Abbot Laboratories
-
కేవలం 5 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించుటకై అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సంస్థ అబాట్ లాబొరేటరీస్ అత్యాధునిక కిట్‌ను రూపొందించింది. మాలిక్యులర్ టెక్నాలజీని ఉపయోగించి చిన్నపాటి టోస్టర్ పరిమాణంలో ఉండే పోర్టబుల్ టెస్టింగ్ కిట్‌ను తయారు చేసింది. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఒక వ్యక్తికి కరోనా సోకిందా లేదా అన్న విషయం బయటపడుతుందని శుక్రవారం పత్రికా సమావేశంలో సంస్థ పేర్కొంది. ఇక కరోనా నెగటివ్ ఫలితాన్ని ఈ కిట్ 13 నిమిషాల్లో వెలువరుస్తుందని తెలిపింది. అమెరికా ఆహార, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) వచ్చే వారంలోగా వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని తమను ఆదేశించినట్లు పేర్కొంది. (అమెరికా గ్లోబల్ ప్యాకేజీ.. భారత్‌కు ఎంతంటే.. ) ఈ సందర్భంగా అబాట్ అధ్యక్షుడు, సీఓఓ రాబర్ట్ ఫోర్డ్ మాట్లాడుతూ.. ‘‘ కోవిడ్-19 మహమ్మారిపై అన్ని వైపుల నుంచి పోరాటం చేస్తున్నాం. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే యుద్ధంలో ఈ పోర్టబుల్ మాలిక్యులర్ టెస్టు ఎంతగానో ఉపకరిస్తుంది. వైరస్‌పై పోరాడేందుకు ముఖ్యమైన నిర్ధారణ పరీక్షల్లో త్వరితగతిన ఫలితాలు వెల్లడిస్తుంది’’అని పేర్కొన్నారు. కేవలం ఆస్పత్రులకే పరిమితం కాకుండా ఎక్కడైనా దీనిని తీసుకువెళ్లేందుకు వీలుగా టోస్టర్ సైజులో రూపొందించినట్లు వెల్లడించారు. అయితే ఈ కిట్‌ను ప్రజా బాహుళ్యంలోకి తెచ్చేందుకు ఎఫ్‌డీఏ నుంచి ఆమోదం లభించలేదని తెలిపారు. ఇక కరోనా వైరస్‌ను 50 నిమిషాల్లో నిర్ధారించే స్మార్ట్‌ఫోన్ ఆధారిత పోర్టబుల్ కిట్‌ను రూపొందించినట్లు బ్రిటన్ పరిశోధకులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.(కరోనా నిర్ధారణ నిమిషాల్లోనే!) BREAKING: We’re launching a test that can detect COVID-19 in as little as 5 minutes—bringing rapid testing to the frontlines. https://t.co/LqnRpPpqMM pic.twitter.com/W8jyN2az8G — Abbott (@AbbottNews) March 27, 2020 -
ఫార్మాలో 100% ఎఫ్‌డీఐల కొనసాగింపు
న్యూఢిల్లీ: ఇప్పుడున్న ఫార్మా కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బహళజాతి ఫార్మా దిగ్గజాలు దేశీ కంపెనీలను చేజిక్కించుకోవడం వల్ల చౌక ధరల ఔషధాలు లేకుండా పోతాయన్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మా ఎఫ్‌డీఐలపై సమీక్ష అనంతరం ప్రస్తుత పాలసీనే యథాతథంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ‘నాన్-కాంపీట్’ అంశాన్ని మాత్రం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అమోదంతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప అనుమతించకూడదనే నిబంధనను విధించినట్లు డీఐపీపీ తెలిపింది. ఫార్మా ఎంఎన్‌సీలు దేశీ కంపెనీల కొనుగోళ్ల జోరు పెంచుతుండటంతో ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేయాలని తొలుత డీఐపీపీ ప్రతిపాదించింది. ఇలా కొనుగోలు చేయడం వల్ల దేశంలో చౌక జనరిక్ ఔషధాల లభ్యతకు తీవ్ర ముప్పువాటిల్లుతోందని కూడా ఆందోళన వ్యక్తంచేసింది. క్లిష్టతరమైన, అరుదైన ఫార్మా విభాగాల్లో ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతం నుంచి 49 శాతానికి తగ్గించాలని సూచించింది. అయితే, కేంద్ర కేబినెట్ మాత్రం డీఐపీపీ ఆందోళనలను తోసిపుచ్చడం గమనార్హం. అమెరికా ఫార్మా దిగ్గజం మైలాన్.. బెంగళూరుకు చెందిన ఏజిలా స్పెషాలిటీస్(స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్స్ అనుబంధ కంపెనీ)ను చేజిక్కించుకున్న డీల్‌కు గతేడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందం విలువ రూ.5,168 కోట్లు. అదే విధంగా 2008లో జపాన్ సంస్థ దైచీ శాంక్యో కంపెనీ.. భారత్‌లో నంబర్‌వన్ ఫార్మా కంపెనీ ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేయడం విదితమే. ఈ డీల్ విలువ 4.6 బిలియన్ డాలర్లు. ఇక పిరమల్ హెల్త్‌కేర్‌ను అమెరికా సంస్థ అబాట్ 3.7 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. కాగా, కొత్త ఫార్మా ప్రాజెక్టుల ఏర్పాటులో భారత్ 100 శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ ఆమోదం రూట్లో అనుమతిస్తున్న సంగతి తెలిసిందే.