న్యూఢిల్లీ: విదేశీమారకద్రవ్య నష్టాల కారణంగా ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో రూ. 454 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆంక్షలతో మొహాలీ ప్లాంటు ఉత్పత్తిని ఖాతాల నుంచి తొలగించాల్సి రావడం కూడా దీనికి కారణమైంది. గతేడాది ఇదే వ్యవధిలో ర్యాన్‌బాక్సీ రూ. 754 కోట్ల లాభం ఆర్జించింది. తాజాగా అకౌంటింగ్ ప్రమాణాలను మార్చాల్సి రావడంతో తాజా క్వార్టర్‌లో నష్టాల పరిమాణం పెరిగినట్లయిందని సంస్థ పేర్కొంది.
సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 360 కోట్ల మేర ఫారెక్స్ నష్టాలు వచ్చినట్లు వివరించింది. మరోవైపు ఆదాయం మాత్రం రూ. 2,669 కోట్ల నుంచి రూ. 2,750 కోట్లకు పెరిగింది. దేశీయంగా ఔషధ ధరల నియంత్రణ వల్ల అమ్మకాలపై కొంత ప్రభావం పడినట్లు కంపెనీ పేర్కొంది. ఔషధాల నాణ్యత విషయంలో అత్యుత్తమ ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని ర్యాన్‌బాక్సీ సీఈవో అరుణ్ సాహ్ని తెలిపారు. ఆసియా, తూర్పు యూరప్, ఆఫ్రికా దేశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం కొనసాగుతుందన్నారు. కంపెనీ ఆర్థిక సంవత్సర వ్యవధిని జనవరి-డిసెంబర్ కాకుండా, ఏప్రిల్-మార్చ్‌కి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మారుస్తున్నట్లు ర్యాన్‌బాక్సీ తెలిపింది. దీంతో, ఈసారి ఆర్థిక సంవత్సరం 15 నెలల కాలంగా (2013 జనవరి నుంచి 2014 మార్చ్ దాకా) ఉంటుందని పేర్కొంది.
ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 454 కోట్లు
Published Wed, Oct 30 2013 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
Advertisement