Malvinder
-
ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లకు ఆరు నెలల జైలు
న్యూఢిల్లీ: జపాన్ సంస్థ దైచీ సాంక్యోకు ర్యాన్‌బాక్సీ విక్రయ వ్యవహారంలో పలు అంశాలను దాచిపెట్టడం, ఈ కేసు విచారణలో ఉండగా.. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ తమ ఫోర్టిస్ షేర్లను మలేసియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు విక్రయించిన కేసులో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు గురువారం 6 నెలల జైలు శిక్ష విధించింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 26 శాతం వాటా కోసం ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌పై విధించిన స్టే ఎత్తివేసేందుకూ ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. 2018 ఫోర్టిస్–ఐఐహెచ్ ఒప్పందంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే కేసును తిరిగి ఢిల్లీ హైకోర్టుకు విచారణ నిమిత్తం రిమాండ్ చేసింది. దైచి– ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ల మధ్య చట్టపరమైన పోరాటం కారణంగా ఐహెచ్‌హెచ్–ఫోర్టిస్ ఒప్పందం నిలిచిపోయింది. ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ షేర్ డీల్‌ను దైచీ సాంక్యో సవాలు చేసింది. జపనీస్ డ్రగ్ మేకర్ దైచీ 2008లో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ యజమానులైన సింగ్ సోదరుల నుండి ర్యాన్‌బాక్సీ కొనుగోలు చేసింది. అయితే పలు అంశాలు దాచిపెట్టి ఈ ఒప్పందం చేసుకున్నారని దైచీ ఆరోపిస్తూ, సింగ్ సోదరులపై న్యాయపోరాటాన్ని జరిపింది. సింగ్ సోదరులకు వ్యతిరేకంగా సింగపూర్ ట్రిబ్యునల్‌లో రూ.3,600 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు అమలుకు దైచీ న్యాయపోరాటం చేస్తోంది. షేర్ భారీ పతనం..: కాగా, ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు షేర్ అమ్మకాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలన్న సుప్రీం ఆదేశాల అనంతరం ఫోర్టిస్ ఒక ప్రకటన చేస్తూ, దీనిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఫోర్టీస్ హెల్త్‌కేర్ షేర్ 15% పడిపోయి రూ.265.55 వద్ద ముగిసింది. -
చెరో 1,170 కోట్లు కట్టండి!
న్యూఢిల్లీ: దైచీ కేసులో ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మాల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌లు (సింగ్ సోదరులు) కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోని తమ నియంత్రిత షేర్లను మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు విక్రయించడం కోర్టు ధిక్కార అంశంగానే పరిగణించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తప్పును సరిదిద్దుకునే క్రమంలో సింగ్ సోదరులు ఇరువురు రూ.1,170.95 కోట్ల చొప్పున మొత్తం రూ.2,341.90 కోట్లను సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. డిపాజిట్ తర్వాతే కోర్టు ధిక్కారానికి సంబంధించిన శిక్ష విషయంలో ‘కొంత వెసులుబాటు’ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని సుప్రీం స్పష్టం చేసింది. ‘‘కేసుకు సంబంధించి ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సింగ్ సోదరులు తెలిసీ, ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. కనుక వీరు ఇరువురూ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లుగానే ఈ కోర్టు భావిస్తోంది’’ అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మొత్తంమీద తాజా రూలింగ్ ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసు పూర్వాపరాలు... ► సింగ్ సోదరులు 2008లో ర్యాన్‌బాక్సీని జపాన్ సంస్థ దైచీ శాంక్యోకి విక్రయించారు. తర్వాత ఈ కంపెనీని దైచీ నుంచి భారత్‌కే చెందిన సన్‌ఫార్మా 3.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ► అయితే ర్యాన్ బాక్సీ అమ్మకం వ్యవహారానికి సంబంధించి సింగ్ సోదరులపై దైచీ సింగపూర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో పలు రెగ్యులేటరీ సమస్యలను ర్యాన్‌బాక్సీ ఎదుర్కొంటోందని, అయితే విక్రయ ఒప్పందాల సమయంలో ఈ అంశాలను సింగ్ సోదరులు వెల్లడించలేదన్నది దైచీ ఆరోపణల్లో ప్రధానమైనది. ఈ కేసులో 2016లో రూ. 2,562 కోట్ల పరిహారాన్ని (అవార్డు) ట్రిబ్యునల్ నుంచి పొందింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సింగ్ సోదరులు భారత్, సింగ్‌పూర్ కోర్టుల్లో సవాలు చేసినా ఫలితం దక్కలేదు. ఢిల్లీ హైకోర్టులో సింగ్ సోదరులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంతర్జాతీయ ఆర్బిట్రల్ అవార్డును హైకోర్టు సమర్థించింది. ► దీనితో ఆయా అంశాలపై సింగ్ సోదరులు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఇక్కడ కూడా వారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 16న వారి అప్పీల్‌ను సుప్రీం తోసిపుచ్చింది. ఫోర్టిస్‌లో తమకు ఉన్న వాటాలను విక్రయించరాదని సుప్రీంకోర్టు సింగ్ సోదరులను ఆదేశించింది. ► అయితే ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ, ఫోర్టిస్‌లో వాటాలను సింగ్ సోదరు లు మలేషియా సంస్థ– ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌కు అమ్మేశారు. ► ఈ విషయాన్ని దైచీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీనితో గత ఏడాది డిసెంబర్ 14న ఫోర్టిస్–ఐహెచ్‌హెచ్ ఒప్పం దంపై సుప్రీంకోర్టు ‘యథాతథ స్థితి’ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ► మార్చిలో దైచీ సుప్రీంకోర్టులో సింగ్ సోదరులపై కోర్టు ధిక్కరణ కేసును కూడా దాఖలు చేసింది. ► ఫోర్టిస్‌కు వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు ‘ధిక్కరణ’ విచారణను చేపట్టింది. ఫోర్టిస్‌కు సంబంధించి ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఓపెన్ ఆఫర్‌పై ఇచ్చిన స్టేను తొలగించడానికి నిరాకరించింది. ఈ ఓపెన్ ఆఫర్‌పై విచరణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
పోలీసు కస్టడీకి సింగ్ సోదరులు
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ (ఆర్ఎఫ్ఎల్)ను రూ. 2,397 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లయిన మల్వీందర్ సింగ్, ఆయన సోదరుడు శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపిస్తూ ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. ‘ఈ కేసులో పెద్ద ఎత్తున నగదును పక్కదోవ పట్టింది. స్వభావరీత్యా ఈ నేరం చాలా తీవ్రమైనది’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పక్కదోవ పట్టిన నిధుల ఆచూకీ తెలుసుకోవడానికి, ఈ కుట్రలో కీలక పాత్ర పోషించిన వారిని పట్టుకోవడానికి నిందితుల పోలీసు కస్టడీ అవసరమని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ పేర్కొన్నారు. మరోవైపు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ శివీందర్ సింగ్ ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై పోలీసులు, కేంద్రానికి నోటీసులు ఇచ్చే విషయంపై ఉత్తర్వులను కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. -
ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్ అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: రెలిగేర్ మాజీ ప్రమోటర్, ర్యాన్‌బాక్సీ మాజీ ఛైర్మన్, సింగ్ సోదరుల్లో ఒకరైన్ మల్విందర్ మోహన్ సింగ్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే లుక్ అవుట్ నోటీస్ జారీ చేయగా, ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగం అధికారులు లుధియానాలో గురువారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌పై మల్విందర్ను ఢిల్లీకి తరలించనున్నారు. రెలిగేర్ ఫిన్వెస్ట్ (ఆర్ఎఫ్ఎల్)కి చెందిన రూ. 