ఎఫ్‌ఐపీబీ రద్దుతో ఎఫ్‌డీఐల జోరు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించేందుకు పాతికేళ్ల కిత్రం ఏర్పాటైన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ (ఎఫ్‌ఐపిబి) రద్దుపై హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ చర్యకారణంగా విదేశీ పెట్టుబడులు ఇబ్బడి ముబ‍్బడిగా రానున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో దేశంలోకి విదేశీపెట్టుబడులకు మంచి బూస్ట్ ఇస్తుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే విధంగా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్‌ఐపీబీ)ని రద్దు చేయడాన్ని సీఐఐస్వాగతించింది. కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంద్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన దానికి కొనసాగిపుంగా ఎఫ్ఐపిబి రద్దు ప్రక్రియ ద్వారా ఎఫ్‌డీల జోరు పెరుగుతుందని, తద్వారా మరిన్న ఉపాధి అవకాశాలు రానున్నాయని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. భారత్ ఒక ఆచరణీయ వ్యాపార గమ్యస్థానంగా నిలవనుందని తెలిపారు.
ప్రస్తుతం, కేవలం 11 రంగాల్లో మాత్రమే ఆమోదం ఉన్న పాతికేళ్లనాటి ఎఫ్‌ఐపీబీని రద్దు చేయడం, సింగిల్ విండో ద్వారా ఎఫ్‌డీఐ ప్రదిపాదనలను ఆమోదించడం వ్యాపార నిర్వహణలో సంస్కరణలు, వ్యాపార సరళీకరణ, పెట్టుబడిదారుల్లో విశాసాన్ని పెంచేందకు ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబింస్తోందని బెనర్జీ వ్యాఖ్యానించారు. అలాగే మేకిన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి వ్యూహాత్మక భాగస్వామ్యంతో దేశీయసంస్థల్లో టెక్నాలజీ బదిలీ మార్గాన్ని సుగమం చేసిందని పేర్కొన్నారు.
కాగా బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఎఫ్‌ఐపిబి రద్దుకు ఆమోదం తెలిపింది. దీనిస్థానే కొత్త వ్యవస్థను త్వరలోనే ప్రకటిస్తారు. కొత్త వ్యవస్థలో విదేశీ పెట్టుబడి ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వ శాఖలు స్వయంగా పరిశీలించి ఆమోదిస్తాయి. ఇందుకు సంబంధించి ప్రామాణికమైన మార్గదర్శకాలను రూపొందిస్తారని ఆర్థిక మంత్రి జైట్లీ కేబినెట్ చెప్పారు. కీలకమైన రంగాలు ముఖ్యంగా దేశ భద్రత, సమగ్రతతో ముడివడిన రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలకు హోమ్ మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.