సాక్షి,ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మ భారీ షాక్ తగిలించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసును తిరిగి చేపట్టనుందన్నవార్తలతో సన్ ఫార్మాస్యూటికల్ కౌంటర్లో భారీ అమ్మకాలకు దారితీసింది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఈకౌంటర్‌కు అమ్మకాల సెగతాకింది. దీంతో సుమారు 10 శాతం పతనమైంది.
వివరాల్లోకి వెళితే..
2017లో సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీతోపాటు 9 మంది ఇతర వ్యక్తులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించిన దర్యాప్తును సెటిల్‌మెంట్ చేసుకున్నారు. ఇందుకు రూ. 18లక్షలు చెల్లించారు కూడా. అయితే తాజాగా ఈ కేసును తిరిగి ఓపెన్ చేయాలని సెబీ భావిస్తున్నట్లు పీటీఐ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. సన్ ఫార్మా, కంపెనీ ప్రమోటర్లపై గతంలో నమోదైన ఇన్‌సైడర్ కేసుపై తిరిగి దర్యాప్తును చేపట్టాలని సెబీ సిద్ధమవుతోందని వార్తలొచ్చాయి.
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వి, ఆయన సోదరుడు సుధీర్ వాలియా, 2001 సెక్యూరిటీల స్కామ్ కేతన్ పరేఖ్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ధర్మేష్ దోషితో ఆర్థిక వివాదానికి పాల్పడ్డారనేది విదేశీ రీసెర్చ్ సంస్థ మెక్వారీ ప్రధాన ఆరోపణ. అలాగే రాన్‌బాక్స్ ఒప్పందం సందర్భంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా కంపెనీ ప్రమోటర్లు రూ. 8వేల కోట్లకు పైగా ప్రయోజనం పొందారని ఆరోపించింది. సంస్థ కార్పొరేట్ గవర్నెన్స్(పాలన)పై తాజాగా పలు సందేహాలను వ్యక్తం చేస్తూ భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కు 150 పేజీల లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు సన్ ఫార్మా కౌంటర్లో అమ్మకాలకు తెరతీసినట్లు విశ్లేషకులు తెలిపారు
కాగా ఇవన్నీ10-15ఏళ్ల క్రితం ఆరోపణలనీ, వీటికి సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని సన్‌ఫార్మా వివరించింది. తాజా పరిణామం సంస్థకు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని రీసెర్చ్ సంస్థ యూబీఎల్ వ్యాఖ్యానించింది.
కంపెనీ వివరణ
మరోవైపు దీనిపై డిసెంబరు 3న (నేడు) సంస్థ సాయంత్రం 6.30నిమిషాలకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. తాజా ఆరోపణలపై కంపెనీ సీనియర్ అధికారులు ఇన్వెస్టర్లకు వివరణ ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment