తగ్గిన యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు
జోష్ మీదున్న దేశీయ కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అమలు చేస్తున్న కఠిన నిబంధనలను పాటించడంలో 2024లో భారతీయ ఫార్మా కంపెనీలు పెద్ద ఎత్తున పురోగతి సాధించాయి. బయోలాజిక్స్, డ్రగ్స్, వైద్య పరికరాలు.. ఇలా విభాగం ఏదైనా యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీల ప్రతికూల వర్గీకరణ (క్లాసిఫికేషన్) సంఖ్య ప్రస్తుత సంవత్సరంలో తగ్గడం విశేషం. 2023లో యూఎస్‌ఎఫ్‌డీఏ దేశవ్యాప్తంగా 225 తనిఖీలను నిర్వహించింది. ఇందులో 18 అధికారిక చర్య (అఫీషియల్ యాక్షన్), 117 స్వచ్ఛంద చర్య (వాలంటరీ యాక్షన్) కేసులకు దారితీసింది.
నియంత్రణ సంస్థ 2024 నాటికి ప్రమాణాలను కఠినతరం చేసినప్పటికీ తనిఖీల సంఖ్య 206కి పడిపోయింది. అయితే అఫీషియల్ యాక్షన్ కేసులు 14, వాలంటరీ యాక్షన్ కేసులు 115కి తగ్గాయి. భారతీయ ఔషధ రంగం సంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అధిక నాణ్యత, తయారీ పద్ధతులను పాటిస్తున్నాయనడానికి తగ్గిన ఈ కేసులే నిదర్శనం అని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ చెబుతోంది. మహమ్మారికి ముందు 2018తో పోలిస్తే 2019లో అఫీషియల్ యాక్షన్ కేసుల్లో 100 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం.
తనిఖీల ఆధారంగా..
తయారీ కేంద్రాలను యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీ చేసినప్పుడు.. తనిఖీల ఆధారంగా ఫలితాలను వర్గీకరిస్తుంది. అభ్యంతకర పరిస్థితులు, కార్యకలాపాల్లో ఏదైనా లోపం ఉన్నట్లయితే అట్టి ఫెసిలిటీ వాలంటరీ యాక్షన్ వర్గీకరణను అందుకుంటుంది. తక్షణ నియంత్రణ చర్యలు తీసుకోకుండా లోపాలను స్వచ్ఛందంగా సరిదిద్దడానికి అవకాశం ఇస్తారు. ఎఫ్‌డీఏ నియంత్రణ సమావేశం ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయవచ్చు.
భద్రత, సంక్షేమం లేదా డేటా విశ్వసనీయతను గణనీయంగా ప్రభావితం చేసే తీవ్ర నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడినట్టు గుర్తిస్తే అఫీషియల్ యాక్షన్ కేసు నమోదు చేస్తారు. ఇటువంటి సందర్భాలలో అడ్మినిస్ట్రేటివ్, రెగ్యులేటరీ చర్యలకు ఎఫ్‌డీఏ సిఫార్సు చేస్తుంది. ఇందులో వార్నింగ్ లెటర్స్, దిగుమతి హెచ్చరికలు, ఆదేశాలు వంటి చట్టపర చర్యలు కూడా ఉండవచ్చు. తనిఖీ సమయంలో ఎటువంటి ఉల్లంఘనలు కనుగొనకపోతే నో యాక్షన్ ఇండికేట్‌గా వర్గీకరిస్తారు. తనిఖీ పూర్తయిన 45 నుండి 90 రోజులలోపు కంపెనీకి తుది తనిఖీ వర్గీకరణను యూఎస్‌ఎఫ్‌డీఏ తెలియజేస్తుంది.
క్వాలిటీయే తొలి ప్రాధాన్యత..
నాణ్యత ప్రమాణాలు, మెరుగైన కార్యాచరణ, నిబంధనలను చురుకుగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యపడిందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) పేర్కొంది. ‘నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిని పెంపొందించడంలో భారతీయ ఫార్మా కంపెనీలు గణనీయ కార్యాచరణను చేపట్టాయి. సీనియర్ నాయకత్వ బృందాలు ఆటోమేషన్, బలమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, కొనసాగుతున్న ఉద్యోగుల శిక్షణ ద్వారా నిరంతరంగా ప్రమాణాలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాయి. కంపెనీలు నాణ్యతకు తొలి ప్రాధాన్యత ఇచ్చాయి.
కచ్చితత్వం, సామర్థ్యాన్ని పెంపొందించడానికి తయారీ కేంద్రాల్లో అధునాతన ఆటోమేషన్ సాంకేతికతలను అమలు చేశాయి’ అని ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగ్గా చేయడానికి కట్టుబడి ఉన్నామని ఐపీఏ వెల్లడించింది. ‘ఈ పురోగతి భారత్‌లో నాణ్యతా ప్రమాణాలను ముందుకు తీసుకెళ్లాలనే మా నిబద్ధతను నొక్కి చెబుతోంది. నాణ్యమైన సంస్కృతిని బలోపేతం చేయడానికి, గ్లోబల్ బెంచ్‌మార్క్‌లతో సమం చేయడానికి నిరంతర ప్రయత్నంలో భాగంగా మేము దీనిని చూస్తాము’ అని వివరించింది.
ప్రస్తుత సంవత్సరంలో దేశవ్యాప్తంగా యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు, కేసులు తగ్గిన నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల 2024–25 ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, 2024 జనవరి 1తో పోలిస్తే బీఎస్‌ఈలో మంగళవారం (డిసెంబర్ 31) నాటికి షేరు వృద్ధి, ధరను ఒకసారి పరిశీలిస్తే..
డాక్టర్ రెడ్డీస్ ల్యాబో రేటరీస్
రూ.1,342 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ2లో నమోదైన రూ.1,480 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. గ్లోబల్ జనరిక్స్ జోరుతో టర్నోవర్ సుమారు 17 శాతం వృద్ధి చెంది రూ.8,016 కోట్లకు చేరింది. షేరు ధర 19.28 శాతం దూసుకెళ్లి రూ.1,388.25 వద్ద స్థిరపడింది.
అరబిందో ఫార్మా
నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.6 శాతం అధికమై రూ.817 కోట్లు నమోదు చేసింది. ఎబిటా 11.6 శాతం దూసుకెళ్లి రూ.1,566 కోట్లుగా ఉంది. టర్నోవర్ 8 శాతం పెరిగి రూ.7,796 కోట్లకు చేరింది. షేరు ధర 23.61 శాతం ఎగసి రూ.1,335.20 వద్ద ముగిసింది.
గ్లాండ్ ఫార్మా
నికరలాభం 16 శాతం క్షీణించి రూ.163 కోట్లకు వచ్చి చేరింది. ఆదాయం రూ.1,373 కోట్ల నుంచి రూ.1,405 కోట్లకు పెరిగింది. షేరు ధర 6.21 శాతం క్షీణించి రూ.1,788.60లు తాకింది.
నాట్కో ఫార్మా
నికరలాభం అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 83 శాతం ఎగసి రూ.676 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.1,031 కోట్ల నుంచి రూ.1,371 కోట్లకు చేరింది. షేరు ధర 69.73 శాతం వృద్ధి చెంది రూ.1,387 వద్ద స్థిరపడింది.
గ్రాన్యూల్స్ ఇండియా
నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 4.79 శాతం తగ్గి రూ.97 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 19.49 శాతం క్షీణించి రూ.956 కోట్లకు వచ్చి చేరింది. షేరు ధర 43.76 శాతం అధికమై రూ.591.80 వద్ద ముగిసింది.
దివీస్ ల్యాబొరేటరీస్
నికరలాభం రూ.510 కోట్లు సాధించింది. 2023–24లో ఇదే త్రైమాసిక లాభం రూ.348 కోట్లతో పోలిస్తే ఇది 46 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.1,909 కోట్ల నుంచి 22.5 శాతం పెరిగి రూ.2,338 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 54 శాతం వృద్ధి చెంది రూ.722 కోట్లను తాకింది. షేరు ధర 55.89 శాతం పెరిగి రూ.6,099.75లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment