రూ.7,262 కోట్ల ఎఫ్ డీఐలకు ఓకే
15 ప్రతిపాదనలకు ఎఫ్‌ఐపీబీ ఆమోదముద్ర
న్యూఢిల్లీ: ప్రభుత్వం రూ.7,262 కోట్ల విలువైన 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన వాటిల్లో జపాన్ బీమా సంస్థ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ, అవైవా లైఫ్ తదితర సంస్థలు ప్రతిపాదనలు ఉన్నాయి. బీమా సంస్థల్లో విదేశీ భాగస్వామ్య సంస్థలు తమ వాటాను 49 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలే వీటిల్లో అధికంగా ఉన్నాయి. ఈ నెల 7న జరిగిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) సూచనలు ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతమున్న 41.87 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవాలన్న యస్‌బ్యాంక్ ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎఫ్‌ఐపీబీ నివేదించింది. వివరాలు..,మ్యాక్స్ ఇండియా డీమెర్జర్ కారణంగా మ్యాక్స్ ఇండియా వాటాదారులకు షేర్ల కేటాయించాలన్న టారస్ వెంచర్స్ ప్రతిపాదన ఆమోదం పొందింది.
-
మ్యాక్స్ ఇండియా డీమెర్జర్ కారణంగా మ్యాక్స్ ఇండియా వాటాదారులకు షేర్ల కేటాయించాలన్న టారస్ వెంచర్స్ ప్రతిపాదన ఆమోదం పొందింది.
-
రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాను 26% నుంచి 49%కి పెంచుకోవాలన్న నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతిపాదన ఓకే అయింది. ఈ 23% వాటా కొనుగోలుకు నిప్పన్ లైఫ్ రూ.2,265 కోట్లు వెచ్చించనున్నది. ఈ ప్రతిపాదనకు నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆమోదం పొందింది. మరికొన్ని రోజుల్లోనే ఈ డీల్ పూర్తవుతుందని అంచనా. డీల్ పూర్తయ్యాక కంపెనీ పేరు రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌గా మారుతుంది.
-
ఏఐఏ ఇంటర్నేషనల్‌లో వాటాను 26% నుంచి 49 శాతానికి పెంచుకోవాలన్న టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదన విలువ రూ.2,055 కోట్లు.
-
అవైవా ఇంటర్నేషనల్‌లో అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తన వాటాను 49 శాతానికి పెంచుకునే ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రూ.940 కోట్లతో అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఈ వాటాను పెంచుకుంటోంది.
-
బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో విదేశీ వాటాను 49%కి పెంచుకోవడానికి అనుమతి. ఈ ప్రతిపాదన విలువ రూ.1,664 కోట్లు.
- ఎన్‌బీఎఫ్‌సీలోని 25కి పైగా విభాగాల్లో 100%కి ఎఫ్‌డీఐలు!
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం.. కమోడిటీ బ్రోకింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెబ్ట్ ఫండ్ సహా ఎన్‌బీఎఫ్‌సీలోని 25కి పైగా విభాగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 100%కి పెంచే ఆలోచనలో ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) సంబంధిత విభాగాల్లో ఎఫ్‌డీఐ ఆకర్షణకు కృషి చేస్తామన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం ప్రభుత్వం మర్చంట్ బ్యాంకింగ్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ, స్టాక్ బ్రోకింగ్ సహా 18 ఎన్‌బీఎఫ్‌సీ విభాగాల్లో ఆటోమెటిక్ మార్గంలో 100% ఎఫ్‌డీఐలను అనుమతిస్తోంది.