ఫార్మాలో 100% ఎఫ్‌డీఐల కొనసాగింపు | Government retains 100% FDI in existing pharma units | Sakshi
Sakshi News home page

ఫార్మాలో 100% ఎఫ్‌డీఐల కొనసాగింపు

Published Thu, Jan 9 2014 1:26 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

ఫార్మాలో 100% ఎఫ్‌డీఐల కొనసాగింపు - Sakshi

ఫార్మాలో 100% ఎఫ్‌డీఐల కొనసాగింపు

 న్యూఢిల్లీ: ఇప్పుడున్న ఫార్మా కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బహళజాతి ఫార్మా దిగ్గజాలు దేశీ కంపెనీలను చేజిక్కించుకోవడం వల్ల చౌక ధరల ఔషధాలు లేకుండా పోతాయన్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మా ఎఫ్‌డీఐలపై సమీక్ష అనంతరం ప్రస్తుత పాలసీనే యథాతథంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ‘నాన్-కాంపీట్’ అంశాన్ని మాత్రం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) అమోదంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అనుమతించకూడదనే నిబంధనను విధించినట్లు డీఐపీపీ తెలిపింది. ఫార్మా ఎంఎన్‌సీలు దేశీ కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచుతుండటంతో ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేయాలని తొలుత డీఐపీపీ ప్రతిపాదించింది. ఇలా కొనుగోలు చేయడం వల్ల దేశంలో చౌక జనరిక్ ఔషధాల లభ్యతకు తీవ్ర ముప్పువాటిల్లుతోందని కూడా ఆందోళన వ్యక్తంచేసింది. క్లిష్టతరమైన, అరుదైన ఫార్మా విభాగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతం నుంచి 49 శాతానికి తగ్గించాలని సూచించింది. అయితే, కేంద్ర కేబినెట్ మాత్రం డీఐపీపీ ఆందోళనలను తోసిపుచ్చడం గమనార్హం.
 
 అమెరికా ఫార్మా దిగ్గజం మైలాన్.. బెంగళూరుకు చెందిన ఏజిలా స్పెషాలిటీస్(స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్స్ అనుబంధ కంపెనీ)ను చేజిక్కించుకున్న డీల్‌కు గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందం విలువ రూ.5,168 కోట్లు. అదే విధంగా 2008లో జపాన్ సంస్థ దైచీ శాంక్యో కంపెనీ.. భారత్‌లో నంబర్‌వన్ ఫార్మా కంపెనీ ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేయడం విదితమే. ఈ డీల్ విలువ 4.6 బిలియన్ డాలర్లు. ఇక పిరమల్ హెల్త్‌కేర్‌ను అమెరికా సంస్థ అబాట్ 3.7 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. కాగా, కొత్త ఫార్మా ప్రాజెక్టుల ఏర్పాటులో భారత్ 100 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ ఆమోదం రూట్‌లో అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement