Sun Pharmaceutical Industries Ltd.
-
సన్ ఫార్మా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 17 శాతం వృద్ధితో రూ. 2,524 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,166 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,241 కోట్ల నుంచి రూ. 12,381 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 8,943 కోట్ల నుంచి రూ. 9,561 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8.5 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. గ్లోబల్ స్పెషాలిటీసహా విస్తారిత వృద్ధిని సాధించినందుకు సంతోíÙస్తున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. రానున్న నెలల్లో నైడెల్జీ ఈఎంఏ ఫైలింగ్‌పై దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. మెలనోమాతోపాటు, మెలనోమాయేతర చర్మ కేన్సర్ల చికిత్సలో వినియోగించే బయోఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ ఇది. విభాగాలవారీగా ప్రస్తుత సమీక్షా కాలంలో దేశీయంగా సన్ ఫార్మా ఫార్ములేషన్ల అమ్మకాలు 11 శాతంపైగా పుంజుకుని రూ. 3,779 కోట్లకు చేరాయి. టారోసహా యూఎస్ విక్రయాలు 13 శాతం ఎగసి 47.7 కోట్ల డాలర్లను తాకాయి. వర్ధమాన మార్కెట్లలో ఇవి 2 శాతం నీరసించి 25.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి 13 శాతం అధికంగా 21.4 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించింది. ఏపీఐ విక్రయాలు 10 శాతం క్షీణించి రూ. 466 కోట్లకు చేరాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధిపై రూ. 825 కోట్ల పెట్టుబడులు వెచి్చంచింది. గత క్యూ3లో ఇవి రూ. 670 కోట్లు మాత్రమే. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్ఈలో 3.5 శాతం లాభపడి రూ. 1,419 వద్ద ముగిసింది. -
నష్టాల్లోకి సన్ ఫార్మా
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దేశీ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 2,277 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 894 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు అనుకోని నష్టం ప్రభావం చూపగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 8,464 కోట్ల నుంచి రూ. 9,386 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 3,273 కోట్ల లాభం ఆర్జించింది. 2020–21లో రూ. 2,904 కోట్ల లాభం మాత్రమే నమోదైంది. క్యూ4లో మొత్తం రూ. 3,936 కోట్లమేర అనుకోని నష్టాలు వాటిల్లినట్లు సన్ ఫార్మా పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు దాదాపు 2 శాతం క్షీణించి రూ. 888 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మా బైబ్యాక్
న్యూఢిల్లీ: సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ కంపెనీ రూ.1,700 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్‌కు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని సన్ ఫార్మా వెల్లడించింది. ఒక్కో షేర్‌ను రూ.425 ధరకు మించకుండా దాదాపు నాలుగు కోట్ల ఈక్విటీ షేర్ల(మొత్తం షేర్ల సంఖ్యలో 1.67 శాతం వాటా)ను బైబ్యాక్ చేస్తామని పేర్కొంది. ఈ షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన విధివిధానాలు, గడువు తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వివరించింది. షేర్ల బైబ్యాక్ అనంతరం కంపెనీలో ప్రమోటర్ల వాటా 54.69 శాతం నుంచి 55.61 శాతానికి పెరుగుతుంది. ప్రజల వాటా 45.31 శాతం నుంచి 44.39 శాతానికి తగ్గుతుంది. ఈ బైబ్యాక్ ధర మంగళవారం ముగింపు ధర.రూ.371 తో పోల్చితే 14.5 శాతం అధికం. -
సన్‌ఫార్మాకు ఇన్సైడర్ షాక్
సాక్షి,ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మ భారీ షాక్ తగిలించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసును తిరిగి చేపట్టనుందన్నవార్తలతో సన్ ఫార్మాస్యూటికల్ కౌంటర్లో భారీ అమ్మకాలకు దారితీసింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఈకౌంటర్‌కు అమ్మకాల సెగతాకింది. దీంతో సుమారు 10 శాతం పతనమైంది. వివరాల్లోకి వెళితే.. 2017లో సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీతోపాటు 9 మంది ఇతర వ్యక్తులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన దర్యాప్తును సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇందుకు రూ. 18లక్షలు చెల్లించారు కూడా. అయితే తాజాగా ఈ కేసును తిరిగి ఓపెన్ చేయాలని సెబీ భావిస్తున్నట్లు పీటీఐ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. సన్ ఫార్మా, కంపెనీ ప్రమోటర్లపై గతంలో నమోదైన ఇన్సైడర్ కేసుపై తిరిగి దర్యాప్తును చేపట్టాలని సెబీ సిద్ధమవుతోందని వార్తలొచ్చాయి. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వి, ఆయన సోదరుడు సుధీర్ వాలియా, 2001 సెక్యూరిటీల స్కామ్ కేతన్ పరేఖ్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ధర్మేష్ దోషితో ఆర్థిక వివాదానికి పాల్పడ్డారనేది విదేశీ రీసెర్చ్ సంస్థ మెక్వారీ ప్రధాన ఆరోపణ. అలాగే రాన్‌బాక్స్ ఒప్పందం సందర్భంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కంపెనీ ప్రమోటర్లు రూ. 8వేల కోట్లకు పైగా ప్రయోజనం పొందారని ఆరోపించింది. సంస్థ కార్పొరేట్ గవర్నెన్స్(పాలన)పై తాజాగా పలు సందేహాలను వ్యక్తం చేస్తూ భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కు 150 పేజీల లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు సన్ ఫార్మా కౌంటర్లో అమ్మకాలకు తెరతీసినట్లు విశ్లేషకులు తెలిపారు కాగా ఇవన్నీ10-15ఏళ్ల క్రితం ఆరోపణలనీ, వీటికి సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని సన్‌ఫార్మా వివరించింది. తాజా పరిణామం సంస్థకు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని రీసెర్చ్ సంస్థ యూబీఎల్ వ్యాఖ్యానించింది. కంపెనీ వివరణ మరోవైపు దీనిపై డిసెంబరు 3న (నేడు) సంస్థ సాయంత్రం 6.30నిమిషాలకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. తాజా ఆరోపణలపై కంపెనీ సీనియర్ అధికారులు ఇన్వెస్టర్లకు వివరణ ఇవ్వనున్నారు. -
రేసు గుర్రం..!
సెన్సెక్స్ 358 పాయింట్ల ర్యాలీ... 6,800 స్థాయికి నిఫ్టీ; 101 పాయింట్లు జంప్ బ్యాంకింగ్, మెటల్స్ షేర్ల పరుగు... భారత్ వృద్ధి మెరుగుపడవచ్చన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో బుధవారం స్టాక్ సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. కొత్త రికార్డులను తిరగరాసాయి. బ్యాంకింగ్, ఫార్మా, మెటల్స్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 22,740 పాయింట్ల నూతన గరిష్టస్థాయికి పరుగులు పెట్టింది. చివరకు 359 పాయింట్లు లాభపడి 22,702 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,800 పాయింట్ల శిఖరాన్ని అందుకుని, చివరకు 101 పాయింట్ల భారీ లాభంతో 6,796 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. భారత్ వృద్ధి రేటు 2014లో 5.4 శాతానికి పెరుగుతుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనాలు ప్రకటించిన మరుసటిరోజే సూచీలు పెద్ద ర్యాలీ నిర్వహించడం విశేషం. మార్చి 7 తర్వాత సెన్సెక్స్ ఇంత భారీ లాభాన్ని ఆర్జించడం ఇదే ప్రథమం. జీడీపీ వృద్ధి మెరుగుపడవచ్చన్న అంచనాలు, రూపాయి బలపడటం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంవంటి అంశాలతో వచ్చే రెండు నెలల్లో మార్కెట్ జోరుగా ర్యాలీ సాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 3.5 శాతం పెరిగిన బ్యాంకెక్స్: ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంగా పరిగణించే బ్యాంకింగ్ షేర్లు పరుగులు తీయడంతో బీఎస్ఈ బ్యాంకెక్స్ 3.45 శాతం పెరిగింది. ఎన్ఎస్ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతేశాతం ర్యాలీ జరిపింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు 3.5-5 శాతం మధ్య పెరిగాయి. మిడ్‌సైజ్ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 3.5-7.5 శాతం మధ్య ఎగిశాయి. సెన్సెక్స్‌లో భాగంగా వున్న 30 షేర్లలో 26 షేర్లు లాభాలతో ముగియగా, అన్నింటికంటే అధికంగా సన్‌ఫార్మా 6.6 శాతం పెరిగింది. ర్యాన్‌బాక్సీ లేబొరేటరీస్‌ను టేకోవర్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సన్‌ఫార్మాను బ్రోకింగ్ కంపెనీలు అప్‌గ్రేడ్ చేయడంతో ఈ ర్యాలీ సాధ్యపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిందాల్కో. లార్సెన్ అండ్ టూబ్రోలు సైతం 1.5-4 శాతం మధ్య ఎగిశాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాలు 1-3% మధ్య క్షీణించాయి. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో లాంగ్ బిల్డప్.. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 6,750 అవరోధస్థాయిని అధిగమించడంతో నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డేటా సూచిస్తున్నది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 46 పాయింట్లకు పెరగడంతో పాటు ఈ నెల ఫ్యూచర్లో ఒక్కసారిగా 15 లక్షల షేర్లు (9 శాతం) యాడ్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.82 కోట్ల షేర్లకు చేరింది. 6,800 స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో స్వల్పంగా లాంగ్ బిల్డప్ జరగ్గా, 6,900 కాల్ ఆప్షన్లో షార్ట్ కవరింగ్ ఫలితంగా ఓఐ నుంచి 3.68 లక్షల షేర్లు కట్ అయ్యాయి. ఈ రెండు కాల్ ఆప్షన్లలోనూ మొత్తం ఓఐ 40 లక్షల షేర్లలోపునే వుంది. 6,700 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ కారణంగా ఆ ఆప్షన్లో 13 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ మొత్తం ఓఐ 61.73 లక్షల షేర్లకు పెరిగింది. ఇంతభారీ ఓఐ మరే పుట్ ఆప్షన్లోనూ లేదు. సమీప భవిష్యత్తులో నిఫ్టీకి ఈ స్థాయి మద్దతు నివ్వవచ్చని, ఈ స్థాయిపై స్థిరపడితే కొద్దిరోజుల్లో 6,900 స్థాయిని దాటవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. 6,700 మద్దతుస్థాయిని కోల్పోతే క్రమేపీ మార్కెట్ బలహీనపడవచ్చన్నది ఈ డేటా సారాంశం.