ఎఫ్‌ఐపీబీ రద్దు... ఇక ఎఫ్‌డీఐల జోరు
ఎఫ్‌డీఐ విధానం మరింత సరళతరం
న్యూఢిల్లీ: సింహభాగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆటోమేటిక్ మార్గంలోనే వస్తున్న నేపథ్యంలో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే విధంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ)ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇకపై ప్రభుత్వ అనుమతి అవసరమైన విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలపై .. సంబంధిత మంత్రిత్వ శాఖలే తగు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు. ప్రస్తుతం దాదాపు 90 శాతం ఎఫ్‌డీఐలు ఆటోమేటిక్ మార్గంలోనే వస్తుండగా.. కేవలం పది శాతం ప్రతిపాదనలే ఎఫ్‌ఐపీబీ వద్దకు వెడుతున్నాయని జైట్లీ చెప్పారు. అందుకే ఎఫ్‌ఐపీబీని విడతలవారీగా రద్దు చేసే సమయం వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ఇందుకు సంబంధించిన మార్గదర్శ ప్రణాళికలను రాబోయే నెలల్లో ప్రకటించగలమన్నారు. మరోవైపు, ఎఫ్‌డీఐ విధానాన్ని మరింత సరళతరం చేసే అంశం కూడా పరిశీలనలో ఉందని, త్వరలో ఇందుకు సంబంధించిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని జైట్లీ చెప్పారు. తాజా పరిణామాలతో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్ వ్యవధి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తిగా ఉన్న సింగిల్ బ్రాండ్, మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ కంపెనీలకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఈవై ఇండియా సంస్థ పేర్కొంది. 1990లలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తొలినాళ్లలో ప్రధాని కార్యాలయం (పీఎంవో) కింద ఎఫ్‌ఐపీబీ ఏర్పాటైంది.
ఆ తర్వాత 1996లో దీన్ని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ)కి బదలాయించారు. 2003లో ఆర్థిక వ్యవహారాల విభాగం కింద చేర్చారు. ఆటోమేటిక్ పద్ధతిలోకి రాని రంగాల్లో విదేశీ పెట్టుబడుల కోసం ఎఫ్‌ఐపీబీ ఆమోదముద్ర అవసరమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎఫ్‌డీఐలు 30 శాతం పెరిగి 21.62 బిలియన్ డాలర్లకు చేరాయి.