నాలుగు ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
వీటి విలువ రూ.1,810 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) రూ.1,810 కోట్ల విలువైన నాలుగు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఫైర్ ప్లై నెట్‌వర్క్స్ లిమిటెడ్, సాఫ్ట్‌వేర్ ఈజ్ కరెక్ట్ తదితర ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది. హెచ్‌డీఎఫ్‌సీలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్ షేర్లను స్టాండర్ట్ లైఫ్‌కు బదిలీ చేయడానికి ఎఫ్‌ఐపీబీ పచ్చజెండా ఊపింది.
దీంతో హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్ట్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో విదేశీ వాటా 26 శాతం నుంచి 35 శాతానికి పెరుగుతుంది. ఈ ప్రతిపాదన కారణంగా రూ.1,700 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తాయని అంచనా. మొత్తం తొమ్మిది ప్రతిపాదనల్లో నాలుగింటిని వాయిదా వేసింది.ఒక ప్రతిపాదన వెనక్కివెళ్లిపోయింది. అవైవా లైఫ్ ఇన్సూరెన్స్, టాటా సికోర్‌స్కీ, షేర్‌ఖాన్, క్వాంటమ్ సిమ్యులేటర్స్ ప్రతిపాదనలు వాయిదా పడ్డాయి.