సాక్షి న్యూఢిల్లీ: గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు భారీ సాయం అందించేందుకు నిర్ణయించింది. 70 మిలియన్ డాలర్ల (రూ.510 కోట్లకు పైన) విలువైన మందులను ఇండియాకు అందివ్వనుంది. కంపెనీ చరిత్రలో మానవతా దృక్పథంతో అందించిన అతిపెద్ద సాయమని ఫైజర్ ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఫైజర్ ఇండియా ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందించారు. అలాగే తమ కరోనా వ్యాక్సిన్‌ను తొందరగా ఆమోదించుకునేలా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా తమకు అవకాశం రాలేదని తెలిపారు.
దేశంలోని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ఫైజర్ మందులు ఉచితంగా అందాలన్న ఉద్దేశంతోనే తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్బర్ట్ తెలిపారు. అవసరమైన వారికి ఆ మందులు అందలా ప్రభుత్వం, ఎన్జీవోలతో కలిసి పని చేస్తామన్నారు. అమెరికాతోపాటు యూరప్, ఆసియాలలోని తమ పంపిణీ కేంద్రాల నుంచి ఈ మందులను వెంటనే ఇండియాకు పంపనున్నట్లు ఫైజర్ చైర్మన్ ఆల్బర్ట్ బౌర్లా వెల్లడించారు. భారత్‌లో కరోనా కల్లోలం తమను ఆందోళనకు గురిచేస్తోందని, ఈ సమయంలో ప్రజల సంక్షేమం కోసం తాము ప్రార్థిస్తున్నామని ఆల్బర్ట్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment