వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి ఆందోళనకరంగా విస్తరిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ తీసుకొని మహిళ మరణించిన ఘటన ఆందోళన రేపింది. పైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత గుండె సంబంధిత సమస్యలతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో ఫైజర్ టీకా కారణంగా దేశంలో తొలి మరణమని న్యూజిలాండ్ ఆరోగ్య అధికారులు ప్రకటించారు. టీకా కారణంగా ఉత్పన్నమైన మయోకార్డిటిస్ సమస్యతో ఆమె చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.
టీకా స్వీకరించిన తర్వాత అనారోగ్యంతో మహిళ మరణించిందని కోవిడ్ భద్రతా పర్యవేక్షణ బోర్డు సమీక్ష అనంతరం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బాధిత మహిళ వయస్సును ప్రకటించ లేదు. ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి అరుదైన సైడ్ఎఫెక్ట్ మయోకార్డిటిస్ కారణంగా మహిళ మరణం సంభవించిందని ఈ ప్రకటన పేర్కొంది. అయితే ఈ పరిణామంపై ఫైజర్ ఇంకా స్పందించాల్సి ఉంది. మయోకార్డిటిస్ అనేది గుండె కండరాల వాపు. ఇది రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. హృదయ స్పందనల తీరులో మార్పులకు కారణమవుతుంది.
కాగా కరోనాను పూర్తిగా కట్టడి చేసిన దాదాపు ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్‌లో డెల్టా వేరియంట్ భారీగా వ్యాప్తిస్తోంది. సోమవారం 53 కొత్త కేసులను నివేదించింది, ప్రస్తుత వ్యాప్తితో మొత్తం సంఖ్య 562 కి చేరుకుంది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. కాగా దేశంలో ఫైజర్/బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా టీకాలను న్యూజిలాండ్ అధికారులు తాత్కాలికంగా ఆమోదించారు.
Comments
Please login to add a commentAdd a comment