ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు, ఒకప్పుడు బిజినెస్ టైకూన్లుగా వెలుగొందిన సింగ్ బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ అండ్ రెలిగేర్ యజమానులు సింగ్ బ్రదర్స్‌గా చెప్పుకునే మల్విందర్ సింగ్, శివిందర్‌మోహన్ సింగ్ (55) తాజాగా రోడ్డెక్కారు. దీంతో ఇప్పటికే ఒకరిమీద ఒకరు ఆరోపణలు, కేసులతో వార్తల్లో నిలిచిన సోదరులిద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ‘నువ్వు కొట్టావంటే.. నువ్వు కొట్టావంటూ’ ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా సాక్షిగా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక పరమైన వివాదం కొత్త మలుపు తీసుకుంది.
శివిందర్ తనపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడంటూ ఒక వీడియోలో మల్విందర్ ఆరోపించాడు. ఢిల్లీలోని హనుమాన్ రోడ్ కార్యాలయంలో డిసెంబర్ 5 ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నాడు. మరోవైపు శివిందర్.. అన్న మల్విందర్ ఆరోపణలను ఖండించాడు. ఇది అబద్ధమని, నిజానికి తనపైనే మల్విందర్ దాడి చేశాడని పేర్కొనడం గమనార్హం. ప్రియస్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని గురిందర్ సింగ్ ధిల్లానుంచి తనకు రావాల్సిన 2వేల కోట్ల రూపాయలను రికవరీ చేసుకునేందుకు వెళ్లినపుడు మల్విందర్ అడ్డు పడ్డాడని ఆరోపించారు. మరోవైపు అన్నదమ్ముల ఘర్షణను ధృవీకరించిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇద్దరినీ శాంతింపచేసి, పోలీస్ ఫిర్యాదును ఉపసంహరింపజేసినట్టు సమాచారం.
గత దశాబ్దకాలంగా రగులుతున్న వివాదం కారణంగా సింగ్ బ్రదర్స్ బద్ధశత్రువులుగా మారిపోయారు. అంతేకాదు సుమారు 22,500 కోట్ల రూపాయలను నష్ట పోయారు. ఈ నేపథ్యంలో సింగ్ బ్రదర్స్ తల్లి నిమ్మిసింగ్, ఇతర కుటుంబ పెద్దలు వీరి మధ్య వున్న వైరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సోదరులిద్దరూ కేసులను తాత్కాలికంగా ఉపసహరించుకునేందుకు కూడా సమ్మతించారు. కానీ ఇంతలోనే మళ్లీ కథ మొదటికి వచ్చింది. తాజాగా ప్రియస్ రియల్ ఎస్టేట్ బోర్డు మీటింగ్ సందర్భంగా (ఇద్దరూ బోర్డు సభ్యులు కాదు) గురువారం సాయంత్రం వీరిద్దరూ ముష్టిఘాతాలకు దిగారు. ఈ పరిణామంతో తమ ప్రతిష్టను మరింత దిగజార్చుకున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment