‘ర్యాన్‌బాక్సీ బ్రదర్స్‌’ మధ్య విభేదాలు | Clashes between Ranbaxy brothers | Sakshi
Sakshi News home page

‘ర్యాన్‌బాక్సీ బ్రదర్స్‌’ మధ్య విభేదాలు

Published Thu, Sep 6 2018 1:34 AM | Last Updated on Thu, Sep 6 2018 1:34 AM

Clashes between Ranbaxy brothers - Sakshi

న్యూఢిల్లీ: ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లయిన సింగ్‌ సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కుటుంబ వ్యాపారాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ అన్న మల్వీందర్‌ సింగ్‌పై సోదరుడు శివీందర్‌ సింగ్‌ కోర్టుకెళ్లారు. ‘ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, రెలిగేర్, ఫోర్టిస్‌ సంస్థల నిర్వహణలో అవకతవకలు, అణిచివేత ధోరణులపై మల్వీందర్‌తో పాటు రెలిగేర్‌ మాజీ చీఫ్‌ సునీల్‌ గోద్వానీలపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసు దాఖలు చేశాను’ అని శివీందర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. వీరిద్దరూ కలిసి కంపెనీ, షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.  రెలిగేర్‌కి చెందిన ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో తీసుకున్న నిర్ణయాలు, ర్యాన్‌బాక్సీని దైచీకి విక్రయించే డీల్‌ నిర్వహణ, ప్రైవేట్‌ చార్టర్‌ లిగేర్‌ ఏవియేషన్‌ వ్యాపారంలో అనూహ్య నష్టాలు మొదలైనవన్నీ వ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిపోయిందో చెప్పడానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ర్యాన్‌బాక్సీని జపాన్‌కి చెందిన దైచీ సాంక్యోకు విక్రయించిన సింగ్‌ సోదరులు ప్రస్తుతం ఈ డీల్‌ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సదరు ఒప్పందం తర్వాత హాస్పిటల్‌ చెయిన్‌ ఫోర్టిస్‌ హెల్త్‌కేర్, ఆర్థిక సేవల సంస్థ రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై సోదరులు దృష్టి పెట్టారు. కానీ వీటిల్లోనూ ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు సంస్థలు విచారణ కూడా జరుపుతున్నాయి. 

పరువు కోసం ఆగాను..
వాస్తవానికి ఈ చర్య ఎప్పుడో తీసుకోవాల్సిందని, కానీ పరిస్థితి మెరుగుపడుతుందేమోనన్న ఆశ, కుటుంబ పోరులో తమది కూడా మరో చెత్త అధ్యాయంగా మారకూడదన్న  ఉద్దేశంతో ఇంతకాలం ఆగానని శివీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. తమ కుటుంబం, తాను వ్యక్తిగతంగా ఎంతో క్షోభకు గురవుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపార ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఇప్పటిదాకా బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదని ఆయన చెప్పారు. ‘మా కుటుంబం పరువు ప్రతిష్టలు, సంపద, వ్యక్తిగతంగా నా విశ్వసనీయత అంతా మసకబారుతున్నా.. నేను స్థాపించిన కంపెనీని బహిరంగంగా వేలం వేసే పరిస్థితి వచ్చినా కూడా  ప్రేక్షకపాత్రే వహిస్తూ ఉండిపోయాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకత, నైతిక విలువలను నిరంతరం పాతరేస్తున్న పరిస్థితుల్లో మల్వీందర్‌తో ఇక తాను కలిసి పనిచేసే ప్రసక్తే లేదని శివీందర్‌ చెప్పారు. పరిస్థితులు ఇంతదాకా వచ్చిన నేపథ్యంలో సోదరుడితో వ్యాపార లావాదేవీలన్నీ తెగతెంపులు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2015లో వ్యాపార కార్యకలాపాల నుం చి తప్పుకున్న శివీందర్‌ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పంజాబ్‌లోని బియాస్‌లో స్థిరపడ్డారు. 

