Ranbaxy Laboratories
-
సన్-ర్యాన్‌బాక్సీ డీల్‌పై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీని చేజిక్కించుకోవడం కోసం సన్ ఫార్మా కుదుర్చుకున్న మెగా ఒప్పందంపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దృష్టిసారిస్తోంది. ఈ డీల్ ప్రకటనకు ముందు ర్యాన్‌బాక్సీ షేర్ల ట్రేడింగ్‌లో తీవ్ర అవకతవకలు చేటుచేసుకున్నాయని.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ అనేక ఫిర్యాదులు సెబీకి అందడమే దీనికి కారణం. సుమారు 400 కోట్ల డాలర్ల(80 కోట్ల డాలర్ల రుణంతో కలిపి)కు ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేస్తున్నట్లు సన్ ఫార్మా ఈ నెల 7న ప్రకటించడం తెలిసిందే. పూర్తిగా షేర్ల కేటాయింపు రూపంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, గత వారంలో ర్యాన్‌బాక్సీ షేర్లలో అనూహ్య కదలికలు నమోదయ్యాయి. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 మధ్య ర్యాన్‌బాక్సీ షేరు ధర బీఎస్ఈలో 26 శాతం ఎగబాకడం విశేషం. బుధవారం 4.9 శాతం ఎగసిన ఈ షేరు రూ.467 వద్ద ముగిసింది. డీల్ ప్రకటనకు ముందు ర్యాన్‌బాక్సీ షేరు కదలికలను గమనిస్తే.. ఇంట్రీడేలో భారీ పరిమాణంలో ట్రేడింగ్ జరిగినట్లు అవగతమవుతోందని.. ముందుగానే ఒప్పందం లీకయిఉండొచ్చన్న అనుమానాలను ఫిరాదుదారులు వ్యక్తం చేశారు. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ సంస్థల నుంచి సెబీ ట్రేడింగ్ డేటాను సేకరించడం ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సెబీకి ఫిర్యాదు చేసిన వారిలో స్టాక్ బ్రోకర్లతోపాటు ఇన్వెస్టర్ అసోసియేషన్లు, ఫండ్ సంస్థలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ర్యాన్‌బాక్సీ-సన్ డీల్ గురించి ఎక్స్ఛేంజీలకు ఆదివారం అర్ధరాత్రే సమాచారం అందిఉండొచ్చని, అధికారిక ప్రకటనకు ముందే సమాచారాన్ని అందుకున్న అనుమానిత సంస్థలపై సెబీ దృష్టిసారిస్తున్నట్లు కూడా ఆయా వర్గాలు చెబతున్నాయి. ఇన్సైడర్ ఆరోపణలు అవాస్తవం: సన్ ఫార్మా ర్యాన్‌బాక్సీతో డీల్ విషయంలో తమ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ సిల్వర్‌స్ట్రీట్ డెవలపర్స్ ఎల్‌ఎల్‌పీపై వచ్చిన ఇన్సైడర్ ఆరోపణలను సన్ ఫార్మా ఖండించింది. సిల్వర్‌స్ట్రీట్ డెవలపర్స్‌కు గతేడాది సెప్టెంబర్ నాటికి ర్యాన్‌బాక్సీలో ఎలాంటి వాటా లేదు. అయితే, డిసెంబర్ చివరికల్లా 1.41 శాతం వాటాను ఈ సంస్థ కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31నాటికి ఈ వాటా 1.64 శాతానికి పెరిగింది. అయితే, ర్యాన్‌బాక్సీలో సిల్వర్‌స్ట్రీట్ షేర్ల కొనుగోలు అంశం ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన కిందికి రాదని సన్ ఫార్మా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ బావమరిదైన సుధీర్ వి. వాలియా... సిల్వర్‌స్ట్రీట్ భాగస్వాముల్లో ఒకరంటూ వార్తల్లోకి రావడం విశేషం. దీన్ని కూడా సన్ ఫార్మా ఖండించింది. సన్ ఫార్మా షేరు ధర బుధవారం బీఎస్ఈలో 6.91 శాతం లాభపడి రూ.628 వద్ద ముగిసింది. ర్యాన్బాక్సీపై కొనసాగుతున్న ఈయూ ఆంక్షలు ర్యాన్‌బాక్సీకి చెందిన తోన్సా, దేవాస్ ప్లాంట్ల నుంచి ఔషధ ఉత్పత్తులను యూరప్‌కు ఎగమతి చేయకుండా విధించిన సస్పెన్షన్ కొనసాగుతుందని యూరోపియన్ నియంత్రణ సంస్థ ఈఎంఏ పేర్కొంది. ఈ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించిదన్న ఆరోపణలతో ఈఎంఏ ఆంక్షలు విధించింది. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, దేవాస్ ప్లాంట్‌లో అంతర్జాతీయ తనిఖీలు ఈ ఏడాది జూన్‌లో జరగనున్నట్లు ఈఎంఏ ప్రతినిధి వెల్లడించారు. కాగా, తోన్సా ప్లాంట్‌కు సంబంధించి తయారీ ప్రమాణాలపై ఇచ్చిన ధ్రువీకరణను భారతీయ అధికారులు వెనక్కితీసుకున్నట్లు కూడా చెప్పారు.అమెరికా నియంత్రణ సంస్థ యూఎస్ ఎఫ్‌డీఏ కూడా భారత్‌లో ర్యాన్‌బాక్సీకి చెందిన మొత్తం నాలుగు ప్లాంట్‌లో నాణ్యాతా ప్రమాణాలను పాటించడం లేదంటూ తమ దేశానికి జరిగే ఎగుమతులను నిషేధించడం తెలిసిందే. -
రేసు గుర్రం..!
సెన్సెక్స్ 358 పాయింట్ల ర్యాలీ... 6,800 స్థాయికి నిఫ్టీ; 101 పాయింట్లు జంప్ బ్యాంకింగ్, మెటల్స్ షేర్ల పరుగు... భారత్ వృద్ధి మెరుగుపడవచ్చన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో బుధవారం స్టాక్ సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. కొత్త రికార్డులను తిరగరాసాయి. బ్యాంకింగ్, ఫార్మా, మెటల్స్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 22,740 పాయింట్ల నూతన గరిష్టస్థాయికి పరుగులు పెట్టింది. చివరకు 359 పాయింట్లు లాభపడి 22,702 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,800 పాయింట్ల శిఖరాన్ని అందుకుని, చివరకు 101 పాయింట్ల భారీ లాభంతో 6,796 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. భారత్ వృద్ధి రేటు 2014లో 5.4 శాతానికి పెరుగుతుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనాలు ప్రకటించిన మరుసటిరోజే సూచీలు పెద్ద ర్యాలీ నిర్వహించడం విశేషం. మార్చి 7 తర్వాత సెన్సెక్స్ ఇంత భారీ లాభాన్ని ఆర్జించడం ఇదే ప్రథమం. జీడీపీ వృద్ధి మెరుగుపడవచ్చన్న అంచనాలు, రూపాయి బలపడటం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంవంటి అంశాలతో వచ్చే రెండు నెలల్లో మార్కెట్ జోరుగా ర్యాలీ సాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 3.5 శాతం పెరిగిన బ్యాంకెక్స్: ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంగా పరిగణించే బ్యాంకింగ్ షేర్లు పరుగులు తీయడంతో బీఎస్ఈ బ్యాంకెక్స్ 3.45 శాతం పెరిగింది. ఎన్ఎస్ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేశాతం ర్యాలీ జరిపింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు 3.5-5 శాతం మధ్య పెరిగాయి. మిడ్‌సైజ్ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 3.5-7.5 శాతం మధ్య ఎగిశాయి. సెన్సెక్స్‌లో భాగంగా వున్న 30 షేర్లలో 26 షేర్లు లాభాలతో ముగియగా, అన్నింటికంటే అధికంగా సన్‌ఫార్మా 6.6 శాతం పెరిగింది. ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్‌ను టేకోవర్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సన్‌ఫార్మాను బ్రోకింగ్ కంపెనీలు అప్‌గ్రేడ్ చేయడంతో ఈ ర్యాలీ సాధ్యపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో. లార్సెన్ అండ్ టూబ్రోలు సైతం 1.5-4 శాతం మధ్య ఎగిశాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాలు 1-3% మధ్య క్షీణించాయి. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో లాంగ్ బిల్డప్.. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 6,750 అవరోధస్థాయిని అధిగమించడంతో నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డేటా సూచిస్తున్నది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 46 పాయింట్లకు పెరగడంతో పాటు ఈ నెల ఫ్యూచర్లో ఒక్కసారిగా 15 లక్షల షేర్లు (9 శాతం) యాడ్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.82 కోట్ల షేర్లకు చేరింది. 6,800 స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో స్వల్పంగా లాంగ్ బిల్డప్ జరగ్గా, 6,900 కాల్ ఆప్షన్లో షార్ట్ కవరింగ్ ఫలితంగా ఓఐ నుంచి 3.68 లక్షల షేర్లు కట్ అయ్యాయి. ఈ రెండు కాల్ ఆప్షన్లలోనూ మొత్తం ఓఐ 40 లక్షల షేర్లలోపునే వుంది. 