పీఏసీఎల్‌పై సెబీ కొరడా
రూ.7,270 కోట్ల జరిమానా
ముంబై: అక్రమంగా, మోసపూరితంగా ప్రజల నుంచి నిధులను సమీకరించినందుకు గాను పీఏసీఎల్, దాని నలుగురు డెరైక్టర్లపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 7,269.5 కోట్ల భారీ జరిమానా విధించింది. సామాన్యులను భారీగా మోసం చేసినందుకు కంపెనీపై సాధ్యమైనంత ఎక్కువ జరిమానా విధించడం అన్ని విధాలా సమంజసమేనని సెబీ వ్యాఖ్యానించింది. పదిహేనేళ్ల వ్యవధిలో ప్రజల నుంచి అక్రమంగా సమీకరించిన రూ. 49,100 కోట్లను వాపసు చేయాలంటూ గతేడాదే సెబీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో పీఏసీఎల్ సవాల్ చేసినప్పటికీ.. దానికి చుక్కెదురైంది.
ఇక, తాజా ఆదేశాల విషయానికొస్తే.. పీఏసీఎల్, దాని నలుగురు డెరైక్టర్లు.. తర్లోచన్ సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, గుర్మీత్ సింగ్, సుబ్రత భట్టాచార్య కలసి.. వ్యవసాయ భూముల కొనుగోళ్లు, అభివృద్ధి పేరిట సమష్టి పెట్టుబడి పథకాల కింద ప్రజల నుంచి అక్రమంగా నిధులు సమీకరించినట్లు తేలిందని సెబీ పేర్కొంది. తద్వారా.. ఏడాది కన్నా తక్కువ వ్యవధిలోనే కంపెనీ రూ.2,423 కోట్ల మేర లాభపడిందని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉదంతాలను మళ్లీ జరగకుండా కఠిన శిక్షలు, పెనాల్టీలు విధించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. సెబీ ఇం త భారీ ఎత్తున పెనాల్టీ విధించడం ఇదే ప్రథమం. నిర్దేశిత మొత్తాన్ని 45 రోజుల్లోగా కట్టాలంటూ పీఏసీఎల్, డెరైక్టర్లను సెబీ ఆదేశించింది.