నష్టాలు తగ్గించుకున్న ర్యాన్‌బాక్సీ
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ డిసెంబర్ క్వార్టర్‌లో రూ. 159 కోట్ల నికర న ష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో నమోదైన రూ. 492.4 కోట్లతో పోలిస్తే నష్టాలు బాగా తగ్గాయి. మొటిమల తరహా చర్మవ్యాధి చికిత్సకు వినియోగించే అబ్సారికా అక్నే ఔషధ విక్రయాలు ఊపందుకోవడం ప్రధానంగా ఇందుకు దోహదపడినట్లు కంపెనీ తెలిపింది. ఇండియా, తూర్పు యూరోప్, అమెరికా వంటి కీలక మార్కెట్లలో బిజినెస్‌ను పటిష్టపరచుకోవడంతో లాభదాయకత మెరుగుపడినట్లు కంపెనీ సీఈవో అరుణ్ సాహ్నీ పేర్కొన్నారు.
తోన్సా ప్లాంట్‌లో తయారయ్యే ఔషధాలపై యూఎస్‌ఎఫ్‌డీఏ నిషేధం నేపథ్యంలో సంబంధిత నష్టాలకు రూ. 257 కోట్లమేర కేటాయింపులు జరిపినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఆదాయం దాదాపు 7% పుంజుకుని రూ. 2,894 కోట్లకు చేరింది. కాగా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్-మార్చి కాలానికి మార్పుచేసేందుకు వీలుగా ప్రస్తుత ఏడాది ఫలితాలను 15 నెలల కాలానికి పొడిగించినట్లు వివరించింది.
ఫలితాల నేపథ్యంలో ర్యాన్‌బాక్సీ షేరు బీఎస్‌ఈలో దాదాపు 6% జంప్ చేసి రూ. 340 వద్ద ముగిసింది.