6,700 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ కారణంగా ఆ ఆప్షన్లో 13 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ మొత్తం ఓఐ 61.73 లక్షల షేర్లకు పెరిగింది. ఇంతభారీ ఓఐ మరే పుట్ ఆప్షన్లోనూ లేదు. సమీప భవిష్యత్తులో నిఫ్టీకి ఈ స్థాయి మద్దతు నివ్వవచ్చని, ఈ స్థాయిపై స్థిరపడితే కొద్దిరోజుల్లో 6,900 స్థాయిని దాటవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. 6,700 మద్దతుస్థాయిని కోల్పోతే క్రమేపీ మార్కెట్ బలహీనపడవచ్చన్నది ఈ డేటా సారాంశం. -
కేంద్రం, రాన్‌బాక్సీలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: కలుషిత ఔషధాలను సరఫరా చేస్తున్న రాన్‌బాక్సీ లాబొరేటరీస్ లెసైన్సును రద్దుచేసి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజం (పిల్) మేరకు కంపెనీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. అయితే, ఔషధాలను తయారు చేయకుండా రాన్‌బాక్సీకి తాత్కాలిక ఉత్తర్వులివ్వాలన్న విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ పి.సదాశివం సారథ్యంలోని బెంచ్ శుక్రవారం తోసిపుచ్చింది. ఎంఎల్ శర్మ అనే అడ్వొకేట్ ఈ పిల్ దాఖలు చేశారు. కలుషిత ఔషధాలు తయారుచేసి, విక్రయిస్తున్నందుకు రాన్‌బాక్సీపై 50 కోట్ల డాలర్ల జరిమానాను అమెరికా ఆహార, ఔషధ సంస్థ (యుఎస్ఎఫ్డీఏ) విధించిందని పిటిషనర్ తెలిపారు. అమెరికాలో కలుషిత ఔషధాలు సరఫరా చేశామంటూ రాన్‌బాక్సీ తప్పు ఒప్పుకున్నప్పటికీ, కంపెనీపై భారీ మొత్తంలో జరిమానా విధించినప్పటికీ భారత్‌లో ఆ కంపెనీ ఉత్పత్తుల నిషేధానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య లూ చేపట్టలేదని పేర్కొన్నారు. కాగా దేశీయ మార్కె ట్లో తాము విక్రయిస్తున్న ఔషధాలన్నీ సురక్షితమైనవి, ప్రభావవంతమైనవేనని రాన్‌బాక్సీ స్పష్టం చేసింది. -
నష్టాలు తగ్గించుకున్న ర్యాన్‌బాక్సీ
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ డిసెంబర్ క్వార్టర్లో రూ. 159 కోట్ల నికర న ష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో నమోదైన రూ. 492.4 కోట్లతో పోలిస్తే నష్టాలు బాగా తగ్గాయి. మొటిమల తరహా చర్మవ్యాధి చికిత్సకు వినియోగించే అబ్సారికా అక్నే ఔషధ విక్రయాలు ఊపందుకోవడం ప్రధానంగా ఇందుకు దోహదపడినట్లు కంపెనీ తెలిపింది. ఇండియా, తూర్పు యూరోప్, అమెరికా వంటి కీలక మార్కెట్లలో బిజినెస్‌ను పటిష్టపరచుకోవడంతో లాభదాయకత మెరుగుపడినట్లు కంపెనీ సీఈవో అరుణ్ సాహ్నీ పేర్కొన్నారు. తోన్సా ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాలపై యూఎస్ఎఫ్డీఏ నిషేధం నేపథ్యంలో సంబంధిత నష్టాలకు రూ. 257 కోట్లమేర కేటాయింపులు జరిపినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఆదాయం దాదాపు 7% పుంజుకుని రూ. 2,894 కోట్లకు చేరింది. కాగా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్-మార్చి కాలానికి మార్పుచేసేందుకు వీలుగా ప్రస్తుత ఏడాది ఫలితాలను 15 నెలల కాలానికి పొడిగించినట్లు వివరించింది. ఫలితాల నేపథ్యంలో ర్యాన్‌బాక్సీ షేరు బీఎస్ఈలో దాదాపు 6% జంప్ చేసి రూ. 340 వద్ద ముగిసింది. -
ఫార్మాలో 100% ఎఫ్‌డీఐల కొనసాగింపు
న్యూఢిల్లీ: ఇప్పుడున్న ఫార్మా కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బహళజాతి ఫార్మా దిగ్గజాలు దేశీ కంపెనీలను చేజిక్కించుకోవడం వల్ల చౌక ధరల ఔషధాలు లేకుండా పోతాయన్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మా ఎఫ్‌డీఐలపై సమీక్ష అనంతరం ప్రస్తుత పాలసీనే యథాతథంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ‘నాన్-కాంపీట్’ అంశాన్ని మాత్రం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అమోదంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అనుమతించకూడదనే నిబంధనను విధించినట్లు డీఐపీపీ తెలిపింది. ఫార్మా ఎంఎన్‌సీలు దేశీ కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచుతుండటంతో ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేయాలని తొలుత డీఐపీపీ ప్రతిపాదించింది. ఇలా కొనుగోలు చేయడం వల్ల దేశంలో చౌక జనరిక్ ఔషధాల లభ్యతకు తీవ్ర ముప్పువాటిల్లుతోందని కూడా ఆందోళన వ్యక్తంచేసింది. క్లిష్టతరమైన, అరుదైన ఫార్మా విభాగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతం నుంచి 49 శాతానికి తగ్గించాలని సూచించింది. అయితే, కేంద్ర కేబినెట్ మాత్రం డీఐపీపీ ఆందోళనలను తోసిపుచ్చడం గమనార్హం. అమెరికా ఫార్మా దిగ్గజం మైలాన్.. బెంగళూరుకు చెందిన ఏజిలా స్పెషాలిటీస్(స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్స్ అనుబంధ కంపెనీ)ను చేజిక్కించుకున్న డీల్‌కు గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందం విలువ రూ.5,168 కోట్లు. అదే విధంగా 2008లో జపాన్ సంస్థ దైచీ శాంక్యో కంపెనీ.. భారత్‌లో నంబర్‌వన్ ఫార్మా కంపెనీ ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేయడం విదితమే. ఈ డీల్ విలువ 4.6 బిలియన్ డాలర్లు. ఇక పిరమల్ హెల్త్‌కేర్‌ను అమెరికా సంస్థ అబాట్ 3.7 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. కాగా, కొత్త ఫార్మా ప్రాజెక్టుల ఏర్పాటులో భారత్ 100 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ ఆమోదం రూట్లో అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. -
ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 454 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీమారకద్రవ్య నష్టాల కారణంగా ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో రూ. 454 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆంక్షలతో మొహాలీ ప్లాంటు ఉత్పత్తిని ఖాతాల నుంచి తొలగించాల్సి రావడం కూడా దీనికి కారణమైంది. గతేడాది ఇదే వ్యవధిలో ర్యాన్‌బాక్సీ రూ. 754 కోట్ల లాభం ఆర్జించింది. తాజాగా అకౌంటింగ్ ప్రమాణాలను మార్చాల్సి రావడంతో తాజా క్వార్టర్లో నష్టాల పరిమాణం పెరిగినట్లయిందని సంస్థ పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 360 కోట్ల మేర ఫారెక్స్ నష్టాలు వచ్చినట్లు వివరించింది. మరోవైపు ఆదాయం మాత్రం రూ. 2,669 కోట్ల నుంచి రూ. 2,750 కోట్లకు పెరిగింది. దేశీయంగా ఔషధ ధరల నియంత్రణ వల్ల అమ్మకాలపై కొంత ప్రభావం పడినట్లు కంపెనీ పేర్కొంది. ఔషధాల నాణ్యత విషయంలో అత్యుత్తమ ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని ర్యాన్‌బాక్సీ సీఈవో అరుణ్ సాహ్ని తెలిపారు. ఆసియా, తూర్పు యూరప్, ఆఫ్రికా దేశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం కొనసాగుతుందన్నారు. కంపెనీ ఆర్థిక సంవత్సర వ్యవధిని జనవరి-డిసెంబర్ కాకుండా, ఏప్రిల్-మార్చ్‌కి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మారుస్తున్నట్లు ర్యాన్‌బాక్సీ తెలిపింది. దీంతో, ఈసారి ఆర్థిక సంవత్సరం 15 నెలల కాలంగా (2013 జనవరి నుంచి 2014 మార్చ్ దాకా) ఉంటుందని పేర్కొంది. -
మందుబిళ్లల్లో ‘వెంట్రుకలు’.. నూనె అవశేషాలు
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ ఔషధాల తయారీలో నాణ్యతా ప్రమాణాలపరంగా(సీజీఎంపీ) అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తన పరిశీలనలో గుర్తించింది. మొహాలీ ప్లాంటులో తయారైన మందుబిళ్లల్లో వెంట్రుకల్లాంటి నల్లటి ఫైబర్ పదార్థాలు, యంత్రాల్లో నుంచి నూనె కారిపడినట్లుగా నల్లని మచ్చలు మొదలైనవి ఉన్నట్లు కనుగొంది. అలాగే, టాయ్లెట్లలో పరిశుభ్రత లోపించినట్లు, కనీసం సరైన నీటి సదుపాయం కూడా లే నట్లు గుర్తించింది. 2011, 2012లో ప్లాంటు తనిఖీకి సంబంధించి ర్యాన్‌బాక్సీకి పంపిన పత్రాల్లో ఎఫ్‌డీఏ ఈ అంశాలతో పాటు మొత్తం 11 ఉల్లంఘనలను ప్రస్తావించింది. 2012 ఆగస్టులో నిర్వహించిన తనిఖీ సందర్భంగా ఒక ట్యాబ్లెట్లో సన్నని, నల్లటి పదార్థం కనిపించడాన్ని ఈ సందర్భంగా ఉటంకించింది. ఇది యంత్రం నుంచి జారిన టేప్ అవశేషమైనా కావొచ్చని, లేదా మెషీన్‌ని లోడింగ్ చేస్తున్నప్పుడు ఉద్యోగి చేతి వెంట్రుకైనా పడి ఉండొచ్చని పేర్కొంది. దీని గురించి చెప్పినప్పటికీ సంస్థ దీనికి కారణాలు కనుగొనడంపై దృష్టి పెట్టలేదని ఎఫ్‌డీఏ పేర్కొంది. ముడి సరుకును నిల్వ చేసే ప్రదేశానికి ఆనుకుని ఉన్న టాయ్లెట్లో నీటి సదుపాయం లేదని తెలిపింది. నాణ్యతాప్రమాణాలు లోపించిన కారణంగా మొహాలీ ప్లాంటు నుంచి ఔషధాల దిగుమతిని ఎఫ్‌డీఏ నిషేధించడం తెలిసిందే. ఇప్పటికే, హిమాచల్ ప్రదేశ్‌లోని పౌంతా సాహిబ్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్లాంట్లలో ఉల్లంఘనలపై ఎఫ్‌డీఏ చర్యలు తీసుకుంది. -
ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 524 కోట్లు
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ రూ. 524 కోట్ల నికర నష్టాన్ని ప్రక టించింది. ఇందుకు రూపాయి విలువ క్షీణించడంతో విదేశీ కరెన్సీ రుణాలు భారంకావడం, ఫ్రాన్స్ కార్యకలాల గుడ్‌విల్ నష్టాలు ప్రభావం చూపాయి. గతేడాది ఇదే కాలంలో అంటే ఏప్రిల్-జూన్’12లో సైతం రూ. 586 కోట్ల నష్టాలను నమోదు చేసుకుంది. నిజానికి రూపాయి విలువ క్షీణించడంవల్ల కంపెనీకి ఎగుమతుల ఆదాయం పెరుగుతుంది. అయిదే ఇదే సమయంలో డెరివేటివ్స్‌లో ఏర్పడ్డ మార్క్ టు మార్కెట్(ఎంటూఎం) నష్టాలు, విదేశీ కరెన్సీ రుణాలు భారంకావ డం వంటి అంశాలు దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. క్షీణించిన అమ్మకాలు: ప్రస్తుత సమీక్షా కాలంలో అమ్మకాలు కూడా రూ. 3,205 కోట్ల నుంచి రూ. 2,633 కోట్లకు క్షీణించాయి. యూఎస్ మార్కెట్ల నుంచి ప్రత్యేక హక్కుల ఆదాయం తగ్గడంతో అమ్మకాలు పరిమితమయ్యాయని కంపెనీ సీఈవో అరుణ్ సాహ్నే చెప్పారు.