మల్వీందర్‌సింగ్‌కు జరిమానా
కోర్టు ఆదేశాల ధిక్కరణ అభియోగం కింద 3.5 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లు చెల్లించాలంటూ మల్వీందర్‌ సింగ్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం అనుమతి లేకుండా తమ స్థిరాస్తులు అమ్ముకోరాదంటూ సింగ్‌ సోదరులను ఆదేశించినప్పటికీ మల్వీందర్‌ వాటిని ధిక్కరించారని జస్టిస్‌ రాజీవ్‌ షక్‌దర్‌ పేర్కొన్నారు. రెలిగేర్‌ హెల్త్‌కేర్‌లో 45 లక్షల షేర్లను 3.5 మిలియన్‌ సింగపూర్‌ డాలర్లకు అమ్ముకున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలంటూ ఆదేశించారు. అయితే, సింగపూర్‌లో కొన్న అపార్ట్‌మెంట్‌ ఈఎంఐలు డిఫాల్టు కాకూడదనే ఉద్దేశంతో సదరు నిధులను బ్యాంకు వాయిదాలకు కట్టేందుకు వినియోగించినట్లు మల్వీందర్‌ సింగ్‌ తరఫు న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. ర్యాన్‌బాక్సీ డీల్‌కు సంబంధించి రూ. 3,500 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ తమకు అనుకూలంగా వచ్చిన ఉత్తర్వుల అమలు కోసం దైచీ సాంక్యో కోర్టును ఆశ్రయించిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకుంది.  

గురువారం విచారణ...
తన భార్య అదితి సింగ్‌ సంతకాన్ని మల్వీందర్‌  ఫోర్జరీ చేశారని, అక్రమ  ఆర్థిక లావాదేవీలతో పాటు కంపెనీని భారీ రుణాల్లో ముంచేశారని ఎన్‌సీఎల్‌టీలో వేసిన పిటిషన్‌లో శివీందర్‌ సింగ్‌ ఆరోపించారు. శివీందర్‌ తరఫున ఆర్‌ఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ వేసిన పిటిషన్‌ గురువారం విచారణకు రానుంది. అర్‌హెచ్‌సీ బోర్డు నుంచి మల్వీందర్‌ను తొలగించాలని, బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని పిటిషన్‌లో శివీందర్‌ కోరా రు. అలాగే, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్, రెలిగేర్‌ల నుంచి చట్టవిరుద్ధంగా తీసుకున్న నిధులను కూడా వాపసు చేసేలా మల్వీందర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌ రికార్డులన్నీ తనిఖీ చేసి, అవసరమైన పత్రాల కాపీలు తీసుకునేందుకు తనకు గానీ లేదా అధీకృత వ్యక్తులకు అనుమతివ్వాలని కోరారు. సింగ్‌ సోదరుల కుటుంబాలకు చెందిన ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్‌కి మల్వీందర్‌ సింగ్‌ ఎండీగా ఉన్నారు. 

అంతర్గత వ్యవస్థ పటిష్టం చేయడంపై దృష్టి:  ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌
వ్యవస్థాగత లోటుపాట్లను ఉపయోగించుకునే మాజీ ప్రమోటర్లు సింగ్‌ సోదరులు నిధుల అవకతవకలకు పాల్పడ్డారని విచారణలో తేలడంతో అంతర్గతంగా వివిధ వ్యవస్థలను పటిష్టం చేసుకోవడంపై ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ దృష్టి పెట్టింది. ఇందుకోసం బైటి ఏజెన్సీని నియమించుకోనున్నట్లు 2017–18 వార్షిక నివేదికలో సంస్థ పేర్కొంది. దర్యాప్తు నివేదికలోని అంశాల ఆధారంగా నిధుల అవకతవకలపై అంతర్గతంగా విచారణ కూడా జరిపే అవకాశం ఉందని వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement