతం పెరిగిన బ్యాంకెక్స్: ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంగా పరిగణించే బ్యాంకింగ్ షేర్లు పరుగులు తీయడంతో బీఎస్‌ఈ బ్యాంకెక్స్ 3.45 శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేశాతం ర్యాలీ జరిపింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు 3.5-5 శాతం మధ్య పెరిగాయి. మిడ్‌సైజ్ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు 3.5-7.5 శాతం మధ్య ఎగిశాయి. సెన్సెక్స్‌లో భాగంగా వున్న 30 షేర్లలో 26 షేర్లు లాభాలతో ముగియగా, అన్నింటికంటే అధికంగా సన్‌ఫార్మా 6.6 శాతం పెరిగింది. ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్‌ను టేకోవర్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సన్‌ఫార్మాను బ్రోకింగ్ కంపెనీలు అప్‌గ్రేడ్ చేయడంతో ఈ ర్యాలీ సాధ్యపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో. లార్సెన్ అండ్ టూబ్రోలు సైతం 1.5-4 శాతం మధ్య ఎగిశాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాలు 1-3% మధ్య క్షీణించాయి.
నిఫ్టీ ఫ్యూచర్స్‌లో లాంగ్ బిల్డప్..
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 6,750 అవరోధస్థాయిని అధిగమించడంతో నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డేటా సూచిస్తున్నది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 46 పాయింట్లకు పెరగడంతో పాటు ఈ నెల ఫ్యూచర్లో ఒక్కసారిగా 15 లక్షల షేర్లు (9 శాతం) యాడ్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.82 కోట్ల షేర్లకు చేరింది. 6,800 స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో స్వల్పంగా లాంగ్ బిల్డప్ జరగ్గా, 6,900 కాల్ ఆప్షన్లో షార్ట్ కవరింగ్ ఫలితంగా ఓఐ నుంచి 3.68 లక్షల షేర్లు కట్ అయ్యాయి.
ఈ రెండు కాల్ ఆప్షన్లలోనూ మొత్తం ఓఐ 40 లక్షల షేర్లలోపునే వుంది. 6,700 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ కారణంగా ఆ ఆప్షన్లో 13 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ మొత్తం ఓఐ 61.73 లక్షల షేర్లకు పెరిగింది. ఇంతభారీ ఓఐ మరే పుట్ ఆప్షన్లోనూ లేదు. సమీప భవిష్యత్తులో నిఫ్టీకి ఈ స్థాయి మద్దతు నివ్వవచ్చని, ఈ స్థాయిపై స్థిరపడితే కొద్దిరోజుల్లో 6,900 స్థాయిని దాటవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. 6,700 మద్దతుస్థాయిని కోల్పోతే క్రమేపీ మార్కెట్ బలహీనపడవచ్చన్నది ఈ డేటా సారాంశం.