2,397 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్, మల్విందర్ తమ్ముడు, శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రెలిగేర్ ఫిన్‌వెస్ట్‌కు చెందిన మన్‌ప్రీత్ సింగ్ సూరి దాఖలు చేసిన ఫండ్ డైవర్షన్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అరెస్టయిన వారిలో రెలిగేర్(ఆర్ఈఎల్) మాజీ చైర్మన్ సునీల్ గోధ్వానీ (58), ఆర్ఈఎల్, ఆర్‌ఎఫ్‌ఎల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కవి అరోరా, అనిల్ సక్సేనా ఉన్నారు. నిధులను మళ్లించి ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు నిందితులందరినీ ఈ సాయంత్రం ఢిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని ప్రశ్నించడం కోసం అదుపులోకి తీసుకుంటారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ విషయంలో కేసు నమోదు చేసే అవకాశం ఉంది. చదవండి : ఫోర్టిస్ మాజీ ప్రమోటర్ శివీందర్ అరెస్ట్! -
సింగ్ సోదరులను అరెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లయిన మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్ సోదరులిద్దరు నిర్ణీత గడువులోగా రూ. 472 కోట్లు చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో వారి అరెస్టుకు చర్యలు తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఫోర్టిస్ హెల్త్‌కేర్ సంస్థ కోరింది. చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని, అలాగే ఈ విషయంలో వ్యక్తిగతంగా తమ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. సెబీ చట్టంలోని సెక్ష న్ 28ఎ ని ప్రయోగించడం ద్వారా సింగ్ సోదరులతో పాటు ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్, శివి హోల్డింగ్స్, మాలవ్ హోల్డింగ్స్, రెలిగేర్ ఫిన్వెస్ట్, బెస్ట్ హెల్త్‌కేర్, ఫెర్న్ హెల్త్‌కేర్, మోడ్‌ల్యాండ్ వేర్స్ నుంచి నిధులను రికవర్ చేయాలని కోరింది. ‘గతేడాది అక్టోబర్, డిసెంబర్లలో సెబీ ఆదేశాల మేరకు డబ్బు రికవరీ కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం. తొమ్మిది పార్టీలకు నోటీసులు పంపించాం. సింగ్ సోదరుల అవకతవకలపై లూథ్రా అండ్ లూథ్రా లా ఏజెన్సీ నివేదిక ప్రాతిపదికగా డబ్బును రాబట్టుకునేందుకు, వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు నియంత్రణ సంస్థలను ఆశ్రయిస్తున్నాం. ఇప్పటికే సెబీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐస్కు దరఖాస్తు చేసుకోవడంతో పాటు నివేదిక కాపీలు కూడా ఇచ్చాం. ఫెర్న్, మోడ్‌ల్యాండ్, బెస్ట్ సంస్థలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాం‘ అని ఫోర్టిస్ హెల్త్‌కేర్ చైర్మన్ రవి రాజగోపాల్ తెలిపారు. ఫోర్టిస్ నుంచి మోసపూరితంగా నిధులు మళ్లించారని సింగ్ సోదరులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని వడ్డీతో పాటు మూడు నెలల్లోగా తిరిగి చెల్లించాలంటూ సింగ్ సోదరులను అక్టోబర్‌లో సెబీ ఆదేశించింది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం .. సెక్షన్ 28ఎ అంశంపై శివీందర్ సింగ్ స్పందించారు. ఫోర్టిస్ సొంతంగా జరిపిన విచారణ నివేదిక కాపీలు తనకి ఇంత వరకూ అందజేయలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తన వాదన వినిపించే అవకాశాలు లేకుండా సెక్షన్ 28ఎ ని ప్రయోగించడమనేది అసమంజసమని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘2015 సెప్టెంబర్‌లో ఫోర్టిస్లోని అన్ని ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి నేను తప్పుకున్నాను. అప్పట్నుంచీ మిగతా నాన్–ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుల హోదాతోనే ఉన్నాను. వివాదాస్పద లావాదేవీల గురించి మిగతా బోర్డు సభ్యుల్లాగానే నాక్కూడా ఎటువంటి సమాచారం లేదు‘ అని ఒక ప్రకటనలో చెప్పారు. ఈ విషయం ఫోర్టిస్‌కు కూడా తెలుసని, మిగతావారు తీసుకున్న నిర్ణయాలకు తనను బాధ్యుణ్ని చేయడం సరికాదని శివీందర్ సింగ్ చెప్పారు. -
‘ర్యాన్‌బాక్సీ’ సింగ్ బ్రదర్స్ బాహాబాహీ!
