మందుబిళ్లల్లో ‘వెంట్రుకలు’.. నూనె అవశేషాలు
Published Thu, Sep 19 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ ఔషధాల తయారీలో నాణ్యతా ప్రమాణాలపరంగా(సీజీఎంపీ) అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తన పరిశీలనలో గుర్తించింది. మొహాలీ ప్లాంటులో తయారైన మందుబిళ్లల్లో వెంట్రుకల్లాంటి నల్లటి ఫైబర్ పదార్థాలు, యంత్రాల్లో నుంచి నూనె కారిపడినట్లుగా నల్లని మచ్చలు మొదలైనవి ఉన్నట్లు కనుగొంది. అలాగే, టాయ్‌లెట్లలో పరిశుభ్రత లోపించినట్లు, కనీసం సరైన నీటి సదుపాయం కూడా లే నట్లు గుర్తించింది. 2011, 2012లో ప్లాంటు తనిఖీకి సంబంధించి ర్యాన్‌బాక్సీకి పంపిన పత్రాల్లో ఎఫ్‌డీఏ ఈ అంశాలతో పాటు మొత్తం 11 ఉల్లంఘనలను ప్రస్తావించింది. 2012 ఆగస్టులో నిర్వహించిన తనిఖీ సందర్భంగా ఒక ట్యాబ్లెట్‌లో సన్నని, నల్లటి పదార్థం కనిపించడాన్ని ఈ సందర్భంగా ఉటంకించింది.
ఇది యంత్రం నుంచి జారిన టేప్ అవశేషమైనా కావొచ్చని, లేదా మెషీన్‌ని లోడింగ్ చేస్తున్నప్పుడు ఉద్యోగి చేతి వెంట్రుకైనా పడి ఉండొచ్చని పేర్కొంది. దీని గురించి చెప్పినప్పటికీ సంస్థ దీనికి కారణాలు కనుగొనడంపై దృష్టి పెట్టలేదని ఎఫ్‌డీఏ పేర్కొంది. ముడి సరుకును నిల్వ చేసే ప్రదేశానికి ఆనుకుని ఉన్న టాయ్‌లెట్‌లో నీటి సదుపాయం లేదని తెలిపింది. నాణ్యతాప్రమాణాలు లోపించిన కారణంగా మొహాలీ ప్లాంటు నుంచి ఔషధాల దిగుమతిని ఎఫ్‌డీఏ నిషేధించడం తెలిసిందే. ఇప్పటికే, హిమాచల్ ప్రదేశ్‌లోని పౌంతా సాహిబ్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్లాంట్లలో ఉల్లంఘనలపై ఎఫ్‌డీఏ చర్యలు తీసుకుంది.
Advertisement
Advertisement