న్యూఢిల్లీ, సాక్షి: ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్‌కు యూఎస్ ప్రభుత్వ సలహా మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎమెర్జెన్సీ ప్రాతిపదికన వ్యాక్సిన్‌ను వినియోగించవచ్చంటూ సూచించింది. వ్యాక్సిన్ వినియోగంలో రిస్కులతో పోలిస్తే రోగులకు ఉపశమన అవకాశాలే అధికంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. యూకేలో అలెర్జీలున్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ను ఇవ్వవద్దంటూ ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్యానల్ సలహాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 20 మందితో ఏర్పాటైన వ్యాక్సిన్లు, సంబంధిత బయోలాజికల్ ప్రొడక్టుల సలహా కమిటీ(వీఆర్‌బీపీఏసీ) ఫైజర్ వ్యాక్సిన్‌కు 17-4 ఓట్లతో ఆమోదముద్ర వేసింది. దీంతో యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఫైజర్ వ్యాక్సిన్‌కు నేటి(11) నుంచి అనుమతి మంజూరు చేసే అవకాశమున్నట్లు ఫార్మా వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెకండ్‌వేవ్‌లో భాగంగా యూఎస్‌లో కేసులు, మరణాల సంఖ్య పెరగుతున్న కారణంగా యూఎస్‌ఎఫ్‌డీఏ త్వరితగతిన అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అభిప్రాయడ్డారు. యూఎస్‌లో కరోనా వైరస్ బారినపడినవారి సంఖ్య 1.5 కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 2.8 లక్షలకు చేరినట్లు తెలియజేశారు. .(తొలి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్- పరీక్షలకు రెడీ)
తప్పనిసరికాదు
నిపుణులు కమిటీ సూచనలను యూఎస్‌ఎఫ్‌డీఏ తప్పనిసరిగా పాటించవలసిన అవసరంలేదని సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామ్యంలో ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ వినియోగానికి ఇటీవల యూకే, కెనడా, బెహ్రయిన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ సలహా మండలి ఇచ్చిన నివేదిక సూచనలు మాత్రమేనని.. యూఎస్‌ఎఫ్‌డీఏ వీటికి కట్టుబడవలసిన అవసరంలేదని నిపుణులు తెలియజేశారు. కాగా.. యూఎస్‌లో పరిస్థితుల ఆధారంగా ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూఎస్‌ఎఫ్‌డీఏ వెనువెంటనే అనుమతించే వీలున్నట్లు అంచనా వేశారు.(అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు)
రాజీ పడబోము
రానున్న వారాల్లో దేశీయంగానూ కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తాజాగా పేర్కొన్నారు. అయితే సైంటిఫిక్, ఔషధ నియంత్రణ సంస్థల నిబంధనల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. కోవిడ్-19 కట్టడికి యూఎస్ హెల్త్‌కేర్ దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు తాజాగా యూఎస్ సలహా మండలి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో హర్షవర్ధన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల యూకే, కెనడా, బెహ్రయిన్ అనుమతించిన విషయం విదితమే. దేశీయంగా ప్రపంచస్థాయి సంస్థలున్నాయని, తద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నాయని హర్ష వర్ధన్ తెలియజేశారు. ప్రస్తుతం పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీ, పంపిణీ తదితర కార్యక్రమాలపై దృష్టిపెట్టినట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి సుమారు 260 వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయని, దేశీయంగా వీటిలో 8 వ్యాక్సిన్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు.()
Comments
Please login to add a commentAdd a comment