న్యూఢిల్లీ: ఒకప్పటి ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ, ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. తాజాగా తమ్ముడు శివీందర్ సింగ్ తనపై దాడి చేశారంటూ అన్న మల్వీందర్ సింగ్ ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ మేరకు ఆరోపణలు చేశారు. డిసెంబర్ 5న శివీందర్ సింగ్ తనపై దాడి చేయడంతో చేతుల మీద గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఆరోపణలను శివీందర్ ఖండించారు. గ్రూప్ కంపెనీ ప్రియస్ రియల్ ఎస్టేట్ బోర్డు మీటింగ్‌లో ఉద్యోగులను మల్వీందర్ సింగ్ వర్గం బెదిరిస్తోందన్న సమాచారంతో తాను అక్కడికి వెళ్లినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పారాయన. ఇదే క్రమంలో మల్వీందర్ సింగ్ తనను బలవంతంగా గోడకు అదిమిపెట్టేయడంతో తప్పించుకునే క్రమంలో ఆయన్ను పక్కకు తోసేసేందుకు మాత్రమే ప్రయత్నించానని చెప్పారు. ఇంత జరిగిన తర్వాత మల్వీందర్‌తో కలిసి పనిచేసే మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని ఆయ న స్పష్టం చేశారు. ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో నిధుల మళ్లిం పు జరిగిందన్న ఆరోపణలు బయటపడినప్పట్నుంచి సింగ్ సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సం గతి తెలిసిందే. మల్వీందర్ సింగ్ ఫోర్జరీ, అవకతవక లకు పాల్పడ్డారని శివీందర్ సింగ్ ఆరోపిస్తున్నారు. -
భగ్గుమన్న విభేదాలు : కొట్టుకున్న బ్రదర్స్
ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు, ఒకప్పుడు బిజినెస్ టైకూన్లుగా వెలుగొందిన సింగ్ బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ అండ్ రెలిగేర్ యజమానులు సింగ్ బ్రదర్స్‌గా చెప్పుకునే మల్విందర్ సింగ్, శివిందర్మోహన్ సింగ్ (55) తాజాగా రోడ్డెక్కారు. దీంతో ఇప్పటికే ఒకరిమీద ఒకరు ఆరోపణలు, కేసులతో వార్తల్లో నిలిచిన సోదరులిద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ‘నువ్వు కొట్టావంటే.. నువ్వు కొట్టావంటూ’ ఒకరి మీద ఒకరు సోషల్ మీడియా సాక్షిగా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఉన్న ఆర్థిక పరమైన వివాదం కొత్త మలుపు తీసుకుంది. శివిందర్ తనపై భౌతికంగా దాడికి పాల్పడ్డాడంటూ ఒక వీడియోలో మల్విందర్ ఆరోపించాడు. ఢిల్లీలోని హనుమాన్ రోడ్ కార్యాలయంలో డిసెంబర్ 5 ఈ సంఘటన జరిగిందని పేర్కొన్నాడు. మరోవైపు శివిందర్.. అన్న మల్విందర్ ఆరోపణలను ఖండించాడు. ఇది అబద్ధమని, నిజానికి తనపైనే మల్విందర్ దాడి చేశాడని పేర్కొనడం గమనార్హం. ప్రియస్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని గురిందర్ సింగ్ ధిల్లానుంచి తనకు రావాల్సిన 2వేల కోట్ల రూపాయలను రికవరీ చేసుకునేందుకు వెళ్లినపుడు మల్విందర్ అడ్డు పడ్డాడని ఆరోపించారు. మరోవైపు అన్నదమ్ముల ఘర్షణను ధృవీకరించిన సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇద్దరినీ శాంతింపచేసి, పోలీస్ ఫిర్యాదును ఉపసంహరింపజేసినట్టు సమాచారం. గత దశాబ్దకాలంగా రగులుతున్న వివాదం కారణంగా సింగ్ బ్రదర్స్ బద్ధశత్రువులుగా మారిపోయారు. అంతేకాదు సుమారు 22,500 కోట్ల రూపాయలను నష్ట పోయారు. ఈ నేపథ్యంలో సింగ్ బ్రదర్స్ తల్లి నిమ్మిసింగ్, ఇతర కుటుంబ పెద్దలు వీరి మధ్య వున్న వైరాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సోదరులిద్దరూ కేసులను తాత్కాలికంగా ఉపసహరించుకునేందుకు కూడా సమ్మతించారు. కానీ ఇంతలోనే మళ్లీ కథ మొదటికి వచ్చింది. తాజాగా ప్రియస్ రియల్ ఎస్టేట్ బోర్డు మీటింగ్ సందర్భంగా (ఇద్దరూ బోర్డు సభ్యులు కాదు) గురువారం సాయంత్రం వీరిద్దరూ ముష్టిఘాతాలకు దిగారు. ఈ పరిణామంతో తమ ప్రతిష్టను మరింత దిగజార్చుకున్నారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
సింగ్ బ్రదర్స్ వివాదం న్యూ ట్విస్ట్
సాక్షి, ముంబై: వ్యాపారాన్ని భారీ నష్టాన్ని కలిగిస్తున్నారంటూ సోదరుడిపై ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసిన శివిందర్ సింగ్ యూ టర్న్ తీసుకున్నారు. సోదరుడు మల్వీందర్ సింగ్‌పై తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. కుటుంబ పెద్దలు, ఇతర సభ్యుల జోక్యంతో తన సోదరుడు మల్వీందర్‌పై దాఖలు చేసిన కేసుని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాడు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) న్యూఢిల్లీ బెంచ్ ముందుకు ఈ కేసు శుక్రవారం విచారణకు రానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అన్నపై కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు శివిందర్ ప్రకటించారు. అంతేకాదు ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వం విఫలమైతే తిరిగి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పించాల్సిందిగా శివిందర్, అతని భార్య అదితి ఎస్.సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. ముఖ్యంగా సింగ్ బ్రదర్స్ తల్లి నిమ్మీ సింగ్ గత కొన్ని రోజులుగా నిద్రాహారాలు మాని, కొడుకులిద్దరితోనూ, వరుసగా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా ఔషధసంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు ఇటీవల భగ్గుమన్నాయి. కుటుంబ వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడు తున్నారంటూ అన్న మల్వీందర్ సింగ్‌పై సోదరుడు శివీందర్ సింగ్ కోర్టుకెళ్లారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రెలిగేర్, ఫోర్టిస్ సంస్థల నిర్వహణలో అవకతవకలు, అణిచివేత ధోరణులపై మల్వీందర్‌తో పాటు రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోద్వానీలపై శివీందర్ సెప్టెంబర్ 4న ఎన్సీఎల్టీలో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
మల్వీందర్, గోధ్వానీకి ఎన్సీఎల్టీ నోటీసులు
న్యూఢిల్లీ: ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్ ఎండీ మల్వీందర్ సింగ్, రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోధ్వానీ తదితరులకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నోటీసులు జారీ చేసింది. కంపెనీ షేర్‌హోల్డింగ్, బోర్డు వ్యవహారాల్లో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్ లావాదేవీల్లో మల్వీందర్ సింగ్ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన సోదరుడు శివీందర్ సింగ్ వేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా ఎన్సీఎల్టీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్ రికార్డులను తనిఖీ చేసేందుకు, అవసరమైన పత్రాల ఫొటోకాపీలు తీసుకునేందుకు శివీందర్ సింగ్, ఆయన భార్య అదితి సింగ్‌తో పాటు మల్వీందర్ సింగ్‌లకు అనుమతులిచ్చింది. పది రోజుల్లోగా తమ సమాధానాలు తెలియజేయాలంటూ మల్వీందర్ సింగ్ తదితరులకు ట్రిబ్యునల్ ఆదేశించింది. అలాగే శివీందర్ సింగ్ కూడా రెండు వారాల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలంటూ సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. కుటుంబ వ్యాపారాల నిర్వహణలో మల్వీందర్ సింగ్ అవకతవకలకు పాల్పడ్డారని, సంస్థలను అప్పుల్లో ముంచేశారని ఆరోపిస్తూ ఆయన తమ్ముడు శివీందర్ సింగ్ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
‘ర్యాన్‌బాక్సీ బ్రదర్స్’ మధ్య విభేదాలు
న్యూఢిల్లీ: ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లయిన సింగ్ సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కుటుంబ వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ అన్న మల్వీందర్ సింగ్‌పై సోదరుడు శివీందర్ సింగ్ కోర్టుకెళ్లారు. ‘ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రెలిగేర్, ఫోర్టిస్ సంస్థల నిర్వహణలో అవకతవకలు, అణిచివేత ధోరణులపై మల్వీందర్‌తో పాటు రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోద్వానీలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసు దాఖలు చేశాను’ అని శివీందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వీరిద్దరూ కలిసి కంపెనీ, షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెలిగేర్‌కి చెందిన ఎన్బీఎఫ్సీ విభాగంలో తీసుకున్న నిర్ణయాలు, ర్యాన్‌బాక్సీని దైచీకి విక్రయించే డీల్ నిర్వహణ, ప్రైవేట్ చార్టర్ లిగేర్ ఏవియేషన్ వ్యాపారంలో అనూహ్య నష్టాలు మొదలైనవన్నీ వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిపోయిందో చెప్పడానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ర్యాన్‌బాక్సీని జపాన్‌కి చెందిన దైచీ సాంక్యోకు విక్రయించిన సింగ్ సోదరులు ప్రస్తుతం ఈ డీల్ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు ఒప్పందం తర్వాత హాస్పిటల్ చెయిన్ ఫోర్టిస్ హెల్త్‌కేర్, ఆర్థిక సేవల సంస్థ రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌పై సోదరులు దృష్టి పెట్టారు. కానీ వీటిల్లోనూ ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు సంస్థలు విచారణ కూడా జరుపుతున్నాయి. పరువు కోసం ఆగాను.. వాస్తవానికి ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సిందని, కానీ పరిస్థితి మెరుగుపడుతుందేమోనన్న ఆశ, కుటుంబ పోరులో తమది కూడా మరో చెత్త అధ్యాయంగా మారకూడదన్న ఉద్దేశంతో ఇంతకాలం ఆగానని శివీందర్ సింగ్ పేర్కొన్నారు. తమ కుటుంబం, తాను వ్యక్తిగతంగా ఎంతో క్షోభకు గురవుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపార ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఇప్పటిదాకా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదని ఆయన చెప్పారు. ‘మా కుటుంబం పరువు ప్రతిష్టలు, సంపద, వ్యక్తిగతంగా నా విశ్వసనీయత అంతా మసకబారుతున్నా.. నేను స్థాపించిన కంపెనీని బహిరంగంగా వేలం వేసే పరిస్థితి వచ్చినా కూడా ప్రేక్షకపాత్రే వహిస్తూ ఉండిపోయాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకత, నైతిక విలువలను నిరంతరం పాతరేస్తున్న పరిస్థితుల్లో మల్వీందర్‌తో ఇక తాను కలిసి పనిచేసే ప్రసక్తే లేదని శివీందర్ చెప్పారు. పరిస్థితులు ఇంతదాకా వచ్చిన నేపథ్యంలో సోదరుడితో వ్యాపార లావాదేవీలన్నీ తెగతెంపులు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2015లో వ్యాపార కార్యకలాపాల నుం చి తప్పుకున్న శివీందర్ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పంజాబ్‌లోని బియాస్లో స్థిరపడ్డారు. మల్వీందర్సింగ్కు జరిమానా కోర్టు ఆదేశాల ధిక్కరణ అభియోగం కింద 3.5 మిలియన్ సింగపూర్ డాలర్లు చెల్లించాలంటూ మల్వీందర్ సింగ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి లేకుండా తమ స్థిరాస్తులు అమ్ముకోరాదంటూ సింగ్ సోదరులను ఆదేశించినప్పటికీ మల్వీందర్ వాటిని ధిక్కరించారని జస్టిస్ రాజీవ్ షక్దర్ పేర్కొన్నారు. రెలిగేర్ హెల్త్‌కేర్‌లో 45 లక్షల షేర్లను 3.5 మిలియన్ సింగపూర్ డాలర్లకు అమ్ముకున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటూ ఆదేశించారు. అయితే, సింగపూర్‌లో కొన్న అపార్ట్మెంట్ ఈఎంఐలు డిఫాల్టు కాకూడదనే ఉద్దేశంతో సదరు నిధులను బ్యాంకు వాయిదాలకు కట్టేందుకు వినియోగించినట్లు మల్వీందర్ సింగ్ తరఫు న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. ర్యాన్‌బాక్సీ డీల్‌కు సంబంధించి రూ. 3,500 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల అమలు కోసం దైచీ సాంక్యో కోర్టును ఆశ్రయించిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది. గురువారం విచారణ... తన భార్య అదితి సింగ్ సంతకాన్ని మల్వీందర్ ఫోర్జరీ చేశారని, అక్రమ ఆర్థిక లావాదేవీలతో పాటు కంపెనీని భారీ రుణాల్లో ముంచేశారని ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్లో శివీందర్ సింగ్ ఆరోపించారు. శివీందర్ తరఫున ఆర్ఆర్జీ అండ్ అసోసియేట్స్ వేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది. అర్హెచ్సీ బోర్డు నుంచి మల్వీందర్‌ను తొలగించాలని, బోర్డును పునర్వ్యవస్థీకరించాలని పిటిషన్లో శివీందర్ కోరా రు. అలాగే, ఫోర్టిస్ హెల్త్‌కేర్, రెలిగేర్‌ల నుంచి చట్టవిరుద్ధంగా తీసుకున్న నిధులను కూడా వాపసు చేసేలా మల్వీందర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్ రికార్డులన్నీ తనిఖీ చేసి, అవసరమైన పత్రాల కాపీలు తీసుకునేందుకు తనకు గానీ లేదా అధీకృత వ్యక్తులకు అనుమతివ్వాలని కోరారు. సింగ్ సోదరుల కుటుంబాలకు చెందిన ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌కి మల్వీందర్ సింగ్ ఎండీగా ఉన్నారు. అంతర్గత వ్యవస్థ పటిష్టం చేయడంపై దృష్టి: ఫోర్టిస్ హెల్త్‌కేర్ వ్యవస్థాగత లోటుపాట్లను ఉపయోగించుకునే మాజీ ప్రమోటర్లు సింగ్ సోదరులు నిధుల అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో తేలడంతో అంతర్గతంగా వివిధ వ్యవస్థలను పటిష్టం చేసుకోవడంపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ దృష్టి పెట్టింది. ఇందుకోసం బైటి ఏజెన్సీని నియమించుకోనున్నట్లు 2017–18 వార్షిక నివేదికలో సంస్థ పేర్కొంది. దర్యాప్తు నివేదికలోని అంశాల ఆధారంగా నిధుల అవకతవకలపై అంతర్గతంగా విచారణ కూడా జరిపే అవకాశం ఉందని వివరించింది. -
సింగ్ బ్రదర్స్ మధ్య ముసలం
న్యూఢిల్లీ: రాన్‌బాక్సీ కుటుంబ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. గత కొన్నినెలలుగా సింగ్‌బ్రదర్స్ మధ్య నెలకొన్న అసంతృప్తి ఇపుడిక కోర్టుకెక్కింది. ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్, సింగ్ బ్రదర్స్‌లో ఒకరైన శివిందర్ సింగ్, సోదరుడు మల్వీందర్‌పై పోరుకు సై అన్నాడు. సోదరుడు, మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్, స్థాపకుడు మల్వీందర్, రెలిగేర్ మాజీ చీఫ్ సునీల్ గోధ్వానీలను తమ వ్యాపార భాగస్వామిగా తప్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఫిర్యాదు నమోదు చేశారు. ఈ మేరకు శివిందర్ మూడు పేజీల ప్రకటనను విడుదల చేశారు. తన అన్నయ్య మల్వీందర్, గోదాని సంయుక్తంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలతో తమ సంస్థల ప్రయోజనాలతోపాటు, వాటాదారుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. చాలాకాలంగా ఈ విషయం వ్యక్తిగతంగా తనను బాధిస్తున్నప్పటికీ కుటుంబగౌరవం, ప్రతిష్ట కోసం మౌన ప్రేక్షకుడిలాగా ఉండిపోయానన్నారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇకనుంచి తాను స్వత్రంత్రంగా వ్యాపారాన్ని కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రిలిగేర్, ఫోర్టిస్ పతనం, అక్రమాల నేపథ్యంలో కేసును దాఖలు చేసినట్టు తెలిపారు. అయితే ఈ పరిణామంపై స్పందించేందుకు మాల్వీందర్ సింగ్ నిరాకరించారు. -
ర్యాన్బాక్సీమాజీ ప్రమోటర్లకు వేలకోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీ , జపాన్ ఔషధ సంస్థ డైచీ శ్యాంకో వివాదంలో ర్యాన్ బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు, సర్దార్ సోదరులకు సింగపూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. మాజీ యజమానులైన మల్వీందర్, శివిందర సింగ్ లకు భారీ జరిమానా విధించింది. ఆర్బిట్రేషన్ ఆఫ్ సింగపూర్ కోర్టు రూ 2,600 కోట్ల జరిమానా విధించింది. జపనీస్ ఔషధ సంస్థ డైచీ శాంక్యో నుంచి నిజాలు దాచి, తప్పడు నివేదికలు అందించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది. 2008లో ఇద్దరు సర్దార్జీ సోదరులు ర్యాన్‌బాక్సీ లో తమ వాటా 34 శాతాన్ని, దైచీ శ్యాంకో కు 2.4 బిలియన్ డాలర్లకు విక్రయించడం వివాదానికి దారి తీసింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాల నేపథ్యంలో 2013 మే లో డైచీ ఆధ్వర్యంలోని రాన్‌బాక్సీ లాబరేటరీస్ అమెరికా ప్రభుత్వం మోపిన మోసం కేసుకు సుమారు 500 మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించేందుకు ఒప్పుకుంది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) ర్యాన్‌బాక్సీ ఔషధాలు నాణ్యమైనవి కావని నాసిరం మందులను తయారు చేస్తోందని తేల్చడంతో ఈ పరిణామం చేటు చేసుకుంది. ర్యాన్‌బాక్సీ తయారు చేసే ఔషధాలు సుమారు 30 వరకు ప్రమాణాలు పాటించడంలేదని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ తేల్చి చెప్పింది. ఈ ఔషధాలను అమెరికా మార్కెట్లో రద్దు చేసింది. తమ సంస్థ నష్టాలకు, అమెరికా కోర్టు జరిమానాకు పరిహారం చెల్లించాల్సిందిగా దాయిచీ 2013లో సింగపూర్ లో మధ్యవర్తిత్వ కేసు దాఖలు చేసింది. భారతీయ ప్రమోటర్లు అవాస్తవాలతో తమను వంచించారని పేర్కొంది. కాగా వాస్తవానికి ర్యాన్‌బాక్సీ గుట్టును రట్టు చేసింది మాత్రం కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగి దినేశ్ ఠాకూర్. ర్యాన్‌బాక్సీ తయారు చేసే ఔషధాల నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని... కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా ఇది తెలుసునని... ఠాకూర్ ఆరోపించారు.ర్యాన్‌బాక్సీకి చెందిన శాస్త్రవేత్తలకు పనికిరానివి... చౌకగా దొరికే ముడిపదార్థాలను వినియోగించి ఔషధాలను తయారు చేయాల్సిందిగా యాజమాన్యం ఆదేశించేవారని ఆరోపించారు. అమెరికా ఔషధ నియంత్రణా సంస్థను ర్యాన్‌బాక్సీ ఎలా మోసం చేసి తమ ఔషధాలను ఎలా ఆమోదించుకుందో ఠాకూర్ వివరాలతో సహా బహిర్గతం చేశారు. సంస్థ ఉద్యోగులే కంపెనీ అసలు గుట్టురట్టు చేయడంతో డొంకంతా కదిలింది. అయితే ఇప్పటికే కంపెనీనుంచి బయటికి వచ్చిన సివిందర్ మోహన్ సింగ్ ఎగ్జిక్యూటివ్ పాత్ర నుంచి వైదొలిగి ఆధ్యాత్మిక సంస్థ రాధా సాబి బియాస్ లో చేరారు. అటు రాన్ బ్యాక్సీని కొనుగోలు చేసిన జపాన్ సంస్థ డైచీ శాంక్యోను 2014లో సన్ ఫార్మా విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.