సన్-ర్యాన్‌బాక్సీ డీల్‌పై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీని చేజిక్కించుకోవడం కోసం సన్ ఫార్మా కుదుర్చుకున్న మెగా ఒప్పందంపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దృష్టిసారిస్తోంది. ఈ డీల్ ప్రకటనకు ముందు ర్యాన్‌బాక్సీ షేర్ల ట్రేడింగ్‌లో తీవ్ర అవకతవకలు చేటుచేసుకున్నాయని.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ అనేక ఫిర్యాదులు సెబీకి అందడమే దీనికి కారణం. సుమారు 400 కోట్ల డాలర్ల(80 కోట్ల డాలర్ల రుణంతో కలిపి)కు ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేస్తున్నట్లు సన్ ఫార్మా ఈ నెల 7న ప్రకటించడం తెలిసిందే. పూర్తిగా షేర్ల కేటాయింపు రూపంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
అయితే, గత వారంలో ర్యాన్‌బాక్సీ షేర్లలో అనూహ్య కదలికలు నమోదయ్యాయి. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 మధ్య ర్యాన్‌బాక్సీ షేరు ధర బీఎస్‌ఈలో 26 శాతం ఎగబాకడం విశేషం. బుధవారం 4.9 శాతం ఎగసిన ఈ షేరు రూ.467 వద్ద ముగిసింది. డీల్ ప్రకటనకు ముందు ర్యాన్‌బాక్సీ షేరు కదలికలను గమనిస్తే.. ఇంట్రీడేలో భారీ పరిమాణంలో ట్రేడింగ్ జరిగినట్లు అవగతమవుతోందని.. ముందుగానే ఒప్పందం లీకయిఉండొచ్చన్న అనుమానాలను ఫిరాదుదారులు వ్యక్తం చేశారు. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ సంస్థల నుంచి సెబీ ట్రేడింగ్ డేటాను సేకరించడం ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
సెబీకి ఫిర్యాదు చేసిన వారిలో స్టాక్ బ్రోకర్లతోపాటు ఇన్వెస్టర్ అసోసియేషన్లు, ఫండ్ సంస్థలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ర్యాన్‌బాక్సీ-సన్ డీల్ గురించి ఎక్స్ఛేంజీలకు ఆదివారం అర్ధరాత్రే సమాచారం అందిఉండొచ్చని, అధికారిక ప్రకటనకు ముందే సమాచారాన్ని అందుకున్న అనుమానిత సంస్థలపై సెబీ దృష్టిసారిస్తున్నట్లు కూడా ఆయా వర్గాలు చెబతున్నాయి.
ఇన్‌సైడర్ ఆరోపణలు అవాస్తవం: సన్ ఫార్మా
ర్యాన్‌బాక్సీతో డీల్ విషయంలో తమ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ సిల్వర్‌స్ట్రీట్ డెవలపర్స్ ఎల్‌ఎల్‌పీపై వచ్చిన ఇన్‌సైడర్ ఆరోపణలను సన్ ఫార్మా ఖండించింది. సిల్వర్‌స్ట్రీట్ డెవలపర్స్‌కు గతేడాది సెప్టెంబర్ నాటికి ర్యాన్‌బాక్సీలో ఎలాంటి వాటా లేదు. అయితే, డిసెంబర్ చివరికల్లా 1.41 శాతం వాటాను ఈ సంస్థ కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31నాటికి ఈ వాటా 1.64 శాతానికి పెరిగింది. అయితే, ర్యాన్‌బాక్సీలో సిల్వర్‌స్ట్రీట్ షేర్ల కొనుగోలు అంశం ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన కిందికి రాదని సన్ ఫార్మా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ బావమరిదైన సుధీర్ వి. వాలియా... సిల్వర్‌స్ట్రీట్ భాగస్వాముల్లో ఒకరంటూ వార్తల్లోకి రావడం విశేషం. దీన్ని కూడా సన్ ఫార్మా ఖండించింది. సన్ ఫార్మా షేరు ధర బుధవారం బీఎస్‌ఈలో 6.91 శాతం లాభపడి రూ.628 వద్ద ముగిసింది.
ర్యాన్‌బాక్సీపై కొనసాగుతున్న ఈయూ ఆంక్షలు
ర్యాన్‌బాక్సీకి చెందిన తోన్సా, దేవాస్ ప్లాంట్‌ల నుంచి ఔషధ ఉత్పత్తులను యూరప్‌కు ఎగమతి చేయకుండా విధించిన సస్పెన్షన్ కొనసాగుతుందని యూరోపియన్ నియంత్రణ సంస్థ ఈఎంఏ పేర్కొంది. ఈ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించిదన్న ఆరోపణలతో ఈఎంఏ ఆంక్షలు విధించింది. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, దేవాస్ ప్లాంట్‌లో అంతర్జాతీయ తనిఖీలు ఈ ఏడాది జూన్‌లో జరగనున్నట్లు ఈఎంఏ ప్రతినిధి వెల్లడించారు. కాగా, తోన్సా ప్లాంట్‌కు సంబంధించి తయారీ ప్రమాణాలపై ఇచ్చిన ధ్రువీకరణను భారతీయ అధికారులు వెనక్కితీసుకున్నట్లు కూడా చెప్పారు.అమెరికా నియంత్రణ సంస్థ యూఎస్ ఎఫ్‌డీఏ కూడా భారత్‌లో ర్యాన్‌బాక్సీకి చెందిన మొత్తం నాలుగు ప్లాంట్‌లో నాణ్యాతా ప్రమాణాలను పాటించడం లేదంటూ తమ దేశానికి జరిగే ఎగుమతులను నిషేధించడం తెలిసిందే.