
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్‌వెస్ట్ (ఆర్‌ఎఫ్‌ఎల్)కి చెందిన రూ. 2,397 కోట్ల మేర నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఫోర్టిస్ హెల్త్‌కేర్ మాజీ ప్రమోటర్ శివీందర్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరిలో రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ (ఆర్‌ఈఎల్) మాజీ చైర్మన్ సునీల్ గోధ్వానీ (58), ఆర్‌ఈఎల్.. ఆర్‌ఎఫ్‌ఎల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన కవి అరోరా, అనిల్ సక్సేనా ఉన్నారు. నిధులను మళ్లించి ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. శివీందర్ సోదరుడు మల్వీందర్ సింగ్ పరారీలో ఉన్నారని, ఆయనపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయ్యిందని వివరించారు. ఆర్‌ఈఎల్‌కు ఆర్‌ఎఫ్‌ఎల్ అనుబంధ సంస్థ. 2018 ఫిబ్రవరి దాకా సింగ్ సోదరులు ఆర్‌ఈఎల్ ప్రమోటర్లుగా కొనసాగారు.
వారి నిష్క్రమణ తర్వాత ఆర్‌ఈఎల్, ఆర్‌ఎఫ్‌ఎల్ బోర్డులు మారాయి. శివీందర్ సింగ్ ప్రమోటర్‌గా ఉన్న సమయంలో తీసుకున్న రుణాలను ఇతర సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారన్న ఆర్‌ఎఫ్‌ఎల్ ఫిర్యాదు మేరకు తాజా అరెస్టులు జరిగాయి. ‘ఆర్‌ఎఫ్‌ఎల్ కొత్త మేనేజ్‌మెంట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్దిష్ట రుణమొత్తం.. సింగ్, ఆయన సోదరుడికి చెందిన కంపెనీల్లోకి మళ్లినట్లు గుర్తించింది. దీనిపై ఈవోడబ్ల్యూకి ఫిర్యాదు చేసింది. దానికి అనుగుణంగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది‘ అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్ మాజీ ప్రమోటర్లు కూడా అయిన సింగ్ సోదరులతో పాటు గోధ్వానీపైనా పలు ఆరోపణలు ఉన్నాయి. ర్యాన్‌బాక్సీ విక్రయం విషయంలో మోసాలకు పాల్పడ్డారంటూ శివీందర్, మల్వీందర్‌ల నుంచి జపాన్ ఔషధ సంస్థ దైచీ శాంక్యో రూ. 2,600 కోట్ల మేర నష్టపరిహారాన్ని రాబట్టుకునే ప్రయత్నాల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment